
ఇల్లెందు వైద్యశాలలో చికిత్స పొందుతున్న సాహితీ
- కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు
- వైద్యం కోసం తరలింపు
ఇల్లెందు : రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ యువజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇల్లెందులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని చెరువు కట్టకు చెందిన ఎస్‌కె.ముజీబ్, నంబర్–2 బస్తీకి చెందిన ఎల్లబోయిన సాహితీ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండు నెలల కిందట ఇరువురు తమ కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండా దూరంగా వెళ్లిపోయి కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో సాహితీ తల్లిదండ్రుల పిర్యాదు మేరకు ఇల్లెందు పోలీసులు ఇరువురిను స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే తమను విడదీస్తారనే భయంతో ఓ చిన్న డబ్బాలో కొన్ని టైఫాయిడ్ టాబ్లెట్లు వేసుకుని వచ్చి, ఓ గ్లాసు నీటిలో కలిపి సగం వరకు సేవించారు. కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత స్టేషన్ బయటకు వచ్చిన ఇరువురు సొమ్మసిల్లి పడిపోయారు. ఒకరి తర్వాత ఒకరు పడిపోయిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. ఇల్లెందు వైధ్యాధికారి హన్మేష్‌ను వివరాలు అడుగగా ప్రాథమిక వైద్యం అందించామన్నారు. టాబ్లెట్లు మింగారో.. మందు సేవించారో తెలపడం లేదని, తాగిన మందును బట్టి వైద్యం అందిస్తామని వివరించారు. ఈ విషయమై సీఐ ఏ.నరేందర్‌ను వివరణ కోరగా కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.