– అక్రమాలపై కలెక్టర్ స్పందించాలి
– లేదంటే త్వరలో కార్పొరేషన్ కార్యాలయం ముట్టడిస్తాం
– మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం
అనంతపురం : నగరపాలక సంస్థ ప్రస్తుత పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న అవినీతిపైనా, మారుతున్న కమిషనర్లపైన పత్రికల్లో రోజుకో కథనం వస్తోందని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్‌లో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. ఇది ఇలానే కొనసాగితే నగరపాలక సంస్థ దివాలా తీస్తుందన్నారు. కమిషనర్లను భయబ్రాంతులకు గురి చేసి చేయని పనులకూ బిల్లులు చేయించుకుంటున్నారని విమర్శించారు.
కలెక్టర్, జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారికీ ఇందులో వాటాలున్నాయేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ముఖ్యంగా కలెక్టర్‌కు నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ ముగ్గురూ తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు బుక్కపట్నం చెరువును పరిశీలించి ఏపుగా పెరిగిన కంపచెట్లను తొలిగించి, పూడిక తీయాలంటూ అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. ఆదేశాలు అందిన గంటలోనే అక్కడ పనులు ప్రారంభించారన్నారు.
సీఎం నిధులు కేటాయిస్తానని చెప్పిన వెంటనే మంజూరుకాని, అంచనాలు కాని, ఏవిధమైన టెండరు కాని, పనులు చేసే విధానం తెలపకున్నా అధికార పార్టీకి చెందిన నాయకులు మూడు రోజుల్లో రూ. 10 కోట్ల పనులను ముగించారన్నారు. అధికారులు నాయకులకు కొమ్ము కాస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం అన్నారు. ఈ అక్రమాలపై కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని స్పందించకపోతే కార్పొరేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ మేయర్ రాగే పరుశురాం మాట్లాడుతూ అవినీతిలో ర్యాంకులు కేటాయిస్తే అనంత నగరపాలక సంస్థకు రాష్ట్రంలో మొదటిస్థానం దక్కుతుందని ఎద్దేవా చేశారు.
బాక్స్ టెండర్లంటూ కొత్తభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. అత్యవసర పనులు నిమిత్తం నామినేషన్ పద్ధతిలో పనులు చేయొచ్చన్నారు. ఇవి చేయడం వల్ల 14 శాతం లెస్‌కు వేస్తారన్నారు. ఇది కార్పొరేషన్‌కు ఆదాయమేన్నారు. ఇలా చేయడం వల్ల తమ అనుయాయులు ఇంతమొత్తం నష్టపోతారనే ఉద్ధేశ్యంతో బాక్స్ టెండర్‌ను తెరపైకి తెచ్చారన్నారు. ఈ విధానం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని చెప్పారు. అవినీతి అక్రమాలపై విచారణ చేయించాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు.
కార్పొరేషన్‌లో రూ. కోట్లు కొల్లగొట్టారు
Published Sun, Jan 8 2017 10:37 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
Advertisement