న్యాయం జరిగే వరకు పోరు | ysrcp fact finding committee visits acharya nagarjuna university | Sakshi
Sakshi News home page

న్యాయం జరిగే వరకు పోరు

Published Tue, Aug 4 2015 2:12 AM | Last Updated on Thu, Jul 26 2018 1:30 PM

న్యాయం జరిగే వరకు పోరు - Sakshi

న్యాయం జరిగే వరకు పోరు

రిషితేశ్వరి కేసులో దోషుల్ని రక్షించేందుకు కొందరి ఆరాటం
* వైఎస్సార్ సీపీ నేతల మండిపాటు
* పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏఎన్‌యూ గేటు వద్దే నిలిపివేత
* నిరసనగా ధర్నా చేసిన నేతలు
* సిటింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ జరపాలని డిమాండ్

ఏఎన్‌యూ: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో అసలు దోషులను రక్షించేందుకు యూనివర్సిటీ, ప్రభుత్వ అధికారులు ఆరాటపడుతున్నారని, అందుకే ఆంక్షలు విధిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు.

ఈ కేసులో న్యాయం జరిగేవరకు పోరాడతామని స్పష్టంచేశారు. రిషితేశ్వరి మృతిపై వైఎస్సార్ సీపీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు కె.పార్థసారథి, వంగవీటి రాధాకృష్ణ, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా అధికారులను కలిసేందుకు సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)కి వచ్చారు. వీరిని ప్రధాన ద్వారం వద్ద పోలీసులు, వర్సిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పార్టీ నేతలు అక్కడే ధర్నా చేసి, యూనివర్సిటీ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం పోలీసుల అనుమతితో లోపలికి వెళ్లిన నేతలు ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.ఆర్.ఎస్.సాంబశివరావును, రిజిస్ట్రార్‌ను కలసి పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సెలవుల్లో ఉండగా కమిటీలు విచారణ జరపడం ఏమిటని ప్రశ్నించారు. ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావును రక్షించేందుకు ప్రభుత్వ డెరైక్షన్‌లో వర్సిటీ అధికారులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. వర్సిటీ నిజనిర్ధారణ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు.

ప్రభుత్వ అనుమతి తీసుకుని నివేదిక ఇస్తామని విసీ తెలిపారు. రిషితేశ్వరి మృతిపై సిటింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని, దీనికి వెంటనే వర్సిటీ పాలకమండలి ఆమోదం తెలపాలని నేతలు డిమాండ్ చేశారు. ఈనెల 6వ తేదీన తమపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరోసారి యూనివర్సిటీలో పర్యటిస్తారని, అదేరోజు బాలసుబ్రహ్మణ్యం కమిటీ ముందు వాదనలు, అనుమానాలు తెలియజేస్తారని ఇన్‌చార్జి వీసీకి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement