అధికార పార్టీకి అభిమానం లేదు
- ‘పురం’లో ఎన్నిసార్లు గెలిచినా తాగునీటి సమస్యను తీర్చలేదు
- పోలీసులు అధికారపార్టీకి ఊడిగం చేస్తున్నారు
- ‘బాబు’ వెంటే కరువు.. ఆ పాదం అలాంటిది
- జగన్ సీఎం కాగానే రాష్ట్రం అన్ని విధాలా చిగురిస్తుంది
- ప్లీనరీ సమావేశంలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్
హిందూపురం అర్బన్ : ఇన్నేళ్లుగా హిందూపురం ప్రజలు టీడీపీ వారినే ఎమ్మెల్యేలుగా గెలిపిస్తున్నా వారికి మాత్రం ఆ అభిమానం లేదని, తాగునీరు లేక ‘నీళ్లో రామచంద్రా..’ అని వాపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వైఎస్సార్‌సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. హిందూపురంలోని చౌడేశ్వరీ కాలనీలో సాయిరాం ఫంక‌్షన్ హాల్ ప్రాంగణంలో బుధవారం పార్టీ ప్లీనరీ సమావేశం మండల కన్వీనర్ బసిరెడ్డి అధ్యక్షతన పెద్ద ఎత్తున నిర్వహించారు. అందులో నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో ఇక్కడి ప్రజల తాగునీటి కష్టాలు చూసి శ్రీరామరెడ్డి మంచినీటి పథకాన్ని తీసుకొస్తే ఇక్కడి పాలకులు రాజకీయ కుళ్లు బుద్ధితో దానిని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.
హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పీఏబీఆర్ నుంచి నేరుగా పైప్‌లైన్ వేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానన్న బాలకృష్ణ గెలిచాక పత్తా లేకుండా పోయారన్నారు. అధికార పార్టీ నాయకులు హంద్రీనీవా నుంచి సాగు, తాగునీరు ఇస్తామన్నారని, అయితే ఇంతవరకు ఏ నీరూ ఇవ్వలేదని అన్నారు. ‘హిందూపురం నియోజకవర్గం అన్ని రకాలుగా నçష్టపోతోంది. గతంలో పట్టు పరిశ్రమ, చెరుకు తయారీ, వేరుశనగ సాగుకు పెట్టింది పేరుగా ఉండేది. ఇప్పుడు పంటలు లేవు. పరిశ్రమలు కూడా లేకుండా పోతున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో సమృద్ధిగా వర్షాలు.. చెరువులన్నీ నీళ్లతో నిండిపోయాయి. రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. అలాంటి మహానాయకుడి పులిబిడ్డ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రం తిరిగి అన్నివిధాలా చిగురిస్తుంది’ అని పేర్కొన్నారు. చంద్రబాబు ఏ రోజు అధికారం చేపట్టినా ఆయన వెంటే కరువు వచ్చేస్తుందని, ఆయన పాదం అలాంటిదని అన్నారు.
కొత్త మార్కెట్ ఏదీ?
చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ రెండేళ్ల క్రితం రంజాన్ మాసంలో మార్కెట్‌ను కూల్చేయడంతో దానిపై ఆధారపడి జీవనం చేసే ముస్లిం సోదరులు రోడ్డున పడ్డారని నవీన్‌నిశ్చల్ విచారం వెలిబుచ్చారు. మార్కెట్ సమస్యపై ధర్నా చేయడానికి సిద్ధమైతే ఇంటి చుట్టూ పోలీసులను కాపలా పెట్టి అక్రమంగా గృహ నిర్బంధం చేసి అడ్డుకున్నారని, మంచినీళ్లు ఇవ్వండయ్యా.. అంటూ ర్యాలీ చేస్తే పోలీసుల ద్వారా అడ్డుకుని కేసులు పెట్టించారని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు ఊడిగం చేయడానికి సిద్ధమైపోయారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించడంలో వారు చూపుతున్న ఉత్సాహం ప్రజలకు రక్షణ కల్పించడంలో చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ పరిశీలకులు తిప్పేస్వామి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవంటే ఎంత దారుణమైన గ్రహణం పట్టిందో తెలుస్తోందన్నారు. స్థానికంగా 24 గంటలూ అందుబాటులో ఉన్న నవీన్‌నిశ్చల్‌ను ఆదరించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలకు నీళ్లు ఇవ్వలేని ఎమ్మెల్యే బాలకృష్ణ చిత్తశుద్ధి ఉంటే తక్షణమే హిందూపురం వదలిపోవాలన్నారు.