సోమశిల ముంపువాసులకు న్యాయం చేయాలి
► పునరావాసం కల్పించకుండా ఖాళీ చేయాలనడం అన్యాయం
►వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్: సోమశిల ముంపు వాసుల సమస్యలు పరిష్కరించకుండా వారిని ఖాళీ చేయమనడం అన్యాయమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబుతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సోమశిల ప్రాజెక్టు వల్ల జిల్లాలోని అట్లూరు, భాకరాపేట, ఒంటిమిట్ట, నందలూరు మండలాల పరిధిలోని రైతుల భూములు, ఇళ్లు, ఆస్తులు ముంపునకు గురై తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల నెల్లూరు జిల్లా రైతులకు మాత్రమే మేలు జరిగిందన్నారు. ఒంటిమిట్ట, పెన్నపేరూరు, తప్పెటవారిపల్లె గ్రామాల రైతుల భూములు చాలా వరకూ ముంపునకు గురయ్యాయన్నారు. వారికి అధికారులు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని, పునరావాసం కల్పించలేదన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముంపువాసులకు వారు కోరినదానికన్నా ఎక్కువగా నష్టపరిహారం అందించారని గుర్తు చేశారు.
రైతులు తక్షణం ఖాళీ చేయాలని ఫారెస్ట్ అధికారులు ఒత్తిడి చేయడం అన్యాయమన్నారు. పైర్లు పెట్టుకోవద్దని బలవంతం చేయడం సరికాదన్నారు. సోమశిల ముంపు రైతులకు నష్టపరిహారం చెల్లించి, పునరావాసం కల్పించిన తర్వాతే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. ముంపు వాసుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28వ తేదీ రైతులతో కలిసి భాకరాపేట నుంచి కడపకు పాదయాత్ర నిర్వహించి, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు చెప్పారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు ముంపుగ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలు తెలుసుకున్నారని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.
27న టోల్‌గేట్ ఎదుట ధర్నా– ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
చెన్నూరు, చిన్నమాచుపల్లెలో రహదారి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27వ తేదీ టోల్‌గేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కడప నుంచి కర్నూల్ వరకు కేఎంసీ అనే సంస్థ రహదారిని నిర్మించిందని, ఈమేరకు టోల్‌గేట్ వసూలు చేస్తోందన్నారు. చెన్నూరు, చిన్నమాచుపల్లెలో అప్రోచ్, సర్వీసురోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేదన్నారు. దీనివల్ల పలు కాలనీలకు చెందిన 18వేల మంది ప్రజలు నిత్యం అగచాట్లు పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని తాము పలుసార్లు కేఎంసీ వారి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనిపించలేదని చెప్పారు. రహదారి విస్తరణ వల్ల ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి ఈనాటికి నష్టపరిహారం ఇచ్చి, పునరావాసం కల్పించలేదన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యేవరకూ ధర్నా విరమించే ప్రసక్తేలేదన్నారు. జి ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్, మైనార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌ఏ కరిముల్లా, ఎస్‌ఎండీ షఫీ పాల్గొన్నారు.