జల్సా రాజాలు
♦ యువతుల మాయలో విలాసాలు
♦ మితిమీరుతున్న ఖర్చులు
♦ నగదు కోసం చోరీలు, చైన్ స్నాచింగ్‌లు
♦ పెడదారి పడుతున్న యువత
♦ జైలుపాలవుతున్న వైనం
తిరుపతి క్రైం:
నేడు కొందరు యువతీయువకులు రెండు పదు ల వయస్సు దాటకుండానే ప్రేమ పేరుతో జల్సాలు చేస్తున్నారు. చదువుల మాట మరచి పార్కుల బాట పడుతున్నారు. గర్ల్ ఫ్రెండ్ మోజులో పడిన వారి రోజు వారీ పద్దులు పెరుగుతున్నాయి. అమ్మాయిల మనస్సు గెలుచుకోవాలని ఆరాటంతో కానుకలు ఇచ్చేందుకు విచ్చల విడిగా ఖర్చులకు అలవాటు పడుతున్నారు. ఏదో ఒక పేరుతో తల్లిదండ్రుల నుంచి అందినంత తీసుకుంటున్నారు. డబ్బు దొరకని సమయంలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు.
తిరుపతి నగరంలో అడపాదడపా ఎక్కడో ఒకచోట చైన్ స్నాచింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తిరుచానూరు, ఎమ్మార్‌పల్లి స్టేషన్ల గంట వ్యవధిలోనే రెండు చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. అలాగే వివిధ దొంగతనాల్లో క్రైం పోలీసులు వందల మందిని అరెస్ట్ చేస్తున్నారు. వారిలో సగానికి పైగా యువకులే ఉంటున్నారు. విచారణలో వారు ప్రేమికురాలి కోసమే చోరీలకు పాల్పడుతున్నట్టు తేలింది.
ప్రవర్తనలో మార్పులు
పదో తరగతి పూర్తయి కళాశాలలో అడుగు పెట్టిన విద్యార్థుల్లో ప్రవర్తనలో మార్పు వస్తోంది. కొత్త స్నేహితులు జతకావడంతో ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులకు తెల్సిన ఖర్చులు కొన్ని అయితే తెలియకుండా పెరుగుతున్న ఖర్చులు మరొకొన్ని ఉంటున్నాయి. ఇంటర్‌మీడియట్, ఇంజినీరింగ్ చదువుతున్న యువకులు ఇప్పుడు తోటి స్నేహితులకంటే గర్ల్ ఫ్రెండ్స్‌తో గడుపుతున్నారు. ఏదో ఒక సంవత్సరంలో ఎవరో ఒక గర్ల్‌ఫ్రెండ్‌ను జతచేసుకుంటున్నారు.
చైన్‌స్నాచింగులకు రెక్కీలు
స్నేహితులతో బైక్‌లపై తిరుగుతూ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. రెండుమూడు సార్లు రెక్కీ నిర్వహిస్తున్నారు. ఆభరణాలు ధరించి ఒక్కరు లేక జంటగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేస్తున్నారు. వారి మెడల్లో ఉన్న బంగారు గొలుసులను లాక్కొని వెళుతున్నారు. దొంగల్లో యువకులే ఎక్కువ మంది నిందితులుగా ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని పోలీస్ అధికారులు చెబుతున్నారు. చిన్న వయసులోనే అమ్మాయిల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుని జైలు పాలవుతున్నారు. ఇప్పటి వరకు 2017లో జిల్లాలో 30 పైకి ఛైన్‌స్నాచింగ్‌లు జరిగాయి.
తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి
కళాశాలకు వెళుతున్న తమ కుమారులు ఎలా నడుస్తున్నారన్న విషయంపై తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వారి ప్రవర్తనలో మార్పు వస్తోందేమో చూడాలి. వెంటనే సున్నితంగా వారిని మందలించాలి. అదేపనిగా డబ్బు అడుగుతూ ఉంటే నెమ్మదిగా ఆరా తీసి పరిస్థితులను వివరించి చెప్పాలి. తగిన సమయంలో వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలి. తద్వారా పిల్లలు చెడుమార్గంలో నడవకుండా ఉంటారు.
పెరుగుతున్న ఖర్చులు
అమ్మాయితో జతకట్టాక ఖర్చు మామూలుగా ఉంటుదా మరి? వారి మెప్పు పొందడానికి సినిమాలు, పలకరింపుల కోసం పిజ్జాలు, ఇవేకాక పార్కులకు వెళ్లినప్పుడు ఖరీదైన ఐస్‌క్రీమ్‌లు, బర్త్‌డే, ఫ్రెండ్‌షిఫ్‌డే, లవర్స్‌డేలకు ఖరీదైన కానుకలు... ఇలా యువకుల పద్దు పెరిగిపోతోంది. ఇంట్లో తల్లిదండ్రులు ఇస్తున్న డబ్బులు ఈ ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదు. గర్ల్‌ఫ్రెండ్ గుండెల్లో చెరగని ముద్ర వేయించుకొనే తపనతో దొంగలుగా మారుతున్నారు.