
తాత వయసు ఉన్న బాబు.. చంద్రన్నా?
విశాఖ : భోగాపురం విమానాశ్రయం భూసేకరణపై విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అని చెప్పి ఉత్తరాంధ్రలో గ్రీన్ఫీల్డ్ లేకుండా చేస్తున్నది నిజం కాదా? అని ఆయన సోమవారమిక్కడ ప్రశ్నించారు. రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ తాత వయసులో ఉన్న చంద్రబాబు ....రైతన్న కోసం చంద్రన్నగా అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు.
అన్ని మండలాల్లో భూముల విలువలను పెంచిన ప్రభుత్వం భోగాపురం వచ్చేసరికి ఎందుకు సవరించలేదని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్గా వ్యవహరిస్తున్నారని, టీడీపీకి మద్దతిచ్చిన గ్రామలన్నింటినీ వదిలిపెట్టి మిగిలిన భూములను సేకరించడం ఎంతవరకు సమంజసమన్నారు. భోగాపురం భూసేకరణపై ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనకు బీజేపీ అనుకూలమా? వ్యతిరేకమా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన....ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు సవాల్ విసిరారు.