
కాసేపట్లో వైఎస్ఆర్ సీపీ కీలక నేతల భేటీ
గుంటూరు: ప్రత్యేక హోదా విషయంలో మరింత వేగంతో ముందుకు పోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన దీక్షా స్థలివద్దే పార్టీ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే అంశంతోపాటువైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపైనే చర్చించనున్నారు.
మరోపక్క, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం వైద్యులు వైఎస్ జగన్కు వైద్య పరీక్షలు చేశారు. వైఎస్ జగన్ బరువు తగ్గి బాగా నీరసించిపోయారు. షుగర్ లెవల్స్ పడిపోయాయి. వైఎస్ జగన్ ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బీపీ 110/70, పల్స్ రేట్ 66 ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం వైఎస్ జగన్కు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక దీక్షకు రోజురోజుకు మద్దతు ఎక్కువవుతోంది. విద్యార్థులు, యువకులు, రైతుల సమర దీక్షకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.