- జిల్లా నాయకులు జిల్లేపల్లి సైదులు
ఖమ్మం రూరల్: వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు జిల్లేపల్లి సైదులు పేర్కొన్నారు. శనివారం మండలంలోని గుదమిళ్లలో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. వైఎస్‌ఆర్ సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని, వైఎస్‌ఆర్ హయాంలో చేపట్టిన రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్ట్‌ల పేర్లు మార్చి రీడిజైన్ చేయడం సరైంది కాదన్నారు. రైతుల కోసం ఒకే దఫా రుణమాఫీ చేసి రైతు పక్షపాతిగా వైఎస్‌ఆర్ నిలిచారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతసేపూ ఇతర పార్టీల నుంచి ఎవరిని చేర్చుకోవాలనే ధ్యాస తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన చేయడంలేదని, ఒక్క సభ్యులు ఉన్న వారి రేషన్ కార్డులను తొలగించడానికి కుట్ర పన్నుతోందని విమర్శించారు. రెతులకు మూడో విడత రుణమాఫీ సొమ్ము ఇంతవరకు బ్యాంక్‌లకు జమచేయకపోవడంతో రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం నానా అవస్థలు పడుతున్నారని, విధిలేని పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పుచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, అయినా ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలనే ధ్యాసేలేదన్నారు. రాబోవుకాలంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ పోరాటాలు చేస్తుందని, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎండపల్లి వెంకయ్య, చల్లా హనుమంతు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, తమ్మిశెట్టి క్రిష్ణ, పెనుగొండ వెంకటేశ్వర్లు, చేకూరి సైదులు, తమ్మిశెట్టి బాబు, చల్లా సాంబశివరావు, చల్లా లక్ష్మా, నాగయ్య, వీరబాబు, గోపి, ఉపేందర్, మోహన్‌రావు, హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.