
సింగూరు ప్రాజెక్టు(ఫైల్)
- 2006లో కాలువ పనులకు శంకుస్థాపన
- రూ.89.98 కోట్లు కేటాయించిన ఘనత
జోగిపేట: సింగూరు జలాలను కాలువల ద్వారా వేలాది ఎకరాలకు అందించేందుకు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకుగాను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారు. రూ.89.98 కోట్లు మంజూరు చేయించారు. 2006 జూన్ 7న పుల్కల్ మండలం సింగూరుకు స్వయంగా వచ్చి పనులకు శంకుస్థాపన చేశారు.
కాలువల నిర్మాణం ద్వారా 40 వేల ఎకరాలకు నీరు అందించేందుకు పథకాన్ని అప్పట్లో రూపొందించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో పనుల్లో జాప్యం జరిగింది. 2013లో సింగూరు ద్వారా అందోలు పెద్ద చెరువులోకి సింగూరు నీటిని తరలించడంతో సుమారు 20 గ్రామాల చెరువులకు నీరు చేరింది.
దీనివల్ల వందల ఎకరాల్లో రైతులు రెండు పంటలు పండించుకుంటున్నారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా అందోలు నియోజకవర్గానికి నీరందించాలన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం ఇప్పుడిప్పుడే నెరవేరుతుంది. ఈ ప్రాంత రైతులు ఇప్పటికీ రాజన్నను గుర్తుచేసుకుంటున్నారు.
వైఎస్ వల్లే సాధ్యమైంది
సింగూరు ప్రాజెక్టు ద్వారా సేద్యానికి నీరందిస్తామని దాదాపు 30 ఏళ్లుగా ఎంతో మంది సీఎంలు హామీ ఇచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ ఇదే విషయాన్ని చెప్పేవారు. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలను చేపట్టిన ఏడాది తర్వాత కాలువల నిర్మాణానికి రూ.89.98 కోట్లు మంజూరు చేశారు. స్వయంగా వచ్చి పనులు కూడా ప్రారంభించారు. ఆయన తర్వాత వచ్చిన వారు కాలువల పనులను పూర్తి చేయలేకపోయారు. సింగూరు నీటిపైనే ఈ ప్రాంత రైతులు ఆధార పడి ఉన్నారు. అటువంటి మహానేతను పోలిన నాయకులు భవిష్యత్తులో వచ్చే పరిస్థితిలేదు. ఆయనే బతికి ఉంటే ఇప్పటికే కాలువల పని పూర్తయ్యేది. - ముస్లాపురం భాగయ్య, రైతు, పోసానిపేట, మం: అందోల్