కార్పొరేషన్‌పై వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేద్దాం
కార్పొరేషన్‌పై వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేద్దాం
Published Mon, Sep 19 2016 11:24 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
– కార్యకర్తల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి పిలుపు
కర్నూలు(ఓల్డ్‌సిటీ): త్వరలో జరిగే కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేద్దామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, ఎంపీ బుట్టా రేణుక, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు, ఆలూరు శాసన సభ్యులు ఐజయ్య, గుమ్మనూరు జయరాం, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఓటమి భయంతోనే ప్రభుత్వం కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేస్తుందని, అయితే, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు అమరావతి తప్ప రాయలసీమ సమస్యలు పట్టడం లేదన్నారు. శ్రీశైలం నీటిమట్టం తగ్గించి సీమ రైతులకు అన్యాయం చేశారన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు ఇప్పుడు మాట మార్చారని చెప్పారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర పాలన గాలికొదిలేసి విదేశీ పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతోనే చంద్రబాబు నాయుడు కేంద్రానికి ప్రత్యేక హోదా అడగలేకపోతున్నారని విమర్శించారు. హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అబద్దాలతో పాలన కొనసాగిస్తున్నారని, ప్రజలు సరైన సమయంలో ఓటుతో బుద్ధిచెబుతారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, నాయకులు సత్యంయాదవ్, రాజశేఖర్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్లో ఉండండి– ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. నగరంలోని 51 వార్డులు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకోవాలని, ఇందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, రాష్ట్రాభివద్ధి జగన్‌తోనే సాధ్యమని వారు భావిస్తున్నారని చెప్పారు.
పార్టీ కోసం పనిచేసేవారికి ఉజ్వల భవిష్యత్తు– ఎంపీ బుట్ట
పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో కర్నూలు కార్పొరేషన్‌ను గెలుచుకుని‡ వైఎస్ జగన్‌కు గిఫ్ట్‌గా ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
జేబులు నింపుకునేందుకే ప్రత్యేక ప్యాకేజీ– గౌరు
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఏపీకి అన్యాయం చేశాయని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. టీడీపీ మంత్రులు, నాయకులు, కార్యకర్తల జేబులు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీ వైపు మొగ్గుచూపారని విమర్శించారు.
Advertisement