
నేటి నుంచి వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
► ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రారంభం
► తొలిరోజు మూడు కుటుంబాలకు పరామర్శ
► అనంతపురం జిల్లాలో 7 రోజులపాటు యాత్ర
అనంతపురం: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుంచి చేపట్టనున్న నాలుగో విడత ‘రైతు భరోసా యాత్ర’లో పరామర్శించనున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక 2015 డిసెంబర్ 31 నాటికి అనంతపురం జిల్లాలో 146 మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నేనున్నానంటూ వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు జగన్ యాత్ర చేపడుతున్నారు.
ఇప్పటికే జిల్లాలో మూడు విడతల్లో 42 కుటుంబాలను పరామర్శించారు. నాలుగో విడత ‘భరోసా యాత్ర’ను బుధవారం నుంచి 7 రోజులపాటు ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో కొనసాగించనున్నారు. ఈ యాత్ర వివరాలను వైఎస్సార్‌సీపీ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం వెల్లడించారు. జగన్ బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా కొడికొండ చెక్‌పోస్టు మీదుగా ధర్మవరం పట్టణానికి చేరుకుంటారు. భరోసా యాత్ర ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది. ఈ నియోజకవర్గం పరిధిలో ఆత్మహత్యలు చేసుకున్న 12 మంది చేనేత కార్మికులు, ముగ్గురు రైతు కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు.
వైఎస్సార్ కాలనీలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులు రమాదేవి, రమేశ్ దంపతుల కుటుంబాన్ని ముందుగా పరామర్శిస్తారు. అనంతరం కప్పల నారాయణస్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి లోనికోటకు చేరుకుని రైతు గవ్వల కుళ్లాయప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు.