యువభేరి వేదిక ఖరారు | yuvabheri vedika in nallapadu | Sakshi
Sakshi News home page

యువభేరి వేదిక ఖరారు

Published Mon, Feb 13 2017 12:13 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

yuvabheri vedika in nallapadu

 
  •   16న గుంటూరు మిర్చి యార్డు సమీపంలో నిర్వహణ
  •   వైఎస్సార్‌సీపీ నేతలు మర్రి రాజశేఖర్‌, అప్పిరెడ్డి వెల్లడి 
 
 సాక్షి, అమరావతి బ్యూరో : గుంటూరులో ఈ నెల 16న జరగబోయే యువభేరి కార్యక్రమానికి సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు వేదికను ఖరారు చేశారు. గుంటూరులో నల్లపాడు రోడ్డులోని మిర్చి యార్డు సమీపంలో గల ఖాళీ ప్రదేశంలో యువభేరి నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేదికను ఖరారు చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ప్రకటించారు. గతంలో పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోరుతూ నిరవధిక దీక్ష నిర్వహించిన ప్రాంగణంలోనే యువభేరి నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, తలశిల రఘురామ్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు యువభేరి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా, నగర అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డిలు సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. విద్యార్థులను చైతన్యపరచి, వారి మనోభావాలను తెలుసుకొని, హోదా వల్ల ఒనగూరే లబ్ధిని తెలియజేసేందుకే పార్టీ అధినేత యువభేరిని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రజల ఆకాంక్షను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భుజాలకెత్తుకొని పోరాటం చేస్తున్నారని తెలిపారు. యువభేరి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరూ విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. సదస్సుకు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చేలా ప్రణాళికలు రూపొందించుకొని, వారిని చైతన్యపరచాలన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని నేతలకు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement