పారదర్శకమా.. పర్సంటేజీలా..!
పారదర్శకమా.. పర్సంటేజీలా..!
Published Thu, Aug 3 2017 11:25 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
చైర్మన్ నవీన్ మొగ్గు ఎటువైపన్న దానిపైనే అందరి నిరీక్షణ
చర్చనీయాంశమైన జెడ్పీ సీసీ పోస్టింగు
సీటు కోసం ఎవరి పైరవీలు వారివి
భానుగుడి (కాకినాడ) : జిల్లా పరిషత్‌లో ఏ ఫైలు కదలాలన్నా, బదిలీలు కావాల్సిన చోటుకి రావాలన్నా, పెన్షన్లు, పీఎఫ్ ఫైళ్లు, ఉపాధ్యాయులు డిప్యుటేషన్లు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, జెడ్పీ నుంచి విడుదలయ్యే కోట్ల రూపాయల నిధులు, వాటి పర్సంటేజీలు, జెడ్పీ ఆస్తులు, ఆదాయాలు వీటన్నింటిపై చక్రం తిప్పే సీటు జెడ్పీలో ఏదైనా ఉందంటే అది జెడ్పీ చైర్మన్ సీసీ పదవే. ప్రస్తుతం జెడ్పీ చైర్మన్‌గా జ్యోతుల నవీన్ ఎంపికైన తర్వాత ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న గత జెడ్పీ చైర్మన్ నామన సీసీ ప్రసాద్ మాతృస్థానానికి వెళ్లారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుత చైర్మన్ సీసీగా ఎవరిని ఎన్నుకుంటారన్న విషయంపైనే అందరి ఆసక్తి నెలకొంది. గతంలో వంగా గీతావిశ్వనాథ్ నుంచి సీసీగా అనేక పర్యాయాలు పనిచేసిన ప్రణాళికా విభాగానికి చెందిన హరికృష్ణ పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే నామనకు సీసీగా వ్యవహరించిన ప్రసాద్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జెడ్పీలో పనిచేసి ఆర్‌అండ్‌బీకి బదిలీపై వెళ్లిన సత్యనారాయణమూర్తి సైతం ఒకే సామాజిక వర్గ సమీకరణాలతో పావులు కదుపుతున్నట్లు సమాచారం.
సామాజిక వర్గమా.. అనుభవమా..!
కీలకంగా మారిన ఈ పదవిని తన సామాజిక వర్గానికి చెందిన ఆయన వర్గీయులకే చైర్మన్ నవీన్ కట్టబెడతారో లేక పర్సంటేజీలలో అనుభవమున్న వ్యక్తులకు ఇచ్చి కలెక్షన్లకు తెరదించుతారోనని చర్చ మొదలైంది. నవీన్ సమావేశాల్లో ఆది నుంచీ రెండేళ్ల పాలనలో జెడ్పీటీసీ సభ్యుల గౌరవాన్ని పెంచుతానని, పర్సంటేజీల పాలనకు స్వస్తి పలికి నీతి నిజాయతీలతో పీఠానికి గౌరవం తెస్తానని అంటున్నారు. ఆయన మాటలు కేవలం సమావేశాలకే పరిమితమా లేక కార్యరూపంలో పెడదారా అన్న సందేహం అందరిలో మొదలైంది. ఉద్యోగుల్లో ఉన్న యూనియన్ల దృష్ట్యా ఏ సంఘం వారికి ప్రాధాన్యం ఇస్తారో ఆయా సంఘాల సభ్యులంతా వేచి చూస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సందేహాలు నివృత్తి కానున్నాయి. రెండు రోజుల్లో సీసీ నియామకం జరుగుతుందని, పూర్తిస్థాయి పాలన కొనసాగుతుందని, జిల్లా పరిషత్‌లో గ్రీవెన్స్‌తో సహా పలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని చైర్మన్ నవీన్ ప్రకటించారు.
Advertisement
Advertisement