నా దేవుడు..! | ysr jayanthi special story | Sakshi
Sakshi News home page

నా దేవుడు..!

Published Fri, Jul 8 2016 1:47 AM | Last Updated on Mon, Aug 20 2018 4:17 PM

నా దేవుడు..! - Sakshi

నా దేవుడు..!

తూప్రాన్: ఈమె పేరు లక్ష్మీనర్సమ్మ. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ బారి నుంచి బయటపడి ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి ఆమెకు ఆయనే దైవమయ్యాడు. ఇలా ఎందరెందరో ఆయన పథకాల ద్వారా లబ్ధిపొందారు. అంతరంగాల నిండా ఆయన రూపాన్నే నింపుకొన్నారు.

రైతు బాంధవుడు.. ఆరోగ్య ప్రదాత.. సంక్షేమ పథకాలు
పేదల దరిచేర్చిన మహనీయుడు.. విద్యార్థుల్లో వెలుగులు నింపిన విద్యాదాత.. దివంతగ నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇప్పటికీ ప్రజల్లో గుండెల్లో కొలువై ఉన్నారు. నేడు ఆయన జయంతి సందర్భంగా కొందరి అంతరంగాలు...

దంపతులకు పునర్జన్మ
వర్గల్: వర్గల్‌కు చెందిన పెద్ది నర్సింగరావు, భవానీ దంపతులకు వరుణ్ సాయి, సుమశ్రీ పిల్లలు. పేదరికం కారణంగా 2006లో బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. నర్సింగరావు నగల దుకాణంలో గుమాస్తాగా చేరారు. ఈక్రమంలో భవానీకి గుండెజబ్బు సోకింది. లక్షల విలువైన వైద్యం చేయిస్తే తప్ప భార్య బతకదని తెలిసి నర్సింగరావు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో అతను కూడా గుండె జబ్బు బారినపడ్డారు. ఒకరికి శస్త్ర చికిత్స జరిపించడమే గగనం అనుకుంటున్న తరుణంలో ఇద్దరినీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పునర్జన్మనిచ్చింది.

జీవితాంతం రుణపడి ఉంటాం
సదాశివపేట రూరల్: ఇతని పేరు మహ్మద్ రహీం. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధిపొందారు. సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన రహీం నిరుపేద వ్యవసాయ కూలి. పొలం నుంచి ఎడ్లబండిపై పత్తిని తీసుకొస్తుండగా.. ప్రమాదవశాత్తు బండి చక్రాల కింద పడిపోయాడు. నడుము విరిగిపోయింది. నరాలు చిట్లిపోయాయి. వైద్యానికి అవసరమైన రూ.లక్షలను ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే చెల్లించింది. ‘జీవితాంతం వైఎస్‌కు రుణపడి ఉంటా’ అని ఆయన తెలిపారు.

ఆయన వల్లే మంచి ఉద్యోగం
కల్హేర్: ‘దివంగత సీఏం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కలిపించారు. రిజర్వేషన్‌తో ఇంటర్, డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదివా. దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి.. మేలు చేశారు. నాలా చాలా మంది ఆయన చలవతో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.’ అని చెప్పారు కల్హేర్‌కు చెందిన ఎండీ సలీం.

రుణమాఫీతో గట్టెక్కా..
కోహీర్: ‘నాకున్న మూడెకరాల పొలంలో చెరకు పంట వేశా. ఇందుకోసం ఎస్‌బీఐ దిగ్వాల్‌లో రూ.50 వేల పంట రుణం తీసుకున్నా. ఆ సంవత్సరం చెరకు క్రషింగ్ సక్రమంగా లేకపోవడంతో నష్టాలు మిగిలాయి. పెట్టుబడులు తిరిగిరాకపోగా.. అప్పు మిగిలింది. వడ్డీతో కలిసి అప్పు రూ.80,600 అయ్యింది. అదే సమయంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతు రుణమాఫీ ప్రకటించాడు. దీంతో రుణం మాఫీ అయ్యింది. ఆయన మేలు ఈ జన్మలో మరచిపోలేను’. - తలారి తుల్జయ్య, రైతు-దిగ్వాల్

ఆదుకున్న పావలావడ్డీ 
దౌల్తాబాద్: ‘దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహిళల ఆర్థిక స్వావలంభనకు ఎంతో తోడ్పడ్డారు. 12 ఏళ్ల కిందట మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరా. వైఎస్ హయాంలో పావలా వడ్డీ కింద తీసుకున్న రుణంతో పాడి గేదెలు తీసుకున్నా. పాల వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో నెలవారీ వాయిదాలు చెల్లించా. తక్కువ వడ్డీ కావడంతో ఆ రుణం చాలా ఉపయోగపడింది’.
- తిప్పగౌని పద్మ, రాజ్యలక్ష్మీ మహిళ సంఘ సభ్యురాలు, కోనాపూర్, దౌల్తాబాద్

రీయింబర్‌‌సమెంట్‌తో లాభం
వెల్దుర్తి: 2009వ సంవత్సరం నుంచి 2013 వరకు హైదరబాద్ సమీపంలోని నిజాంపేటలో రుషి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివా. ఐటీ గ్రూప్ తీసుకున్నా. ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల ఉచితంగా చదువులు పూర్తిచేశారు. 2014లో చెన్నై కాగ్నిజెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. మండలంలో దాదాపు 10 పది ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా చదువుకున్నారు. అంతా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.  - కె. స్వాతి. వెల్దుర్తి

 ఇంజినీరింగ్ పూర్తిచేశా
జహీరాబాద్ టౌన్: ‘నా పేరు అబ్దుల్ ముర్తజా. జహీరాబాద్‌లోని మూసానగర్ కాలనీలో ఉంటాం. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల ఇంజినీరింగ్ పూర్తి చేశా.  - అబ్దుల్ ముర్తుజా, జహీరాబాద్

 దేవుడులేని జాతర
మెదక్: ‘వైఎస్ రాజశేఖరరెడ్డి లేని రాష్ట్రం దేవుడు లేని జాతరలాంటిది. ఆయన మాకు ఇచ్చిన భూమిని దున్నుకొని జీవిస్తున్నాం.ప్రజల కష్టాల్ని కళ్లారా చూసి పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిండు.’.. అని మెదక్ మండలం బి.భూపతిపూర్ గిరిజన తండాకు చెందిన నునావత్‌నాజీ వైఎస్‌ను గుర్తుచేసుకొని కంటతడి పెట్టారు.

ఆయన వల్లే తిండి గింజలు
కౌడిపల్లి: ‘ఆ మారాజు దయతో ఇన్ని తిండి గింజలు పండించుకుంటున్నం. ఎన్నో ఏళ్లుగా సాగుచేసిన భూమిపై ఎలాంటి పట్టా లేకుండే. అడవుల్లో పంట పండించుకునేవాళ్లుం. రాజశేఖర్‌రెడ్డి సార్ పట్టాలు ఇవ్వడంతో గిప్పుడు మాకిన్ని తిండి గింజలు దొరుకుతున్నయి.’ అని కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్ పంచాయతీ కన్నారం శేరితండాకు చెందిన గిరిజన రైతు దంపతులు కెతావత్ దుర్గ్య, ముత్యాలి తెలిపారు. శేరితండాకు చెందిన దంపతులు కెతావత్ దుర్గ్య, ముత్యాలుకు నలుగురు కొడుకులు.  వెఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అటవీ హక్కు చట్టం రావడంతో వీరికి లాభించింది.  కాస్తులో ఉన్న రెండెకరాల భూమిపై పట్టా హక్కు పత్రాలను అందుకున్నారు.  
   - దుర్గ్య, రైతు కన్నారం శేరితండా

‘ఫైజాబాద్’తో లాభాలు
కౌడిపల్లి:  దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి చలవతో ఫైజాబాద్ ఎత్తిపోతల పథకంతో నాలుగేళ్లు రెండు పంటలు పండాయి. అంతకు ముందు 15 సంవత్సరాలు అవుసలోని కుంట కింద రెండెకరాల సాగుభూమి ఉన్నా నీళ్లు లేక బీళ్లుగా మారడంతో ఇబ్బంది పడ్డాం. ఎత్తిపోతల పథకం 2011లో పూర్తికావడంతో చెరువు, కుంటలకు నీరు వచ్చింది. వానాకాలం, యాసంగి దాదాపు 800 ఎకరాల్లో రెండు పంటలు పండించాం. మంచి లాభాలు వచ్చాయి.  - బక్క శ్రీశైలం, రైతు, ఫైజాబాద్, కౌడిపల్లి మండలం

అప్పు మాఫీ చేసిండు
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతుల అప్పులు మాఫీ చేసి ఆదుకున్న దేవుడు. 2004 నుంచి వరుసగా కరువు ఉండటంతో పంటలు పండలేదు. అప్పులపాలైనం. రైతుల బాధలు తెలుసుకున్న వైఎస్‌ఆర్ అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేసిండు. - కట్కూరి నారాయణరెడ్డి, రైతు నంగునూరు

పెరిగిన గ్రూపుల సంఖ్య
శివ్వంపేట: శివ్వంపేట మండలంలో 2003 సంవత్సరంలో 250 డ్వాక్రా గ్రూపులు ఉండగా వైఎస్‌ఆర్.. పావలావడ్డీ పథకం అమలు చేయడంతో 2004-2009 మధ్య గ్రూపుల సంఖ్య 750కి చేరింది. బ్యాంక్ ద్వారా 2002 సంవత్సరంలో రూ.30 వేలు మొదటిసారిగా రుణం పొంది అధిక వడ్డీ చెల్లించాం.  ఆపై 2004లో వైఎస్‌ఆర్ మహిళల కోసం పావలా వడ్డీ పథకం ప్రవేశపెట్టడంతో లక్షల్లో రుణాలు పొందారు.   
- భాగ్యమ్మ, తేజస్విని గ్రూపు అధ్యక్షురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement