దోపిడీ ప్రభుత్వాన్ని తరిమికొడదాం
గుంతకల్లు/ గుంతకల్లు టౌన్ : టీడీపీ మూడేళ్ల పాలన సర్వం అవినీతిమయమేనని, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రజాధనం దోపిడీ చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. దోపిడీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గుంతకల్లులో శనివారం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గస్థాయి ప్లీనరీ జరిగింది. సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో అనంత మాట్లాడారు. కరువుకు కేరాఫ్‌గా మారిన అనంతపురం జిల్లాలో రైతు, చేనేతల ఆత్మహత్యలు, ఉపాధి పనుల్లేక లక్షలాది మంది కూలీలు వలసవెళ్లినా వారికి ఆపన్నహస్తం అందివ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ చెల్లించకుండా రైతులకు అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటం చేస్తుందని ప్రకటించారు. జిల్లాకు వచ్చిన ఒకట్రెండు పరిశ్రమలు కూడా అధికారపార్టీ నేతల భూముల సమీపాన నెలకొల్పడమేంటని ఆయన ప్రశ్నించారు. గుంతకల్లు, జిల్లా సరిహద్దులోని బళ్లారి వద్ద ఈ పరిశ్రమలు ఎందుకు ఏర్పాటు చేయకూడదా అని నిలదీశారు. రాయలసీమలో అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి జరగాలన్నా, అన్నివర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పార్టీ శ్రేణులకు సూచించారు.
బాబును భయం వెంటాడుతోంది
ముఖ్యమంత్రి చంద్రబాబును ఏదో భయం నీడలా వెంటాడుతోందని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తే బాబు వణికిపోతున్నారన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇస్తారా? లేదా అని ఆయన ప్రశ్నించారు. మూడేళ్ల కాలంలో పేదలకు పక్కాగృహాలు కట్టివ్వలేదు కానీ సీఎం మాత్రం మూడు ఇళ్లు కొనుకున్నారన్నారని ప్లీనరీ పరిశీలకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నారా కుటుంబం అభివృద్ది చెందుతోందే తప్ప ప్రజలెవ్వరూ బాగుపడటం లేదన్నారు. సర్కారు వల్ల నష్టపోయిన కుటుంబాల్ని కలిసి వారికి భరోసా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల పేరిట అంచనా వ్యయాలన్నీ పెంచేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వై.శివరామిరెడ్డి ధ్వజమెత్తారు.
ఆ దోచుకున్న డబ్బుతోనే రానున్న ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేలు చొప్పున ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారని, ప్రజలు ఆ నోట్ల కోసం ఆశపడి టీడీపీకి ఓట్లేస్తే మళ్లీ అధోగతి పాలవుతారని హెచ్చరించారు. నవ్యాంధ్ర రాజధాని, ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ది పనుల్లో కమీషన్లను దండుకోవడానికే నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకొచ్చారన్నారు. వాల్మీకులు, కురబలు, వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేరుస్తానని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన హామీలు ఏమయ్యాయని చంద్రబాబును నిలదీశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలు రాగే పరుశురామ్, మీసాల రంగన్న, పామిడి వీరాంజనేయులు, కళ్యాణదుర్గం మాజీ సమన్వయకర్త బోయ తిప్పేస్వామి, పార్టీ ఎస్సీ, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జింకల రామాంజినేయులు, ఎన్.రామలింగప్ప, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వరబాబు, మంత్రాలయం మాజీ ఎంపీపీ వై.సీతారామిరెడ్డి, యువజన విభాగం జిల్లా నాయకులు వై.భీమిరెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ వన్నూర్‌సాబ్, జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్‌యాదవ్, నియోజకవర్గంలోని మూడు పట్టణాలు, మండలాల కన్వీనర్లు సుంకప్ప, మోహన్‌రావు, హుసేన్‌పీరా,గోవర్దన్‌రెడ్డి, బి.వెంకటరామిరెడ్డి, నారాయణరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వందలాది సంఖ్యలో మహిళలు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజన్న రాజ్యం..జగనన్నతోనే సాధ్యం
టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని పందికొక్కుల్లా దోచుకుంటున్నారే తప్ప ప్రజలకు చేసింది శూన్యమే. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తెలంగాణ సర్కారుకు భయపడి విజయవాడకు తన మకాం మార్చాడు. సీఎం చంద్రబాబు, తనయుడు నారాలోకేష్‌లు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, బ్యాంకుల్లో రుణాలు రీషెడ్యూల్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. జనరంజక పాలన సాగించిన రాజన్న (వైఎస్ రాజశేఖరరెడ్డి) రాజ్యం మళ్లీ రావాలంటే జగనన్నతోనే సాధ్యమవుతుంది. జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా మనమంతా కలసి పనిచేద్దాం.
- వై.వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, గుంతకల్లు నియోజకవర్గం