నంద్యాల చెప్పే నిజం
ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవాల్లో ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. షరా మామూలుగా అన్నిచోట్లా పాలక పక్షాలే విజయం సాధించాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడం వల్ల నంద్యాల స్థానానికి ఎన్నిక అవసరమైంది. కేంద్ర రక్షణ మంత్రి పదవి నుంచి తప్పుకుని గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ పరీకర్ కోసం బీజేపీ శాసనసభ్యుడు రాజీనామా చేయడంతో పణజీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ రాష్ట్రంలోనే వాల్పోయ్ నియోజక వర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీకి ఫిరాయించిన విశ్వజిత్ రాణే శాసన సభ్యత్వాన్ని వదులుకోవడం వల్ల ఆ స్థానానికీ ఎన్నిక తప్పలేదు. ఆయన తిరిగి ఎన్నికయ్యారు. ఢిల్లీలోనూ ఫిరాయింపు కారణంగానే ఉప ఎన్నిక జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే వేద్‌ప్రకాశ్ మొన్న మార్చిలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి, శాసనసభ్యత్వాన్ని వదులుకున్నారు. కానీ ఉప ఎన్నికలో ఆయన పరాజయం పాలయ్యారు. అధికారపక్షమైన ఆప్ అక్కడ గెలిచింది.
గోవా, ఢిల్లీల్లో ఫిరాయించినవారు అనుసరించిన ప్రమాణాలనే ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన 20 మంది ఫిరాయింపుదారులు కూడా పాటించి ఉంటే నంద్యాల ఒక్కచోట మాత్రమే కాదు... ఆ ఇరవై స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పకపోయేవి. వారిని చేర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక విలువలకు తాను సహస్రయోజనాల దూరమని దశాబ్దాలక్రితమే ఎటూ నిరూపించుకున్నారు. కనీసం ఆ పంచన చేరినవారిలో ఒక్కరైనా తాము నైతికంగా ఉన్నతులమని చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. వారిలో కొందరు మంత్రి పదవులు కూడా దక్కించుకుని తరించారు. పైపెచ్చు నంద్యాల ఫలితాన్నే ఆ స్థానాలకు కూడా అన్వయించుకోవాలని మర్కట తర్కానికి దిగుతున్నారు.
గోవా, ఢిల్లీల్లో బీజేపీలోకి ఫిరాయించినవారు పాత పార్టీల ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవుల్ని వదులుకున్నారు గనుక బీజేపీ ఉన్నత ప్రమాణాలు పాటించిందనుకోనవసరం లేదు. వారిని రాజీనామా చేయమని కోరిందా లేక వారే స్వచ్ఛందంగా తప్పుకున్నారా అనే విచికిత్స కూడా అనవసరం. ఆ విషయంలో తనకు పెద్ద పట్టింపు లేదని బీజేపీ అరుణాచల్‌ప్రదేశ్‌లో నిరుడు నిరూపించుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న తెలుగుదేశంతో చెలిమిని కొనసాగిస్తోంది. తమ నుంచి ఫిరాయించిన ఇద్దరు ఎంపీలపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు లోక్‌సభ స్పీకర్ వద్ద మూడేళ్లుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది.
ఇది చాలదన్నట్టు నంద్యాల ఉప ఎన్నిక గెలిచినందుకు బాబును స్వయానా ప్రధాని నరేంద్రమోదీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆ ఎన్నిక ఎందుకు అవసరమైందో మోదీకి తెలియదనుకోలేం. పైగా అక్కడ ఎడాపెడా జరిగిన అధికార దుర్వినియోగం, సృష్టించిన భయానక వాతావరణం సంగతి ఆయనకు చేరి ఉండాలి. కనీసం తమను అక్కడ బాబు ప్రచారానికే రానీయకుండా అవమానించారన్న విషయం తెలిసి ఉండాలి. గోవా, ఢిల్లీల్లో తమ పార్టీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ జనం తీర్పు కోరినందుకైనా నంద్యాల విషయంలో ఆయన మౌనంగా ఉండిపోతే వేరుగా ఉండేది.
నంద్యాల అగ్నిపరీక్ష ఎదుర్కొనడం తప్పదని గ్రహించినప్పటినుంచీ అధికార తెలుగుదేశం అక్కడ సాగించిన అరాచకాలకూ, అధికార దుర్వినియోగానికీ అంతు లేదు. అంతకిత్రం నంద్యాలసహా విపక్షం గెలిచిన 67 స్థానాల్లోనూ కనీసం ఒక్కచోటైనా బాబు సర్కారు అభివృద్ధి ఊసెత్తలేదు. ఫిరాయింపులు జరిగాక ఆ 21 చోట్ల కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు. కానీ ఉప ఎన్నిక అనేసరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తి ఆగమేఘాలపైన నంద్యాలలో స్వల్ప వ్యవధిలో రూ. 1,400 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టింది. చేతికి ఎముక లేకుండా జీవోలు జారీ చేసింది. ‘అవిగో ఇళ్లు... ఇవిగో పింఛన్లు, రోడ్లు’ అంటూ హడావుడి చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్లో, సానుభూతిపరుల్లో భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేసింది. స్వయానా ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఇంటివద్దే పోలీసుల్ని మోహరిం చడంతోపాటు ఇతర నాయకుల ఇళ్లపై అర్ధరాత్రుళ్లు పోలీసు దాడులు చేయించింది. ఇవన్నీ ఒకపక్క కొనసాగిస్తూనే రూ. 200 కోట్ల మేర టీడీపీ నల్లడబ్బు ఖర్చు చేసిందన్న ఆరోపణలున్నాయి. స్వయానా చంద్రబాబే కులాలవారీ సమావేశాలు పెట్టి ప్రలోభపెట్టాలని చూశారు.
‘నా పింఛన్ తీసుకుంటున్నారు... నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు, నాకు ఓటెందుకు వేయరంటూ' ప్రజల్ని బ్లాక్‌మెయిల్ చేసే ప్రయ త్నాలకు దిగారు. తన సొంత ఆస్తుల్ని జనానికి దోచిపెడుతున్నట్టు మాట్లాడారు. దాదాపు కేబినెట్‌నంతటినీ, 70మంది ఎమ్మెల్యేలనూ అక్కడ దించారు. ప్రచార పర్వం ముగిశాక ఎక్కడివారక్కడికి పోవాల్సి ఉండగా వారిలో చాలామంది నంద్యా లలోనే తిష్టవేసి బెదిరింపుల పర్వాన్ని కొనసాగించారు. చేసిందంతా చేసి నంద్యాల ఫలితం తన పాలనపై రిఫరెండమని బాబు చెప్పుకుంటున్నారు. విషాదమేమంటే ఎన్నికల సంఘం అధికారులకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందినా వారు సరైన చర్యలు తీసుకోలేకపోయారు. ఒక ఉదంతంలో చర్య తీసుకోక తప్పనందుకు ఆ సంస్థపై బాబు ఆరోపణలు చేయడం చూస్తే ఎవరికైనా డేరా బాబా గుర్తుకు రాకమానడు. ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలకూ పాల్పడిన డేరా బాబా మూడు కేసుల్లో శిక్ష పడేసరికి తనకేదో అన్యాయం జరిగిందని లబలబలాడి మూడు రాష్ట్రాల్లో ఎలా విధ్వంసం సృష్టించాడో అందరికీ తెలుసు. బాబు తొలిసారి పాలనలోనే డేరా బాబాకు సాటిరాగల నయూముద్దీన్ పుట్టుకొచ్చాడు. లెక్కలేనన్ని హత్యలు, అత్యాచారాలు, ఇతర అఘాయిత్యాలు బాబు సర్కారు ఆశీస్సులతో కొనసాగించాడు. ఏదేమైనా నంద్యాల ఉప ఎన్నిక తంతు చూస్తే ఎన్నికల సంఘానికంటూ కింది స్థాయి వరకూ శాశ్వత ప్రాతిపదికన సొంత వ్యవస్థ ఉండాలనీ, అది మరింత సమర్ధవంతంగా పనిచేసేలా నిబంధనలుండాలని, ఆ సంఘం ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకునే ఏర్పాటుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.