వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్ట్
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు హైవేపై బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను కలిసేందుకు కిర్లంపూడి వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పార్టీ నేతలు అంబటి రాంబాబు, రౌతు సూర్యప్రకాశ్, జక్కంపూడి రాజా, తోట సుబ్బారావు నాయుడు, సుంకర చిన్నిలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రాజమండ్రికి తరలించారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ తమను అరెస్ట్ చేయడం దారుణమైన చర్య అని, కాపు ఉద్యమాన్ని అణచివేయలేరని అన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.