ఒకే సారి నగదు చెల్లించాలి
ఒకే సారి నగదు చెల్లించాలి
Published Thu, Dec 29 2016 12:18 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
ధాన్యం కొనుగోళ్లపై వైఎస్సార్ సీపీ డిమాండ్
నగదు విత్‌డ్రాకు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు పెట్టాలి
వచ్చే నెల పింఛను నగదు చేతికే ఇవ్వాలి
లేదంటే ప్రత్యక్ష ఉద్యమాలు తప్పవు
కిరోసిన్ పంపిణీ రద్దు ఓ అరాచక నిర్ణయం
నగదు రహితం ఓ ప్రచార ఆర్భాటం
విలేకర్లతో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు
సాక్షి, రాజమహేద్రవరం : ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును బ్యాంకుల్లో ఒకేసారి చెల్లించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. అసలే గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్న రైతన్నకు నోట్ల రద్దు చిక్కుల్లోపడి విలవిలలాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల కూలీల చెల్లింపులకు, రెండో పంట పెట్టుబడికి నగదు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ కార్యాలయంలో రాజమహేద్రవరం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాలతో కలసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రైతులు వారి కష్టార్జితాన్ని తీసుకుకోవడానికి కూడా బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. జిల్లాలో 284 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 10,29,272 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 4,89,837 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారని తెలిపారు. దీనికి సంబంధించి రైతులకు రూ. 718 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 627 కోట్లు జమచేశారని వివరిచారు. ఏటీఎంలలో రోజుకు రెండువేలు, బ్యాంకుల్లో వారానికి రూ.24వేల చొప్పున ఇస్తే ఈ నగదంతా రైతులకు చేరాలంటే ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. ఒక నిర్ణయం వల్ల ఎంలాంటి ఇబ్బందులు వస్తాయో ముందస్తు అంచనా లేకుండా అనాలోచితంగా పెద్దనోట్లను రద్దు చేశారని కన్నబాబు ధ్వజమెత్తారు. ధాన్యం నగదును తీసుకునే వీలులేక, సహకార బ్యాంకులు రుణాలు ఇవ్వక రైతులు రెండో పంట పెట్టుబడులను ఎలా సమకూర్చుకోవాలో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు.
పింఛ¯ŒS నగదు చేతికి ఇవ్వకపోతే
ఉద్యమాలు తప్పవు...
సీఎం చంద్రబాబు అనాలోచిత నిర్ణయం వల్ల వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. జిల్లాలో ఆరు లక్షల మందికి సామాజిక పింఛన్లుండగా వీరిలో రెండు లక్షల మంది బ్యాంకు ఖాతాలు మనుగడలోలేవన్నారు. మరో లక్ష మందికి అస్సలు ఖాతాలే లేవని, ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం ’గుడ్డెద్దు చేలో పడినట్లు’గా ఉందన్నారు. వచ్చే నెల నుంచి పింఛ¯ŒSను లబ్ధిదారుల చేతికే ఇస్తామని సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే లబ్థిదారులతో కలిసి ప్రత్యక్షంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చిరించారు.
గ్యాస్ ఉంటే దీపం వెలుగుతుందా?
దీపం కనెక్షన్లు ఇస్తున్నామంటూ కిరోసి¯ŒS పింపిణీ రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అరాచకంగా ఉందని కన్నబాబు ధ్వజమెత్తారు. జిల్లాలో విద్యుత్ లేని గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయని, పలు గ్రామాల్లో విద్యుత్తు కోతలు కూడా ఉంటున్నాయన్నారు. ఆయా గ్రామాల్లో ఉండే ప్రజలు గ్యాస్ ద్వారా దీపాలు వెలిగించుకోవాలా అని ప్రశ్నించారు.
నగదు రహితం అంతా ప్రచార ఆర్భాటం..
వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటం కోసం పాలన సాగిస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. మోరీ గ్రామాన్ని నగదు రహితంగా చేస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని, అసలు జిల్లాలో పెద్ద దుకాణాలు, పెట్రోల్ బంకుల్లో కూడా స్వైపింగ్ మిషన్లు లేని విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. వేల మంది వ్యాపారులు స్వైపింగ్ మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటి వరకూ అందలేదని గుర్తు చేశారు. జన్మభూమి కమిటీలపై ఆ పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వాటిపై సీఎం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని సార్లయినా శంఖుస్థాపనులు చేసినా ఫర్వాలేదుగాని, సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. 2018 నాటికి పోలవరం పూర్తయితే పురుషోత్తపట్నం ఎందుకో చంద్రబాబే చెప్పాలన్నారు. రూ.1981.54 కోట్ల నాబార్డు రుణాన్ని పోలవరం ప్రాజెక్టుకు కాకుండా పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు ఉపయోగిస్తారేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. సమావేశంలో రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ గిరిజాల వీర్రాజు, ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, మజ్జి నూకరత్నం, పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణస్థాయి వివిధ విభాగాల నేతలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement