రైతు కన్నీళ్లతో వ్యాపారమా! | YS Jagan meets farmers in Capital city, point out lack of development | Sakshi
Sakshi News home page

రైతు కన్నీళ్లతో వ్యాపారమా!

Published Fri, Jan 20 2017 2:02 AM | Last Updated on Tue, Aug 14 2018 3:30 PM

రైతు కన్నీళ్లతో వ్యాపారమా! - Sakshi

రైతు కన్నీళ్లతో వ్యాపారమా!

మూడేళ్లయినా.. రాజధానికి ఒక్క ఇటుక పడిందా?
సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్‌ ధ్వజం


రాజధానిలో అన్నీ తాత్కాలికమే.. ఒక్క శాశ్వత నిర్మాణమైనా చేపట్టారా?
బడుగుల భూములు సింగపూర్‌ కంపెనీల పరం
అన్నదాతలతో చంద్రబాబు కన్నీరు పెట్టిస్తున్నారు
రైతుల భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమా?
అమరావతి నిర్మాణానికి వేల ఎకరాలు ఎందుకు?
చెత్త కాగితాలపై రైతులకు ప్లాట్లు కేటాయిస్తున్నారు
భూమిపై ఆ ప్లాట్‌ ఎక్కడుందో చూపడం లేదు
ఆంక్షల నడుమ రాజధానిలో వైఎస్‌ జగన్‌ పర్యటన
పలు గ్రామాల్లో రైతులతో ముఖాముఖి


సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో
ముఖ్యమంత్రి చంద్రబాబు గద్దెనెక్కి దాదాపు మూడేళ్లవుతున్నా రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుకైనా వేసిన పాపాన పోలేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. తాత్కాలిక భవనాలతోనే కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల నుంచి వేల ఎకరాలు లాక్కొని, వారి కన్నీళ్లతో వ్యాపారం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. అమరావతికి వేలాది ఎకరాలు ఎందుకని ప్రశ్నిం చారు.  రాజధాని తెల్లతోలు, తెల్ల జుట్టు (సింగపూర్, ఇతర దేశాలు) ఉన్న వారికే అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని  నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి ఇచ్చేస్తామని ప్రకటించారు. పేదల భూములంటే చంద్రబాబు తన అత్త సొత్తు అనుకుంటున్నారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో రైతుల భూములను లాక్కోవడానికి ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు ఉపక్రమించడం, లంక భూములు, అసైన్డ్‌ భూములను రైతుల నుంచి కొట్టేయడానికి కుట్ర చేస్తున్న నేపథ్యంలో... బాధిత రైతులకు అండగా నిలిచేందుకు జగన్‌ గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఉదయం హైవేపై పాత టోల్‌గేట్‌ వద్ద, మధ్యాహ్నం నిడమర్రులో, సాయంత్రం లింగాయపాలెంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వారి కష్టాలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా జగన్‌ ఏం చెప్పారంటే...


బలవంతపు భూసేకరణ వల్ల నష్టపోతున్న రైతులకు భరోసా కల్పించడానికి రాజధాని గ్రామాలకు వస్తుంటే ఆంక్షలు విధిస్తున్నారు. సచివాలయం మీదుగా వెళ్లడానికి కూడా అవకాశం లేదంటున్నారు. ప్రతిపక్ష నేత పర్యటించడానికీ అవకాశం లేదంటూ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కత్తితో పొడుస్తున్నారు.  చంద్రబాబు దగ్గరుండి మరీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయించడాన్ని చూసి సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది.

ఏయే గ్రామాలకు వెళ్లకుండా అడ్డుకున్నారో.. ఆ గ్రామాల ప్రజలు వచ్చి బాధలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. వారి బాధలు విన్న తర్వాతైనా ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగి బుద్ధి వస్తుందని ఆశిద్దాం. ప్రజలంతా ఒక్కటై చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలో వస్తుంది.

‘భూసేకరణ’ బాధిత రైతులకు అండగా నిలిచేందుకు నేను రాజధానిలో పర్యటిస్తుంటే.. సాయంత్రానికి ముఖ్యమంత్రి, మంత్రులు టీవీల ముందుకు వస్తారు. రాజధాని రావడం జగన్‌కు ఇష్టం లేదంటూ బండలు వేస్తారు. చంద్రబాబు ఇక్కడ (రాజధానిలో) అద్దె(బాడుగ) ఇళ్లు తీసుకొని ఉంటున్నారు. నేను ఇక్కడ స్థలం కొని ఇల్లు నిర్మించుకుంటా.

రాష్ట్రమంతటా రిజిస్ట్రేషన్ల రేట్లు 200 శాతం పెంచారు. కానీ, రాజధాని గ్రామాల్లో మాత్రం పెంచలేదు. తక్కువ ధరలకే రైతుల భూములు లాక్కోవడానికి చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన చేశారు. ఆయన దుర్బుద్ధికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. భూములు తీసుకొనేటప్పుడు మార్కెట్‌ రేటు ఇవ్వాలనే జ్ఞానం కూడా ముఖ్యమంత్రికి లేదు. రైతుల ఉసురు పోసుకొని, వారి భూములతో వ్యాపారం చేస్తున్నారు. నచ్చిన కంపెనీలకు, నచ్చిన ధరకు భూములు కట్టబెట్టి కమీషన్లు మింగేస్తున్నారు.

రాజధానిలో గ్రామాలు, ఇళ్లు సింగపూర్‌ వాళ్లకు నచ్చడం లేదని వాటిని తొలగించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. రోడ్ల నిర్మాణం పేరిట పేదల ఇళ్లను కూల్చేస్తున్నారు.

చంద్రబాబు అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తోంది. ఈ మూడేళ్లలో రాజధానిలో జరిగిన అభివృద్ధి శూన్యం. రాజధానిలో ఒక్క ఇటుకా కనపడలేదు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ.. ముఖ్యమంత్రి అన్నీ తాత్కాలికమే అంటున్నారు. హా గన్నవరం విమానాశ్రయం నుంచి రాజధానికి అనుసంధానం చేసే రోడ్లను ప్రభుత్వం ఈ మూడేళ్లలో నిర్మించలేకపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందే భూసేకరణ జరిగిన ఎన్‌హెచ్‌–5, ఎన్‌హెచ్‌–9 అనుసంధాన రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేక ప్రభుత్వం చతికిలపడింది.

సీనీ దర్శకుడితో రాజధాని మాస్టర్‌ ప్లాన్‌  
రాజధానికి ఇప్పటికీ పూర్తిస్థాయి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయలేదు. సింగపూర్, చైనా, శ్రీలంక.. ఏ దేశానికి సీఎం వెళితే ఆ దేశం మాస్టర్‌ ప్లాన్‌ ఇస్తుందని చెబుతారు. ఆఖరికి  బాహుబలి సినిమాలోని సెట్టింగ్‌ల్లాంటి మాస్టర్‌ ప్లాన్‌ను దర్శకుడు రాజమౌళి తయారు చేసి ఇస్తారని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి అవినీతిలో కూరుకుపోయారు. మద్యం, ఇసుక, దేవాదాయ భూములు.. వేటినీ వదల్లేదు. తాత్కాలిక సచివాలయ భవనాన్నీ వదల్లేదు. 6 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణానికి రూ.650 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఖర్చంతా  భవన నిర్మాణానికేనట! స్థలం కొని, ఫ్లాట్‌ కట్టిస్తే చదరపు అడుగుకు రూ.1,700 తీసుకుంటుం డగా... తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణానికే చదరపు అడుగుకు చంద్రబాబు ప్రభుత్వం రూ.10 వేలు చెల్లించింది. ఎందుకు అంత ధర చెల్లించారో, ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసు.

రాజధానికి ఎన్ని ఎకరాలు కావాలి? భూ సమీకరణ కింద ఇప్పటికే 27 వేల ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ భూములు 21 వేల ఎకరాలు ఉన్నాయి. మొత్తం 48 వేల ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉంది. అయినా అవి చాలవన్నట్లు పేదలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీల అసైన్డ్‌ భూములను, రైతుల పట్టా భూములను లాక్కోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్ని వేల ఎకరాలు తీసుకున్నా ఇప్పటికీ శాశ్వత సచివాలయం, శాసనసభ, హైకోర్టు లాంటి భవనాల ఊసే కనిపించడం లేదు.

⇔  రాజధానిలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టులో రూ.5,700 కోట్ల పెట్టుబడులు పెట్టే రాష్ట్ర ప్రభుత్వానికి 42 శాతం మాత్రమే ఉంటుందట! కేవలం రూ.307 కోట్ల పెట్టుబడులు పెట్టే సింగపూర్‌కు 58 శాతం వాటా ఇస్తారట! దోపిడీ కోసమే ప్రభుత్వం స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని తెరపైకి తెచ్చింది.

రైతుల పట్టా భూములు తీసుకొని, పరిహారం ఇస్తున్న ప్లాట్లను ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. కేటాయించిన ప్లాట్‌ ఎక్కడుందో భూమి మీద మార్కింగ్‌ చేసి చూపించడం లేదు. భూమి తీసుకున్న గ్రామం పరిధిలోనే ప్లాట్లు కేటాయించకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారు. కావాల్సిన వారికి, బినామీలకు మాత్రం వారికి ఇష్టమైన చోట ప్లాట్లు కేటాయిస్తున్నారు.

ప్లాటు కేటాయింపును చెత్తకాగితం మీద రాసి ఇస్తున్నారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి తదితర హామీల విషయంలో కూడా చంద్రబాబు సంతకంతో ఉన్న పత్రాలను ఇంటింటికీ పంచారు. కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఆ పత్రాలకు ఉన్న విలువ ఎంతో ప్రజలకు తెలుసు. చిత్తుకాగితం మీద రాసిస్తున్న ప్లాట్ల కేటాయింపుదీ అదే పరిస్థితి. వాటికి చట్టబద్ధత లేదు. చంద్రబాబు మాట తప్పరనే నమ్మకమూ ప్రజలకు లేదు.

ఇచ్చిన ప్లాట్ల వద్దకు వెళ్లి చూస్తే... అక్కడ మార్కింగ్‌ లేదు. విద్యుత్, రోడ్లు, డ్రెయినేజీ.. ఏమీ లేవు. ఆ ప్లాట్లను ఏం చేసుకోవాలి? అమ్ముకోవడానికి కూడా రైతులకు అవకాశం ఇవ్వడం లేదు.

పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కువ సహాయం చేయాలి. మనసున్న ముఖ్యమంత్రి ఎవరైనా అదే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి తీసుకున్న అసైన్డ్‌ భూములకు తక్కువ ప్యాకేజీ ఇవ్వడం అన్యాయం. వారి పట్ల వివక్ష చూపించడం దుర్మార్గం.

లంక భూములున్న ఎస్సీలకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయింపు చేయలేదు. కనీసం ఇస్తామని కూడా చెప్పడం లేదు. ఎస్సీలకు ప్లాట్లు ఇచ్చినా అవి ఎక్కడున్నాయో చూపించడం లేదు.

భూ సమీకరణ చేస్తున్న సమయంలో గ్రామాలు, ఇళ్ల జోలికి రాబోమని ప్రభుత్వం ప్రకటించింది. సమీకరణకు భూములు ఇవ్వడానికి నిరాకరించిన గ్రామాలపై ఇప్పుడు కక్ష గట్టింది. ఆ ఊర్లు, ఇళ్లు తొలగించాలని కంకణం కట్టుకుంది. 200 అడుగుల మేర రోడ్డు వేస్తున్నామంటూ గ్రామాలు, ఇళ్లను కూల్చేస్తున్నారు. భూములు ఇవ్వని గ్రామాల్లో బలవంతపు  భూ సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయడం అన్యాయం.

లంక భూములకు సంబంధించిన పట్టాలు, టైటిల్‌ డీడ్స్‌ రైతుల వద్ద ఉన్నా.. అడంగళ్లలో వారి పేర్లు తొలగించి ప్రభుత్వ భూమిగా చూపించడం దుర్మార్గం. లంక భూములను చంద్రబాబు బినామీలు రైతులను బెదిరించి కారు చౌకగా కొట్టేశారు. బినామీలు కొన్న తర్వాత ఆ భూములకు ప్లాట్లు ఇచ్చే నీచమైన, దౌర్భాగ్యమైన పరిస్థితులు రాజధానిలో నెలకొనడం దారుణం.

రాజధాని నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ వద్ద వస్తుందంటూ చంద్రబాబు మొదట్లో లీకులు ఇచ్చారు. ప్రజలు అక్కడ దృష్టి పెట్టినప్పుడు చంద్రబాబు బినామీలు, అధికార పార్టీ నేతలు అసలు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. కావాల్సిన వారంతా చౌకగా భూములు కొనేసిన తర్వాత చంద్రబాబు రాజధాని ప్రకటన చేశారు. అంతటితో ఆగలేదు. బినామీల భూములను ల్యాండ్‌ పూలింగ్‌ పరిధి నుంచి తప్పించారు. బినామీల భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. రైతుల భూములున్న ప్రాంతాలను అగ్రిజోన్‌గా వ్యవసాయానికే పరిమితం చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం రైతుల భూములను లాక్కొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. మూడేళ్లు పూర్తవుతున్నా రాజధానిలో ఒక్క ఇటుక కూడా వేయలేదు. రాజధాని నిర్మిస్తారనే నమ్మకం ప్రజల్లో పోయింది. బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యం.
 
రైతులు కూరగాయాల దుకాణాలే పెట్టుకోవాలా?
రాజధానికి 2,000 ఎకరాలు సరిపోతుంది. రోడ్ల నిర్మాణానికి భూములు తీసుకుంటే చాలు. మిగతా భూముల్లో జోనింగ్‌ చేసి విడిచిపెడితే.. రైతులు ఇష్టమైతే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటారు, లేదంటే వ్యవసాయం చేసుకుంటారు.

రైతుల కళ్లల్లో చంద్రబాబు కన్నీళ్లు చూస్తున్నారు. ఈ పరిస్థితిని వైఎస్సార్‌సీపీ మారుస్తుంది.

ప్రభుత్వం తీసుకున్న భూముల్లో హైపర్‌ మార్కెట్లు, సూపర్‌ మార్కెట్లు, స్టార్‌ హోటళ్లు, భారీ మాల్స్, 22 అంతస్తులు నిర్మించుకోవచ్చట! కానీ రైతులకు ఇచ్చిన వాణిజ్య ప్లాట్లలో కూరగాయల దుకాణాలు, బార్బర్‌ షాపులు మాత్రమే పెట్టుకోవాలట. జి+12కే నిర్మాణాన్ని పరిమితం చేయాలని నిబంధనలు విధించారు.  

రాజధానిలో సామాజిక ప్రభావ మదింపు అంచనా నివేదికలు బూటకం. తూతూమంత్రంగా పూర్తి చేశారు. ప్రజల అభిప్రాయాలకు ఆ నివేదికల్లో చోటు లేకపోవడం అన్యాయం. చంద్రబాబు సింగపూర్‌కు వెళ్లకముందు జరీబు భూములుగా ఉన్నవి, సింగపూర్‌కు వెళ్లి వచ్చిన తరువాత మెట్టగా మారిపోయాయి.  

రైతుల భూములను బలవం తంగా లాక్కోవడానికి చంద్రబాబు సర్కారు సాగిస్తు ్తన్న కుయుక్తులను గట్టిగా ప్రతిఘటిస్తాం. చూస్తూ ఉండగానే మూడేళ్లు గడిచిపోయాయి. మరో రెండేళ్లు భూములను కాపాడుకుంటే ఆ తర్వాత ఎవరూ ఏమీ చేయలేరు.

దేవుడి దయ ఉంటే ఏడాదిలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. లంక, అసైన్డ్‌ భూములున్న దళితులు భూమి పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన ప్రభుత్వం.. అంటే ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేస్తాం.

జాబు రావాలంటే బాబు పోవాలి
‘‘బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చింది. ఇప్పుడు రాజధానిలో తమకు బతుకుతెరువు పోయింది’’ అని రైతులు ప్రతిపక్ష నేత జగన్‌ ముందు వాపోయారు. జగన్‌ స్పందిస్తూ... ‘జాబు రావాలంటే బాబు పోవాలి’ అన్నారు. దీంతో రైతులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.

డెల్టా రైతులకు అండగా నిలుస్తాం..
కృష్ణా డెల్టా గ్రామాల్లో మినుము, అపరాలు సాగుజేసి నిండా మునిగిపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని రైతులు వైఎస్‌ జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయనను డెల్టా రైతులు కలుసుకున్నారు. తమ కష్టాలను వివరించారు. 50 ఏళ్లలో ఇంతటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. రెండేళ్లుగా వ్యవసాయంతో నష్టపోయామని, పరిహారం కోసం తమ పేర్లను ప్రభుత్వం కనీసం నమోదు చేయడం లేదని చెప్పారు. డెల్టా రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని, న్యాయం జరిగే వరకూ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.  

నేడు ప్రకాశం జిల్లాలో జగన్‌ పర్యటన  
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం గురువారం రాత్రి కందుకూరు చేరుకున్న జగన్‌ స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో బస చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన ఫ్లోరోసిస్, కిడ్నీ బాధితులను కలసి వారి కష్టాలు తెలుసుకుం టారు.  ఆ సమస్యను వెలుగులోకి తీసుకురావడం ద్వారా ఆరోగ్య శ్రీని కాపాడటంతో పాటు  ప్రభుత్వానికి ప్రజారోగ్య బాధ్యతను గుర్తుచేసేందుకు బాధ్యతగలిగిన ప్రతిపక్షనేతగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement