– తీవ్ర వివాదాస్పదమవుతోన్న జేసీ వ్యాఖ్యలు
– కుల ప్రస్తావనతో ప్రజల్లో చిచ్చురేపే యత్నం
– మొన్న కమ్మ.. నేడు రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు
– శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయన్న విపక్షాలు
– ఎంపీ దిష్టిబొమ్మలు దహనం చేసిన వైఎస్సార్‌సీపీ...తీవ్రంగా తప్పుబట్టిన రాజకీయ పార్టీ నేతలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘అనంత కార్పొరేషన్‌లో మేయర్, కమిషనర్, ఎమ్మెల్యేకు కులపిచ్చి పట్టుకుంది. కులపిచ్చితో కార్పొరేషన్‌ను అవినీతి కూపంగా మార్చి సర్వనాశనం చేస్తున్నారు.’
– కొన్నాళ్ల కిందట ‘కమ్మ’ సామాజిక వర్గ నేతలపై జేసీ వ్యాఖ్యలు.
‘రెడ్లు ఇతర కులాల వారిని పెళ్లి చేసుకున్నట్లుగా ఎవ్వరూ చేసుకోవడం లేదు. పెళ్లి అని చెప్పగానే ఏ కులమైనా తాళిబొట్టు కడుతున్నారు.’
– రెడ్ల సామాజికవర్గంపై ముచ్చుమర్రిలో ఈ నెల 2న జేసీ వ్యాఖ్యలు.
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇటీవల కాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అనంత’తో పాటు రాష్ట్రంలో సుదీర్ఘరాజకీయ అనుభవమున్న నేతల్లో జేసీ ముందువరుసలో ఉంటారు. అయితే.. అనుభవానికి తగ్గట్లుగా హుందాగా మాట్లాడకపోవడం, తోటి ప్రజాప్రతినిధులను గౌరవించకపోవడంతో తరచూ విమర్శలకు గురవుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇటీవల కుల ప్రస్తావన చేస్తూ జేసీ చేసిన వ్యాఖ్యలు కొన్ని సామాజికవర్గాల్లో చిచ్చురేపుతున్నాయి. కులాలతో పనిలేకుండా రెడ్లు అందరినీ పెళ్లిళ్లు చేసుకుంటారని మాట్లాడడంపై ఆ సామాజిక వర్గం నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అలాగే ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అగౌరవ పరిచేలా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. జేసీ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. జేసీ తీరును తూర్పారబట్టారు.
నాలుగు దశాబ్దాల అనుభవం దేనికో?
జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఎదిగారు. పీసీసీ చీఫ్ మార్పు సమయంలో ప్రతిసారీ రేస్‌లో నిలిచారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇలాంటి నేతలు రాజకీయాల్లో భావితరాలకు ఆదర్శంగా నిలవాలి. కానీ ప్రతిపక్ష నేతను గౌరవించాలనే స్పృహ కూడా లేకుండా పదేపదే అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని రాజకీయవర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో జేసీ తనస్థాయిని దిగజార్చుకుంటున్నారని ఆ వర్గాలు అంటున్నాయి. జేసీ కంటే వయసులో పెద్దవారైన నేతలు ఆయన్ను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో ఆత్మపరిశీలన చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు హితవు పలుకుతున్నాయి. అవకాశవాద రాజకీయం కోసమే జేసీ విచక్షణ మరిచి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నాయి. కర్నూలు జిల్లాలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభం సందర్భంగా సోమవారం జేసీ మాట్లాడుతూ చంద్రబాబు రెడ్డికాకపోయినా రాయలసీమకు నీళ్లిస్తున్నారని చేసిన వ్యాఖ్యలను మేధావులు కూడా తప్పుబడుతున్నారు.
‘రాయలసీమలో రెడ్లు మినహా ఇతర సామాజికవర్గాల వారు లేరా? రాయలసీమకు నీళ్లివ్వడం అంటే రెడ్లకు ఇవ్వడమా? ముఖ్యమంత్రి కులాలను బేరీజు వేసుకుని నీళ్లు ఇవ్వాలనే మెసేజ్‌ను జేసీ పంపుతున్నారా?’ అనే కోణంలో మేధావులు ఖండిస్తున్నారు. 2014 వరకూ కాంగ్రెస్‌లో కొనసాగిన జేసీ.. ఏపీలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైన తర్వాత విధిలేని పరిస్థితిలో పచ్చకండువా వేసుకున్నారని, చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు ఓ ప్రాంతాన్ని ఓ సామాజిక వర్గానికి ముడిపెట్టడం ద్వారా ఇతర సామాజిక వర్గాలను కించపరిచినట్లేనని ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీలో వారు కొనసాగే స్వేచ్ఛ ఉందని, కానీ రెడ్లు మొత్తం జేసీదివాకర్‌రెడ్డికి ‘పవర్‌ఆఫ్ అటార్నీ’ రాసిచ్చినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.
ఈ వాస్తవాలు తెలీదా?
రాయలసీమకు సాగునీటి కోసం పోతిరెడ్డిపాడు వరకూ పాదయాత్రలు చేశామని, నీటి కష్టాలను చంద్రబాబే తీరుస్తున్నారని, మరోసారి అవకాశం ఇస్తే ప్రాజెక్టులు పూర్తి చేస్తారని జేసీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి హంద్రీ–నీవా శంకుస్థాపన తర్వాత 1995–96 నుంచి 2003–04 బడ్జెట్ వరకూ చంద్రబాబు రూ.190కోట్లు మాత్రమే కేటాయిస్తే.. అందులోనూ రూ.24.53 కోట్లే ఖర్చుపెట్టారు. జేసీ కూడా మంత్రిగా ఉన్న వైఎస్ ప్రభుత్వం 2004–05 నుంచి 2009–10 వరకూ రూ.3,399.74 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి, అంతకంటే ఎక్కువగా రూ.4,340.36 కోట్లు ఖర్చు చేసింది. ఆపై రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు రూ.2,143కోట్లు ఖర్చుపెట్టాయి. అంటే రూ.6,850 కోట్ల అంచనాతో చేపట్టిన హంద్రీ–నీవాకు 2004–2014 మధ్య కాలంలో రూ.6,483కోట్లు ఖర్చుపెట్టి 85 శాతం పనులు పూర్తి చేశారు. తక్కిన రూ.367కోట్ల పనులు చేయాల్సిన టీడీపీ ప్రభుత్వం.. రూ.5వేల కోట్లకుపైగా అంచనా వ్యయాన్ని పెంచి దోపిడీ చేస్తోంది. ఇవన్నీ జేసీకి తెలుసు. అయినా చంద్రబాబే హంద్రీ–నీవాకు నీళ్లిచ్చారని ఇటీవల వ్యాఖ్యానించారు.
గాలేరు–నగరి, వెలిగొండతో పాటు చాలా ప్రాజెక్టులదీ ఇదే పరిస్థితి. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి కూడా వైఎస్ శంకుస్థాపన చేశారు. ఇవన్నీ మరిచి జేసీ అన్నీ చంద్రబాబే చేశారనేలా మాట్లాడటంపై ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జేసీ మాట్లాడుతున్నారంటే ఆసక్తిగా వినేవాళ్లమని, ఇప్పుడు ఆయన మైకు తీసుకుంటే ఏదో కామెడీగా మాట్లాడతారు.. కాసేపు నవ్వుకుందామనేలా పరిస్థితి ఉందని ప్రజలంతా చర్చించుకుంటున్నారు. తన తండ్రి పేరుతో చేపట్టిన జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని ఇప్పటికీ ఆయన పూర్తి చేయించలేకపోతున్నారని, తాడిపత్రి మునిసిపాలిటీ ప్రజలు తాగునీటితో అల్లాడుతుంటే దేశంలోనే బెస్ట్ మునిసిపాలిటీ అని బీరాలు పలుకుతున్నారని, ముందు తన ఇంటి సమస్యలు పరిష్కరించుకుని, ఆపై ఊరిబాగులకు రావాలని ప్రతిపక్షపార్టీలు హితవు పలుకుతున్నాయి.
నిప్పు రా ‘జేసీ’..
Published Wed, Jan 4 2017 12:03 AM | Last Updated on Thu, Aug 16 2018 5:07 PM
Advertisement