మూడు ఖండాలూ, నాలుగు దేశాలూ... ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదుల ఆగడానికి శుక్రవారం 200 మందికి పైగా పౌరులు బలయ్యారు.
మూడు ఖండాలూ, నాలుగు దేశాలూ... ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదుల ఆగడానికి శుక్రవారం 200 మందికి పైగా పౌరులు బలయ్యారు. టునీసియాలో పర్యాటకులు సేద తీరుతున్న బీచ్‌లో సాయుధుడు చొరబడి 38మందిని కాల్చి చంపాడు. కువైట్‌లోని మసీదులో ప్రార్థనలు చేసుకుంటుండగా ఆత్మాహుతి దాడికి పాల్పడి 25 మందిని పొట్టనబెట్టుకున్నారు. సిరియాలో ఒక పట్టణంలోకి ప్రవేశిం చిన మిలిటెంట్లు విచ్చలవిడిగా దాడిచేసి 146మందిని చంపేశారు. ఫ్రాన్స్‌లోని ఒక ఫ్యాక్టరీలో ఉగ్రవాది ఒకరి తల నరికి చంపడంతోపాటు ఆత్మాహుతికి ప్రయత్నిం చాడు. అతన్ని సకాలంలో నిర్బంధించకపోయి ఉంటే ఫ్యాక్టరీ మొత్తం అగ్నిగుం డమై భారీ ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవించేది.
ఈ ఉదంతాలన్నీ ఐఎస్ విస్తృతినీ, దాని ప్రమాదకర పోకడలనూ తెలియ జెబుతున్నాయి. ఈ దేశాలన్నీ ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియా, యూరప్ ఖండాల్లో ఉన్నాయి. ఇన్నిచోట్లా ఒక ఉగ్రవాద సంస్థ ఏకకాలంలో దాడికి పాల్పడగలగడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇతర ఉగ్రవాద సంస్థల్లాగే ఐఎస్ సంస్థాగతమైన నిర్మాణం ఏమీ లేదు. అది కేవలం ఇంటర్నెట్ మాధ్యమాన్ని ఆసరా చేసుకుని వ్యక్తుల్ని ప్రభావితం చేస్తూ తన సిద్ధాంతాలను నూరిపోసే సంస్థ. ఎంత మంది వద్దకు అది చేరువవుతున్నదోగానీ వ్యక్తులుగా కొంతమందినైతే లోబరు చుకోగలుగుతున్నది. వారిని ఆత్మాహుతి దాడులకూ, ఇతర విధ్వంసకర చర్యలకూ పురిగొల్పుతున్నది. దాడులు జరిగేవరకూ వారి అసలు స్వరూపం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడగలుగుతున్నది. ఒక గ్రూపుగా విధ్వంసకర చర్యలకు పాల్పడేవారి ఆనుపానులు తెలుసుకోవడం ఒకసారి కాకపోతే ఒకసారైనా భద్రతా బలగాలకు సాధ్యమవుతుంది. కొంతమంది కలిసిచేసే పని గనుక ఎక్కడో అక్కడ విషయం వెల్లడవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక్కరిగా దాడులకు పథకరచన చేసి అమలు పరిచేవారిని పసిగట్టడం దాదాపు అసాధ్యం.
ఆ బలహీనమైన స్థితిని ఐఎస్ వినియోగించుకుంటోంది. ఇలా వేర్వేరు దేశాల్లో ఒక్కొక్కరే దాడులకు దిగేలా చేయడంతోపాటు ఆ దాడులన్నీ ఒకే రోజు జరిగేలా చూడటంలో ఐఎస్ సాధించిన సమన్వయం ఎవరికైనా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. టునీసియాలో 38 మందిని పొట్టనబెట్టుకుని భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో హతుడైన 23 ఏళ్ల సీఫిద్దీన్ రెజ్గూ ఇలాంటి ఉన్మాదిగా మారాడని ఘటన జరిగేవరకూ తెలియదని అతని ఇరుగు పొరుగువారు మాత్రమే కాదు... తల్లిదండ్రులూ, తోబుట్టువులూ కూడా చెబుతున్నారు. వాస్తవానికి అతను ఇంజనీరింగ్ చదివినా ఇంటర్నెట్‌తో నిత్యమూ అంటిపెట్టుకుని ఉండేంత తీరికగల జీవితం కాదు. తండ్రి రోజు కూలీ చేసి సంపాదిస్తున్నవాడు. అలాంటి యువకుణ్ణి ఉగ్రవాదిగా మార్చడమే కాదు...ఆ సంగతి బయటపడకుండా అత్యంత గోప్యంగా ఉండేలా ఐఎస్ చూడగలిగింది. టునీసియాలో ఈ దాడి జరిగిన సిలియానా ప్రాంతంలో ఉగ్రవాద గ్రూపుల కదలికలు లేవు. దానికి అటూ, ఇటూ ఉన్న కెఫ్, కసెరీన్ ప్రాంతాలు గత రెండున్నరేళ్లుగా ఉద్రిక్తంగానే ఉంటున్నాయి. అక్కడ వివిధ ఉగ్రవాద గ్రూపుల మధ్య ఘర్షణలు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి. భద్రతా బలగాల దృష్టంతా ఆ రెండు ప్రాంతాలపైనా ఉండగా సిలియానాలో ఒక సాధారణ యువకుడు ఇలా ఉన్మాద రూపమెత్తడం ఆశ్చర్యం కలిగించే అంశం. టునీసియాలో మూడు నెలలక్రితం ఒక మ్యూజియంపై దాడిచేసి ఉగ్రవాదులు 22మందిని హత మార్చారు. ఈ రెండు దాడుల్లోనూ ఉగ్రవాదుల లక్ష్యం బ్రిటన్ పౌరులే! టునీసియా నుంచి వెళ్లిన దాదాపు 3,000 మంది యువకులు ఇరాక్, సిరియా, లిబియాల్లో సాగుతున్న ఘర్షణల్లో పాల్గొంటున్నారు. వీరిలో వెనక్కొచ్చిన యువకులు కొందరు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
నాలుగేళ్లక్రితం అరబ్ దేశాల్లోని నియంతలకు కంటిమీద కునుకులేకుండా చేసిన ప్రజాస్వామిక ఉద్యమానికి పుట్టినిల్లయిన టునీసియా నిరుడు జరిగిన ఎన్నికల్లో ఛాందసవాదులను కాదని సెక్యులర్ విలువలకు కట్టుబడ్డ పార్టీలను ఎన్నుకుంది. టునీసియాకు ప్రధాన ఆదాయ వనరైన టూరిజంను దెబ్బతీయడంతో పాటు తమపై దాడులకు పాల్పడుతున్న పాశ్చాత్య దేశాలకు గుణపాఠం నేర్పడం...అదే సమయంలో తనకు పోటీగా ఉన్న అల్ కాయిదా సంస్థ ప్రభావాన్ని తగ్గించడం ఐఎస్ ఉద్దేశంలా కనబడుతోంది.
మతిలేని తన దాడుల ద్వారా షియా, సున్నీ తెగలమధ్య ఘర్షణలు సృష్టించడం...తన ఆధిపత్యాన్ని చాటుకోవడం కూడా ఐఎస్ దాడుల లక్ష్యం. ఐఎస్ సారథ్యం సున్నీ తెగకు చెందినవారిదే అయినా ఆ తెగలోని సాధారణ పౌరులు ఇలాంటి హింసాత్మక ఘటనలను సమర్ధించరు. ఆ రెండు తెగలకు చెందినవారూ అన్ని దేశాల్లోనూ సఖ్యతతో మెలగుతున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడటం ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధమని భావిస్తు న్నారు. ఇలాంటి సామరస్య భావనకు తూట్లు పొడవడమే లక్ష్యంగా కువైట్ మసీదు లో ఐఎస్ దాడిచేసింది. ఇందువల్ల కువైట్‌లో తన వర్గాన్ని పెంచుకోవచ్చునను కుంటున్నది.
టునీసియాలో దాడి జరిగిన రోజునే ఫ్రాన్స్‌లోనూ ఐఎస్ అచ్చం అదే తరహా దాడికి పథకరచన చేసింది. లిబియాలో గడాఫీ ప్రభుత్వాన్ని కూల్చి ఆ దేశాన్ని వల్లకాడుగా మార్చడంలో ఫ్రాన్స్ అమెరికాతో చేతులు కలిపి పనిచేసినా మిగిలిన యూరప్ దేశాలతో పోలిస్తే అది అమెరికాను గుడ్డిగా అనుసరించే దేశం కాదు. మొన్న జనవరిలో చార్లీహెబ్డో పత్రికపై ఐఎస్ ఉగ్రవాదులు దాడి జరిపి 12 మందిని కాల్చిచంపాక ఆ దేశం ఐఎస్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంది. ఇది కూడా ఐఎస్‌కు ఆగ్రహం కలిగించింది. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి భద్రతా పరంగా తీసుకునే చర్యలతోపాటు ఆయా దేశాల్ల్లో పేదరికం, నిరుద్యోగం వంటివి అరికట్టడానికి కృషి జరగాలి. అంతేకాదు... అమెరికా, పాశ్చాత్య దేశాలు తాము అనుసరిస్తున్న విధానాలను సవరించుకోవాలి. లిబియాలోనైనా, సిరియా లోనైనా ఆ దేశాల విధానాల ఫలితమే ఇప్పుడు ఐఎస్ ఆవిర్భావానికి తోడ్పడ్డా యని మరిచిపో కూడదు. అలాగే మొన్న అఫ్ఘానిస్థాన్ పార్లమెంటుపై జరిగిన దాడిగానీ, ఇప్పుడు కువైట్‌లో జరిగిన దాడిగాని మన దేశానికి కూడా హెచ్చరి కలవంటివే. తగినంత అప్రమత్తతతో మెలగాల్సిన అవసరాన్ని ఈ దాడులు తెలియజెబుతున్నాయి.