bio diesel
-
మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా విశాఖపట్నం మారుతోంది. మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, ఐటీ, కార్గో... ఇలా భిన్నమైన రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా విశాఖకు విస్తరిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ (వీసెజ్)లో మరో మూడు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులతో రెండు బయో డీజిల్ కంపెనీలు, ఒక ఫార్మా కంపెనీ ఏడాదిలోపు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,200 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం వృద్ధి కనబరిచిన వీసెజ్... అర్ధ సంవత్సరానికి 50 శాతం వృద్ధి నమోదు దిశగా ముందుకు సాగుతోంది. యూఎస్, కెనడాకు ఎగుమతులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మూడు యూనిట్లు విశాఖ సెజ్‌లోనే ఏర్పాటు కానున్నాయి. ఇందులో బయోడీజిల్ తయారీ సంస్థ అద్వైత్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, ఫార్మాసూ్యటికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రాన్యూల్స్ సీజెడ్‌ఆర్‌వో సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఏడాదిలోపు తమ కార్యకలాపాలు ప్రారంభించాలని వీసెజ్ నిబంధన విధించింది. అయితే... ఈ సంస్థలన్నీ ఆరు నుంచి పది నెలల్లోపే ఉత్పత్తుల తయారీని మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వీసెజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మూడు కంపెనీలు ప్రధానంగా కెనడా, యూఎస్‌కు ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు ఏపీ, తెలంగాణకు వస్తున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. దువ్వాడ వీసెజ్ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెజ్‌లు, యూనిట్ల ద్వారా రికార్డు స్థాయి ఎగుమతులు సాధించాం. 2023–24 మొదటి త్రైమాసికంలో రూ.50,195 కోట్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేశాం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం వృద్ధి రేటు సాధించాం. వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా రూ.35,992 కోట్లు, సేవారంగం ఎగుమతుల్లోనూ 36 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గణాంకాలను పరిశీలిస్తే రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు వీసెజ్ ద్వారా రాగా... మొత్తం 6,61,579 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. – ఎం.శ్రీనివాస్, వీసెజ్‌జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ -
కోడి ఈకల నుంచి బయోడీజిల్ తయారీ
తూర్పుగోదావరి, కరప (కాకినాడ రూరల్): జిల్లా స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లో కరప హైస్కూలు మాస్టరు కశిలింక సుబ్రహ్మణ్యం, విద్యార్థులు సీహెచ్ దారబాబు, సీహెచ్ఎస్ఎస్ అభిరామ్‌లతో రూపొందించిన ప్రాజెక్టు కోడి ఈకలనుంచి బయోడీజిల్ ఉత్పత్తి చేయడం అందరి ప్రశంసలు అందుకుని, రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్‌కు ఎంపికైంది. ఈ ప్రాజెక్టు రూపకల్సనలో గైడ్ టీచర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యం సోమవారం బయోడీజిల్ ఉత్పత్తి గురించి వివరించారు. మరో 10–20 ఏళ్లలో అడుగంటిపోయే పెట్రోలియం ఉత్పత్తులకన్నా బయోడీజిల్ తయారీపై దష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కోడి ఈకల నుంచి బయోడీజిల్ ఉత్పత్తి చేయడంలో కొన్ని ప్రయోగాలు విఫలమయ్యాయని, అయినా పట్టుదలతో సాధించామన్నారు. దీని తయారీకి 300 మిల్లీలీటర్ల నీటిలో 100 గ్రాములు కోడి ఈకలను కలిపి అరగంటసేపు బాగా కలుపుతూ మరిగించాలి. తర్వాత ఈ ద్రావణాన్ని 24 గంటలసేపు స్థిరంగా ఉంచాలి. అప్పుడు కిందికి దిగిన ప్రోటీన్ కంటెంట్ ఫ్యాట్‌ను సపరేటింగ్ ఫన్నెల్ ద్వారా వేరుచేయాలి. మిగిలిన ఫ్యాట్‌ను కోనికల్ ప్లాస్క్లోకి తీసుకుని దానికి తగినంతగా సోడియం మిథాక్సైడ్ కలిపి, అరగంట వేడిచేయాలి. ఇలాచేయడం వల్ల దానిలోని ట్రైగ్లిజరైడ్స్ మీథైల్ ఎస్టర్స్గా మారి బయోడీజిల్ తయారవుతుంది. హైడ్రోకార్భన్స్, కర్బన్ మోనాక్సైడ్ సల్పర్ ఆక్సైడ్స్కానీ ఈబయోడీజిల్ నుంచి విడుదల కావు. ఇది ఎకో ఫ్రెండ్లీ బయోడీజిల్. కోళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను ఈ బయోడీజిల్ తయారీకి ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. బయోడీజిల్ తయారు చేసేటప్పుడు వచ్చే వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చు. -
బయో డీజిల్ ట్యాంకర్ బోల్తా
చివ్వెంల(నల్లగొండ): నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం సమీపంలో సోమవారం ఉదయం బయో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపైనే పడిపోయింది. ట్యాంకర్‌కు పగుళ్లు రావటంతో లీక్ అవుతున్న ఆయిల్‌ను చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి బిందెలు, బకెట్లు, డ్రమ్ముల్లో పట్టుకెళుతున్నారు. ట్యాంక్‌లో సుమారు రెండు వేల లీటర్ల ఆయిల్ ఉంటుందని చెబుతున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్ సంఘటన స్థలం నుంచి వెళ్లిపోయారు.