కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారా?
- వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వైవీఆర్
- దుకాణాల తొలగింపును నిరసిస్తూ భారీ ర్యాలీ
- మున్సిపల్ కార్యాలయం ముట్టడి
గుత్తి : గుంతకల్లు రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను ఎలా తొలగిస్తారని వైఎస్సార్‌సీపీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా అని మండిపడ్డారు. గుంతకల్లు రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలు తొలగించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో బాధితులతో కలిసి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీం సాబ్‌తో వైవీఆర్ తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. అనంతరం కమిషనర్ చాంబర్‌లోకి దూసుకెళ్లి కమిషనర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా వైవీఆర్ మాట్లాడుతూ గుంతకల్లు రోడ్డులో ఒక్క దుకాణం కూడా తొలగించడానికి తాము అంగీకరించబోమన్నారు.
గుంతకల్లు రహదారికి ఇరుపక్కలా ఉన్న స్థలం ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్ శాఖలకు సంబంధించిందని అలాంటపుడు వాటిని తొలగించడానికి మున్సిపాలిటీ వారు ఎలా నోటీసులు జారీ చేశారని కమిషనర్‌ను వైవీఆర్ నిలదీశారు. దీంతో కమిషనర్ నీళ్లు నమిలారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి దుకాణాలు తొలగించడానికి పూనుకుంటే తాము ఊరుకునేది లేదన్నారు. ముఖ్యంగా గుంతకల్లు రహదారి వాసులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా అన్నారు. ఇందుకు స్పందించిన కమిషనర్ నోటీసులు జారీ చేసిన మాట వాస్తవమేనని, అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తొలగింపు ప్రతిపాదనను విరమించుకున్నామన్నారు. కమిషనర్ హామీతో ఆందోళన విరమించారు.
కార్యక్రమంలో మండల కన్వీనర్ గోవర్దన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి, జెడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్ యాదవ్, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు మల్లయ్య యాదవ్, బాలరాజు రాయల్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి మల్లికార్జున, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మర్తాడు అన్సార్, జిల్లా కార్యదర్శులు సుభాష్‌రెడ్డి, శివయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ షఫీ, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శులు ఫారూక్, ఫయాజ్, అఫ్సర్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు హాజీ మలన్ బాబా, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి చంద్ర, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు వెంకటేష్, మూముడూరు మాజీ సర్పంచు రామచంద్రారెడ్డి, పామిడి మండల యూత్ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి, కౌన్సిలర్లు నజీర్, కృపా సుజాత, కళ్యాణి, మహిళా నాయకురాలు నిర్మల, తురకపల్లి గోపాల్‌రెడ్డి, మండల, జిల్లా సీనియర్ నాయకులు రామసుబ్బారెడ్డి, వెంకటేష్, శంకర్‌రెడ్డి, నారాయణస్వామి, శేషారెడ్డి, రంగ ప్రసాద్ రాయల్, ప్రసాద్ గౌడ్,లాలు శేఖర్, తొండపాడు వాటర్ షెడ్ చైర్మన్ శంకర్, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు ఎస్‌ఎస్ నాయక్, నారాయణ, ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.