
'మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేది'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రికి 'ప్రైవేటు' చికిత్సపై ఆయన మండిపడ్డారు. మంత్రిగారు మోచిప్ప మార్పిడి కన్నా మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. శనివారం అంబటి రాంబాబు ఇక్కడ మాట్లాడుతూ 'మంత్రిగారు జీజీహెచ్లో శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బయట నుంచి ప్రయివేట్ వైద్యుల్ని తెప్పించుకుని ఆపరేషన్ చేయించుకున్నారు. రోగులకు, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించడం కోసం సాక్షాత్తూ మంత్రిగారే ఆపరేషన్ చేయించుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే మంత్రిగారి నిర్వాకం వల్ల జీజీహెచ్ ప్రతిష్ట మరింత దిగజారిపోయింది.
ఆయన బయట నుంచి డాక్టర్లను తెప్పించుకుని ఆపరేషన్ చేయించుకుంటున్నారు. డాక్టర్లేమో బయటవారు, బెడ్స్ మాత్రం గవర్నమెంట్వా? ఇలా చేస్తే ప్రభుత్వ ఆస్పత్రి పరువు ప్రతిష్టలు పెరుగుతాయా? గవర్నమెంట్ ఆస్పత్రుల పరువు ప్రతిష్టలు దిగజార్చేలా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రవర్తించారు. జీజీహెచ్ ప్రతిష్ట ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతగా దిగజారిపోయిందో మనం చూశాం. పసిపిల్లల్ని ఎలుకలు కొరుక్కు తిన్నాయి. ఆ ఎలుకల్ని తినడానికి పాములు వచ్చాయి. ఒక జూ పార్కులా గవర్నమెంట్ ఆస్పత్రి దిగజారిపోయింది. మంత్రిగారి చర్యలో అది మరింత పడిపోయిందని' మండిపడ్డారు.
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసులు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి రకరకాల వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పనిగట్టుకుని విచ్చలవిడిగా అక్రమ కేసులు పెట్టి, ప్రధాన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని, చంద్రబాబు, ఆయన ప్రభుత్వం పని చేస్తున్నట్లు తేటతెల్లం అవుతోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలీసులకు వైఎస్ఆర్ సీపీ నాయకుల మీద కేసులు పెట్టడం తప్ప మరే పనేమీ కనిపించడం లేదని అంబటి రాంబాబు అన్నారు.
వైఎస్ఆర్ సీపీ నాయకుల్ని అణచాలని, కేడర్ను భయపెట్టాలని చూస్తున్నారని, ఇది ఎక్కువ కాలం సాగదన్నారు. రేణిగుంట విమానాశ్రయం ఘటనలో ఆధారాలు ఉంటే బయటపెట్టాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సవాల్ చేస్తే ఏవో రెండు క్లిప్పింగ్స్ బయటపెట్టి, ఆధారాలు విడుదల చేశామని టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని అంబటి విమర్శించారు. వాటిలో మిథున్ రెడ్డి కానీ, చెవిరెడ్డి కానీ లేరనే విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు.