
విప్లవం పేరుతో దోపిడీ!
- మంత్రి సునీతపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజం
- అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లిస్తామని హామీ
- రాప్తాడు వైఎస్సార్ సీపీ ప్లీనరీ విజయవంతం
అనంతపురం : ఒకవైపు గాంధేయ వాదులం, విప్లవ వీరుల కుటుంబం అంటూనే మరోవైపు దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మంత్రి పరిటాల సునీతపై మండిపడ్డారు. ఆదివారం అనంతపురం రూరల్ మండలంలోని కళ్యాణదుర్గం రోడ్డు పిల్లిగుండ్లకాలనీ వద్ద రాప్తాడు నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. అందులో ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం ప్రాంతంలో 26 మంది నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేస్తే విప్లవవీరులు ఎందుకు నోరెత్తలేదని మంత్రి సునీతను ఉద్దేశించి అన్నారు.
విప్లవాలను అమ్ముకున్నారని, ఆ ముసుగులో దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తున్నారని విమర్శించారు. గత రెండు ఎన్నికల్లోనూ తనను గెలిపించేందుకు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. తనను పిలిచి అక్కున చేర్చుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు సేవ చేస్తూ చేరువ కావాలని సూచించారన్నారు. తాను ఆ ప్రకారమే నడుచుకుంటున్నానని చెప్పారు. నియోజకవర్గంలో దాదాపు 14 వేల కుటుంబాలకు ఏదో ఒక రూపంలో సొంత సంపాదనతో సేవ చేసే అవకాశం దేవుడు కల్పించాడన్నారు. అందరి ఆశీస్సులతో 2014లో గెలుస్తామనే అనుకున్నామన్నారు. అయితే చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలు నమ్మారన్నారు. పట్టిసీమ వల్లే హంద్రీనీవాకు నీళ్లొస్తున్నాయని అంటున్నారని, హంద్రీ - నీవా ద్వారా 2012 నుంచి వచ్చింది కృష్ణా జలాలు కాదా? అని ప్రశ్నించారు.
తామైతే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొస్తామన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు ఇవ్వాలని, అక్కడి నుంచి ఎగువగా మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు నాలుగు లిఫ్ట్‌ల ద్వారా పంపింగ్ చేసి చూపించాలని సవాల్ విసిరారు. 26వ కిలోమీటరు వద్దనున్న తురకలాపట్నం వంకకు నీళ్లొదిలితే అవి నేరుగా పెన్నానదిలో పడి దిగువ భాగాన ఉన్న పేరూరు డ్యాంకు వస్తాయన్నారు. కానీ అలా చేయకుండా రూ.1,100 కోట్లతో పనుల అంచనాలను రూపొందించుకున్నారని, ఇదంతా మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో చేస్తున్న దోపిడీ అని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు 10 టీఎంసీలు నీరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజలు వైఎస్సార్‌సీపీ పక్షానే ఉన్నారు
మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలంతా వైఎస్సార్‌సీపీ పక్షాన ఉన్నారన్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు సూచించారు. వలసల నివారణకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం నిధులను కూడా టీడీపీ కార్యకర్తలు స్వాహా చేస్తున్నారన్నారు. ప్రసుత్తం అనంతపురం నుంచి 4 లక్షల మంది రైతులు, రైతు కూలీలు వలసలు వెళ్లారని చెప్పారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరికైనా దీనిపై చంద్రబాబును అడిగే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.
తెలుగుదేశం రాక్షక పాలన సాగిస్తోందని, ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి హత్య కేసులో నిందితులైన మంత్రి సునీత సోదరుడు, కుమారుడు, బంధువులతో కలిసి తిరుగుతుంటే ప్రభుత్వానికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తోపుదుర్తి కవిత, గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, నాయకులు గిర్రాజు నగేష్, పామిడి వీరాంజనేయులు, మీసాల రంగన్న, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, మాజీ మేయర్‌రాగే పరుశురాం, విద్యార్థి విభాగం సలాంబాబు, లింగారెడ్డి, పరుశురాం, నరేంద్రరెడ్డి, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, మరువపల్లి ఆదినారాయణరెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రకాష్‌రెడ్డి గెలుపు జగన్‌కు కానుక
వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని గెలిపించి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇద్దాం. అపద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో కలుపుదాం.
- వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ
ప్లీనరీ భారీ సక్సెస్
జిల్లాలో ఎక్కడా లేని విధంగా రాప్తాడు నియోజకవర్గ ప్లీనరీ భారీ సక్సెస్ అయింది. చంద్రబాబు పరిపాలన అవినీతిమయమైంది. అరాచకాలు, దౌర్జన్యాలు, అధికారులపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారు. కొందరు అధికారులు తొత్తులుగా మారారు. ముఖ్యమంత్రి నీచుడు, దరిద్రుడు. 60 ఏళ్లలో చూడని కరువు గతేడాది జిల్లాలో చూశాం.
- శంకరనారాయణ, జిల్లా అధ్యక్షుడు
.
ప్రకాష్‌రెడ్డిని ఆశీర్వదించండి
నియోజకవర్గానికి ప్రకాష్‌రెడ్డి ఆశాకిరణం లాంటివాడు. సొంత నిధులతో బోర్లు వేయించాడు. మహిళలకు గ్యాస్ కనెక‌్షన్లు ఇప్పించాడు. గొర్రెలు ఇప్పించాడు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఆశీర్వదించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబుగా మారారు. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి.
- నదీంఅహ్మద్, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రంలో అరాచక పాలన - మాజీ మంత్రి పార్థసారథి ధ్వజం
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని భావించిన దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే, చంద్రబాబు సీఎం కాగానే రాజధాని పేరుతో దోపిడీకి తెర తీశారని ధ్వజమెత్తారు. రౌడీయిజాన్ని అంతమొందిస్తామని ఓ వైపు ముఖ్యమంత్రి చెబుతుండగా, ఆయన అనుచరులు దౌర్జన్యాలతో జనాన్ని భయపెడుతున్నారని అన్నారు.
మరోవైపు పోలీసులు కూడా టీడీపీ నేతల్లా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కళ్లముందే దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు ఖాకీ కాకుండా పచ్చ దుస్తులు వేసుకుంటే బాగుంటుందన్నారు. చంద్రబాబు ఆయన టీం ఆలీబాబా 60 దొంగల్లా మారారని ధ్వజమెత్తారు. దివంగత వైఎస్ పేరు చెబితే అనేక పథకాలు గుర్తుకొస్తాయని, అలా చెప్పుకోవడానికి చంద్రబాబు ఏ ఒక్క పథకమూ అమలు చేయలేదని అన్నారు. జేసీ సోదరులు కేవలం వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు కాలర్ పట్టుకోవాలని వారికి సూచించారు.