అమలాపురం:గోదారి పల్లెలు సం‘క్రాంతి’తో ముస్తాబయ్యాయి. ఆరుగాలం కష్టపడి పంట పండించే.. జనం పొట్టలు నింపే అన్నదాతల పెద్ద పండుగ సంక్రాంతి సందడి జిల్లా నలు మూలలా కనిపిస్తోంది. కోనసీమ నుంచి మన్యం వరకు.. రాజమహేంద్రవరం నుంచి తుని వరకు అటు పట్టణాలు.. ఇటు పల్లెల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పొట్టచేతపట్టుకుని కూలీ పనులకు పోయిన వలస కూలీల దగ్గర నుంచి.. ఊళ్లకు దూరంగా ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు.. ఉన్నత కొలువుల కోసం విదేశాలు వెళ్లిన ఎన్‌ఆర్‌ఐలు పండుగకు రెక్కలు కట్టుకుని వాలిపోయారు. రంగులు వేసిన పెద్దిళ్లు, పేడతో అలికి పూరిళ్లు.. వాటిపై మేలుకొల్పు ముగ్గులు.. ఇల్లు ఏదైతేనేం... పండగకు రంగు పడింది. వాకిట్లో ముత్యాల ముగ్గులు కొలువుదీరాయి. ఇళ్లను ముస్తాబు చేసి ముత్తయిదువులు గుమ్మాలకు మామిడాకులు కట్టి గడపలకు పసుపు రాసి బొట్టులు పెట్టారు.
పరుగో... పరుగు...
ఉమ్మడి రాజధాని హైదరాబాద్...కొత్త రాజధాని ప్రాంతం విజయవాడ, గుంటూరుల నుంచి ఐటీ ఉద్యోగులకు కొలువైన బెంగళూరు, చెన్నైల నుంచి స్థానికులు తరలివచ్చారు. అమెరికా వంటి దేశాల్లో కూడా ఉన్నవారు సైతం పండుగ సమయంలో సెలవులు చూసుకుని వచ్చారు. హైదరాబాద్ నుంచి సాధారణ రోజుల్లో రూ.700 వరకు ఉండే బస్సు టిక్కెట్ ధర రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పలికినా లెక్క చేయలేదు. పండుగ సొంత ఇంటిలో చేసుకోవాలని కుటుంబ సమేతంగా వచ్చారు. సొంతంగా కార్లు ఉన్నవారు వ్యయప్రయాసలైనా కుటుంబంతో సహా వచ్చివాలిపోయారు. చాలా మంది శనివారమే రాగా, ఆదివారం భోగి రోజు ఉదయం వచ్చేవారు కూడా ఉన్నారు.
కొడుకులు.. కోడళ్లు, మనుమలు.. మనుమరాండ్లు, ముని మనుమలు, బాబాయ్.. పిన్నెలు, అత్తలు.. మామలు, అక్కలు.. బావలు రావడంతో స్థానికుల్లో పండుగ హుషారు వచ్చింది. ఇక కొత్త అల్లుళ్ల సందడి సరాసరే. అమ్మలతో కలిసి అత్తారింటి వద్ద వాలిపోయారు. కొత్త అల్లుళ్లకు ఇచ్చే బహుమతుల కోసం మామలు హైరానా పడుతున్నారు. భోగి మంటల కోసం పిల్లలు, యువకులు భోగి పిడకలు, కమ్మలు, డొక్కలు, చెట్ల మోడులు తెచ్చి భోగిమంటల్లో వేసి సందడి చేశారు. చిన్నారులు భోగి దండలు గుచ్చే పనిలో పడ్డారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల హడావిడి అంతాఇంతా కాదు. ప్రభల తీర్థాలకు తరలించే ప్రభల తయారీకి నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.
ఆతిథ్యంలో గోదావరి జిల్లాకు పెట్టింది పేరు. ఇక్కడ తయారు చేసే పిండివంటలు సున్నుండలు, పోకుండలు, జంతికులు, ఇలంబీకాయలు, కొబ్బరినూజు, వెన్నప్పాలు, గోరుమీఠీలు, పొంగడాలను ఇప్పటికే తయారు చేశారు. నాటుకోడి ఇగురు, రొయ్యలు, చేపలతో తయారు చేసే కూరలకు లెక్కేలేదు. మాంసాహారుల జిహ్వను సంతృప్తి పరిచేవిధంగా ‘కోస’లు ఈ మూడు రోజులూ ఘుమఘుమలాడనున్నాయి. ధాన్యం అమ్మకం సొమ్ములు సకాలంలో రాకున్నా.. బ్యాంకుల్లోను, ఏటీఎంలలో సొమ్ములు లేకున్నా.. ఏడాదికొక మారు జరిగే సంక్రాంతి కోసం అప్పోసొప్పో చేసి రైతులు పెద్ద పండుగ చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment