ఎర్రిపల్లిలో వేరుశెనగ పంట పరిశీలించిన వైఎస్ జగన్
పులివెందుల : జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన శుక్రవారం పులివెందుల మండలం ఎర్రిపల్లిలో పర్యటించారు. వర్షాలు లేక దెబ్బతిన్న వేరుశెనగ పంటలను వైఎస్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత ముందు రైతులు తమ కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా...ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన వైఎస్ జగన్.... బాధిత రైతులకు అండగా ఉంటానంటూ భరోసా కల్పించారు. పంటలు ఎండిపోతున్నా...ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘జిల్లాలో 71వేల హెక్టార్లలో వేరుశెనగ పంట వేశారు. దాదాపు అన్నిచోట్లా పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. 70 రోజుల తర్వాత కూడా కాయలు రాలేదు. జూన్ లో కాస్తో కూస్తో వర్షాలు పడ్డాయి. జూలైలో చాలీచాలని వర్షాలు, ఆగస్టులో అసలు వర్షాలే పడలేదు.
వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. జూన్ 7న ఎస్ఎల్బీసీ సమావేశం పెట్టారు. ఆగస్టు 12న జరగాల్సిన మీటింగ్ను ఇప్పటివరకూ జరపలేదు. సీజన్ అయిపోయాక ఈ నెల 15న జరుపుతారట. రుణాలు మాఫీ అవ్వక, ఇన్సూరెన్స్ అందక రైతులు అల్లాడిపోతున్నారు. 2015-16 క్రాఫ్ ఇన్సురెన్స్ ఇప్పటివరకూ ఇవ్వలేదు. శ్రీశైలంలో 845 అడుగుల నీరుంటేనే పోతిరెడ్డిపాడుకు నీళ్లొస్తాయి. కానీ కరెంట్ కోసమని శ్రీశైలం నుంచి ఎడాపెడా నీళ్లువాడి 780 అడుగులకు తీసుకెళ్లారు. 854 అడుగులు లేకపోతే రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు. గండికోటకు 10 టీఎంసీల నీరు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పటివరకూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీనే ఇవ్వలేదు. మరి నీరు ఏకరంగా ఇస్తారో చెప్పాలి. బ్రహ్మంసాగర్ కు 12 టీఎంసీల నీళ్లిస్తామని ఇప్పటివరకూ ఇవ్వలేదు. 2008లో వైఎస్ఆర్ మాత్రం ఇచ్చారు.
చంద్రబాబు రెండేళ్లలో ఒక్క టీఎంసీ నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. హంద్రీనీవా, గాలేరి-నగరి అన్ని ప్రాజెక్టులు నత్తనడకనే నడుస్తున్నాయి. వైఎస్ఆర్ హయాంలో ఈ ప్రాజెక్టులన్నీ 80 శాతం పూర్తయ్యాయి. మిగతా 20 శాతాన్ని కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు రెయిన్ గన్లను తానే కనిపెట్టినట్లు చెబుతున్నారు. పులివెందులలో 4వేల ఎకరాలకు నాలుగు రెయిన్ గన్లు ఇచ్చారు. వాటితో 4వేల ఎకరాలను ఎలా కాపాడతారు. వరదలొచ్చినప్పుడు ఎవరైనా ఏరియల్ సర్వే నిర్వహిస్తారా? కానీ చంద్రబాబు మాత్రం కరువును తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వే చేస్తే కరువు తీవ్రత తెలుస్తుందా?.
రాయలసీమలో 8లక్షల హెక్టార్లలో వేరుశెనగ పంట వేస్తే 7 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయింది. కానీ చంద్రబాబు మాత్రం 61వేల హెక్టార్లలోనే పంట దెబ్బతిందని 42వేల హెక్టార్లలో రెయిన్ గన్స్ తో కాపాడామని అబద్ధం చెబుతున్నారు. కేవలం 18 వేల హెక్టార్లలో మాత్రమే పంటనష్టం జరిగిందంటున్నారు. ఇన్సూరెన్స్ కూడా రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి. 2015-16 ఇన్పుట్ సబ్సిడీని వెంటనే చెల్లించాలి. ఈ ఏడాది ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలి’ అన్నారు.