- అన్ని వర్గాలకూ సముచిత ప్రాధాన్యం
- కాకినాడ మేయర్ పీఠం వైఎస్సార్‌సీపీదే
- మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
కాకినాడ: ప్రజా సమస్యల పట్ల అవగాహన, పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేయడంతోపాటు సమర్థతను గుర్తించి కాకినాడ కార్పొరేషన్ నుంచి పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేశామని వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. స్థానిక సరోవర్ పోర్టికోలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని కులాలు, వర్గాలకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చామన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు, పార్టీ నేతలు, ఇతర వర్గాల నుంచి విస్తృత స్థాయిలో అభిప్రాయాలు సేకించిన తరువాతే అభ్యర్థుల జాబితాను ప్రకటించామన్నారు. ఓసీ కేటగిరిలో కాపులకు 17 స్థానాలతోపాటు బీసీ వర్గాల్లోని తూర్పు కాపులకు రెండు, శెట్టిబలిజలకు 4, మత్స్యకార వర్గాల్లోని అగ్నికుల క్షత్రియ, వాడబలిజ, జాలర్లకు ఐదు సీట్లు ఇచ్చామన్నారు. కమ్మ 2, ఎస్టీ 1, ఎస్సీలకు 4 ఇచ్చామన్నారు. బీసీల్లో వెనుకబడిన వర్గాల్లోని వెలమ, గవర, ఉప్పర, శెట్టిబలిజలకు తగిన రీతిలో సీట్లు కేటాయించామన్నారు. వైశ్య, ముస్లింలకు ఒకొక్కటి, రెడ్దిక కులానికి మూడు ఇచ్చామన్నారు. మూడున్నరేళ్ల తెలుగుదేశం పాలనలో అవినీతిమయమైందని, విజ్ఞులైన కాకినాడ ఓటర్లు ప్రభుత్వ అవినీతి, అసమర్థ విధానాలను గమనించి తమ ఓటు ద్వారా తెలుగుదేశం పాలకులకు బుద్ధి చెప్పాలని ధర్మాన పిలుపునిచ్చారు.
బాబు వల్లే స్మార్ట్ సిటీ వెనుకడుగు...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థ విధానాల వల్లే కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీలో కాకినాడ వెనుకబడిందని మాజీ మంత్రి ధర్మాన పేర్కొన్నారు. మూడేళ్ల కిందటే కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి ఉంటే కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీపై పాలకవర్గ పర్యవేక్షణ ఉండి అభివృద్ధిలో ఈ ప్రాంతం ముందడుగువేసి ఉండేదన్నారు. దురదృష్టవశాత్తు టీడీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకుండా అడ్డుతగులుతోందని, న్యాయస్థానం జోక్యంతో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కాకినాడ ఎన్నికలకు ముందుకు వచ్చిందన్నారు. నిధులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల కాకపోవడం, నిధుల వినియోగ పత్రాలు సకాలంలో పంపించకపోవడం వల్ల కేంద్ర నిధులు విడుదల కావడంలేదన్నారు.
జీవోల మాయాజాలం...
తెలుగుదేశం ప్రభుత్వం అనేక రహస్య జీవోలను విడుదల చేస్తోందని ధర్మాన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తరువాత 1500లకు పైగా ఇలాంటి జీవోలు విడుదలయ్యాయని, దేశంలో ఇలా ఎక్కడా జరగలేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని, పౌరుల హక్కులకు భంగం కలగకూడదని, సమాచార హక్కు చట్టాన్ని కేంద్రం తెచ్చినా దానికి కూడా దొరకకుండా జీవోలు ఉంటున్నాయన్నారు.
వైఎస్సార్‌సీపీని గెలిపించండి...
విజ్ఞులైన కాకినాడ ఓటర్లు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మాజీ మంత్రి ధర్మాన విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో పార్టీ పట్ల ఎంతో ఆదరణ కనిపిస్తోందన్నారు. ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోగలమన్న ధీమాను ధర్మాన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేస్తున్న పలువురు అభ్యర్థులకు నాయకులు ధర్మాన, బొత్స బి ఫారాలు అందజేశారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, కాకినాడ పార్లమెంట్ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, కాకినాడసిటీ కో–ఆర్డినేటర్లు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి బొబ్బిలి గోవిందు తదితరులు పాల్గొన్నారు.