తూర్పుగోదావరి, కరప (కాకినాడ రూరల్): జిల్లా స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్‌లో కరప హైస్కూలు మాస్టరు కశిలింక సుబ్రహ్మణ్యం, విద్యార్థులు సీహెచ్ దారబాబు, సీహెచ్‌ఎస్‌ఎస్ అభిరామ్‌లతో రూపొందించిన ప్రాజెక్టు కోడి ఈకలనుంచి బయోడీజిల్ ఉత్పత్తి చేయడం అందరి ప్రశంసలు అందుకుని, రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్‌కు ఎంపికైంది. ఈ ప్రాజెక్టు రూపకల్సనలో గైడ్ టీచర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యం సోమవారం బయోడీజిల్ ఉత్పత్తి గురించి వివరించారు. మరో 10–20 ఏళ్లలో అడుగంటిపోయే పెట్రోలియం ఉత్పత్తులకన్నా బయోడీజిల్ తయారీపై దష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కోడి ఈకల నుంచి బయోడీజిల్ ఉత్పత్తి చేయడంలో కొన్ని ప్రయోగాలు విఫలమయ్యాయని, అయినా పట్టుదలతో సాధించామన్నారు.
దీని తయారీకి 300 మిల్లీలీటర్ల నీటిలో 100 గ్రాములు కోడి ఈకలను కలిపి అరగంటసేపు బాగా కలుపుతూ మరిగించాలి. తర్వాత ఈ ద్రావణాన్ని 24 గంటలసేపు స్థిరంగా ఉంచాలి. అప్పుడు కిందికి దిగిన ప్రోటీన్ కంటెంట్ ఫ్యాట్‌ను సపరేటింగ్ ఫన్నెల్ ద్వారా వేరుచేయాలి. మిగిలిన ఫ్యాట్‌ను కోనికల్ ప్లాస్క్‌లోకి తీసుకుని దానికి తగినంతగా సోడియం మిథాక్సైడ్ కలిపి, అరగంట వేడిచేయాలి. ఇలాచేయడం వల్ల దానిలోని ట్రైగ్లిజరైడ్స్ మీథైల్ ఎస్టర్స్‌గా మారి బయోడీజిల్ తయారవుతుంది. హైడ్రోకార్భన్స్, కర్బన్ మోనాక్సైడ్ సల్పర్ ఆక్సైడ్స్‌కానీ ఈబయోడీజిల్ నుంచి విడుదల కావు. ఇది ఎకో ఫ్రెండ్లీ బయోడీజిల్. కోళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను ఈ బయోడీజిల్ తయారీకి ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. బయోడీజిల్ తయారు చేసేటప్పుడు వచ్చే వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment