కేడర్‌లో ఉత్సాహం నింపిన నాయకులు
అమలాపురం, ప్రత్తిపాడులో ప్లీనరీల నిర్వహణ
తరలివచ్చిన పార్టీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికార పార్టీ ఆగడాలు, వైఫల్యాలను ఎండగట్టి వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్న ప్లీనరీలు జిల్లాలో విజవంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం అమలాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్లీనరీలు పార్టీ కో ఆర్డినేటర్లు పినిపే విశ్వరూప్, పర్వత ప్రసాద్ అధ్యక్షతన జరిగాయి.
అమలాపురంలో...
అమలాపురం ప్లీనరీకి నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్షత్రియ కల్యాణ మండపం కిటకిటలాడింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలైన ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, గృహ నిర్మాణం..వంటి వాటిని చంద్రబాబు సర్కార్ కోత పెడుతున్న తీరును లెక్కలతో సహా ముఖ్య అతిథి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ కార్యకర్తల ముందుంచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.35 వేలు ఇస్తుంటే కార్పొరేట్ కళాశాలలు రూ.75 వేలు పెంచేయడంతో పేదలు పడుతున్న ఇబ్బందులు వివరించారు. తన తండ్రి జక్కంపూడి ద్వారా సంక్రమించిన రాజకీయ వారసత్వాన్నే కాకుండా ఆపద వస్తే ఎదురొడ్డేలా అప్పగించిన పోరాట పటిమను కార్యకర్తల కోసం వినియోగిస్తామని పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. బాబు అమలాపురంలో కాపు ఓట్ల కోసం డిప్యూటీ సీఎం పదవి ఎరగా వేసి ఆ వర్గంపై పెట్టిన అక్రమ కేసులు పెరిగేలా చేశారని ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీని చేయడమే కాకుండా, జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న పోలీసు స్టేషన్లకు పసుపు రంగు వేసి టీడీపీ భవనాలుగా మార్చేస్తున్న వైనాన్ని పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఎండగట్టినప్పుడు కేడర్ ఈలలతో హోరెత్తించారు. ఇందుకు అల్లవరం పోలీస్‌స్టేషన్‌కు పసుపు రంగు వేసిన ఉదాహరణను ఆయన ఆధారాలతో వివరించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని చంద్రబాబు సర్కార్‌ను అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, రాష్ట్ర కార్యదర్శి కొల్లి నిర్మలాకుమారి ఎత్తి చూపారు. చంద్రబాబు వైఫల్యాలను కో–ఆర్డినేటర్లు ముదునూరి ప్రసాదరాజు, వేగుళ్ల లీలాకృష్ణ, కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావు, పితాని బాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్‌లు ఎండగట్టారు. పార్లమెంటు పరిశీలకుడు వలవల బాబ్జీ, ప్లీనరీ పరిశీలకులు మేడపాటి షర్మిలారెడ్డి, కర్రి పాపారాయుడు, రాష్ట్ర కార్యదర్శులు బొమ్మి ఇజ్రాయిల్, దంగేటి రాంబాబు, చెల్లుబోయిన శ్రీనువాసు, మిండుగుదిటి మోహనరావు, అనుబంధ విభాగాల అధ్యక్షులు జక్కంపూడి కిరణ్, జున్నూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శంఖవరంలో...
శంఖవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మండపంలో ప్రత్తిపాడు, కొంకాపల్లి క్షత్రియ కల్యాణ మండపంలో అమలాపురం నియోజకవర్గ ప్లీనరీలు జరిగాయి. ప్రత్తిపాడు ప్లీనరీకి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. పార్టీ, కార్యకర్తల మధ్య అనుబంధాన్ని మరింత పెంచే దిశగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రయత్నమే ఈ ప్లీనరీలని ముఖ్య అతిథిగా హాజరైన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఎన్నికలు ఒక ఏడాది ముందే వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న పరిస్థితులను వివరిస్తూ అందుకు పార్టీ శ్రేణులను ఈ వేదిక నుంచి సమాయత్తం చేశారు. ఎంతో నమ్మకం ఉంచి జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని జగ్గంపేట నియోజకవర్గంలో ప్రకటిస్తే ఆ నమ్మకాన్ని వమ్ము చేసి తోడల్లుళ్లు పార్టీకి ద్రోహం చేసి టీడీపీలోకి ఫిరాయించేశారంటూ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పదునైన పదాలతో ఫిరాయింపుదారులను కడిగి పారేశారు. ప్లీనరీలో చర్చకు వచ్చే స్థానిక సమస్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి జూలైలో విజయవాడలో జరిగే రాష్ట్ర ప్లీనరీకి తీసుకు వెళతామని చెప్పడం ద్వారా కాకినాడ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ కార్యకర్తలకు పార్టీ సముచిత స్థానం ఇస్తుందనే విషయాన్ని నూరిపోశారు. ఈ దిశగా కార్యకర్తలను కార్యోన్ముకులను చేసేందుకు సునీల్ ప్రాధాన్యం ఇచ్చారు. ప్లీనరీ పరిశీలకుడు, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్ సమక్షంలో జరిగిన ఈ ప్లీనరీలో మాజీ మంత్రి కొప్పన మోహనరావు, కోఆర్డినేటర్లు ముత్యాల శ్రీనివాస్, తోట సుబ్బారావునాయుడు, ముత్తా శశిధర్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.