‘నవ స్తంభాల’ బడ్జెట్! | budget will release by arun jaitley | Sakshi
Sakshi News home page

‘నవ స్తంభాల’ బడ్జెట్!

Published Tue, Mar 1 2016 1:15 AM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

‘నవ స్తంభాల’ బడ్జెట్! - Sakshi

‘నవ స్తంభాల’ బడ్జెట్!

తన ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ను పరీక్షతో పోల్చుకుని...125 కోట్లమంది జనం పెట్టే ఆ పరీక్షపై ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నానని ఆదివారంనాటి ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పాలకుల మాటేమోగానీ బడ్జెట్‌లు ఎప్పుడైనా జనానికే పరీక్ష. బడ్జెట్ సందర్భంగా ఆర్ధికమంత్రులు చేసే సుదీర్ఘమైన ప్రసంగాలు...అందులో ఏకరువు పెట్టే గణాంకాలు గందరగోళ పెడతాయి. వేలు, లక్షల కోట్ల రూపాయల కేటాయింపుల గురించి చెబుతుంటే వినసొంపుగా అనిపిస్తాయి. పాత బడ్జెట్‌లతో పోల్చి చూసుకుని...వాస్తవ అవసరాలేమిటో, దక్కింది ఎంతో తెలిశాకగానీ అంతరార్ధం వెల్లడి కాదు. దేశం రూపురేఖలను సమూలంగా మార్చడానికి దోహదపడగలవంటున్న తొమ్మిది రంగాలను ‘తొమ్మిది మూల స్తంభాలు’గా గుర్తించి, వాటిపై ప్రధానంగా దృష్టిసారిస్తూ కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ముఖ్యంగా గ్రామీణ మౌలిక సదుపాయాలకూ, వ్యవసాయ రంగానికీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అందుకు తగినట్టే ఘనమైన మొత్తాలను వాటికి కేటాయించారు. వచ్చే అయిదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమని కూడా చెప్పారు. సాధారణంగా ‘తొమ్మిది’ అంకెపై చాలామందిలో ఏదో తెలియని నమ్మకం ఉంటుంది. అరుణ్ జైట్లీ అలాంటి నమ్మకంతో ‘తొమ్మిది’కి పరిమితమయ్యారో లేక అవి మాత్రమే అత్యంత కీలకమైనవని భావించారో తెలియదు. ఇందులో వ్యవసాయం, గ్రామీణం, సామాజిక రంగం, విద్య, మౌలిక సదుపాయాలు, ఆర్ధిక రంగ, ప్రభుత్వ రంగ సంస్కరణలు, పన్ను సంస్కరణలు, ద్రవ్య క్రమశిక్షణ వంటివి ఉన్నాయి.

మొత్తంగా 19 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుబడిలో గ్రామీణాభివృద్ధికి రూ. 87,765 కోట్లు కేటాయించారు. ఇది గతంకంటే రూ. 8,200 కోట్లు ఎక్కువ. అలాగే 14వ ఆర్ధిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు రూ. 2,87,000 కోట్ల మొత్తాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇవ్వబోతున్నారు. పల్లెసీమల్లో వలసలను అరికట్టడానికి తోడ్పడుతున్న ఉపాధి హామీ పథకానికి రూ. 38,500 కోట్లు దక్కాయి. ఇది నిరుటికన్నా రూ. 3,800 కోట్లు అధికం. అటు వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులు కూడా భారీగానే కనబడుతున్నాయి. వ్యవసాయానికి నిరుడు కేటాయించిన రూ. 24,910 కోట్లతో పోలిస్తే ఈసారి ఇచ్చిన రూ. 35,984 కోట్ల మొత్తం ఎక్కువే. అయితే అంతక్రితం(2014-15) కేటాయించిన రూ. 26,623 కోట్లతో పోలిస్తే నిరుడు దక్కిన మొత్తం తక్కువన్న సంగతి మరవకూడదు. మన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. వరస కరువు కాటకాలతో ఈసారి అది 1.1 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో కొత్తగా ఈ ఏడాది 28.5 లక్షల హెక్టార్ల భూమిని సాగుయోగ్యం చేయడమే లక్ష్యమని అరుణ్ జైట్లీ చెప్పడం హర్షించదగిన విషయం. ఇందుకోసం ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన(పీఎంకేఎస్‌వై) పథకాన్ని ప్రకటించారు. ఆ పథకానికి రూ. 5,717 కోట్ల మొత్తం కేటాయించారు. దీంతోపాటు నాబార్డ్ పరిధిలో రూ. 20,000 కోట్ల మూలనిధితో దీర్ఘకాల నీటిపారుదల నిధిని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. నిధులు లేక నిలిచిపోయిన 89 చిన్నా చితకా సాగునీటి ప్రాజెక్టుల్ని గుర్తించి వాటిని పూర్తిచేయాలని భావిస్తున్నట్టు జైట్లీ చెప్పారు. అయితే పూర్తికావలసిన ప్రాజెక్టులు, వాటికవసరమైన నిధులతో పోలిస్తే ఈ కేటాయింపులు ఏమూలకూ సరిపోవు. సాగునీటి పారుదల ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం. పైగా అవి పర్యావరణ అనుమతులతోసహా ఎన్నిటినో అధిగమించాల్సి ఉంటుంది.  తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల, ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరంవంటి ప్రధాన ప్రాజెక్టులు పూర్తయినప్పుడు మాత్రమే భారీ మొత్తంలో కొత్తగా సాగుభూమి సాధ్యమవుతుంది.

ఇలాంటి ప్రాజెక్టులకు అవసరమైన కేటాయింపులు చేయకుండా ఇంతటి బృహత్తర లక్ష్యానికి చేరువ కావడం సాధ్యమేనా? యూపీ, పశ్చిమబెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే సాగు రంగానికి ప్రాధాన్యతనిస్తున్నట్టు బడ్జెట్‌లో చూపారని విపక్షాలు చేస్తున్న విమర్శలను పూర్వపక్షం చేయాలంటే సాగునీటి ప్రాజెక్టులకు ఇతోధికమైన కేటాయింపులు అవసరమని అరుణ్ జైట్లీ గుర్తించాలి. తొలి అనామతు ఖాతా బడ్జెట్‌ను వదిలేస్తే జైట్లీ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. ప్రస్తుత పాలనాకాలంలో ఇలాంటి పూర్తిస్థాయి బడ్జెట్‌లు మరో రెండు వస్తాయి. ఆ రెండు బడ్జెట్‌లు పూర్తయ్యేసరికైనా సాగు యోగ్యమైన భూమి పెరగాలంటే నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులందించడంలో చాలా ఉదారంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా లేని ప్రస్తుత స్థితిలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమివ్వడం చాలా అవసరం. పైగా దేశ జనాభాలో సగానికిపైగా మంది ఇప్పటికీ ఆ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.  

ఆరోగ్యరంగానికి ఈసారి రూ. 38,206 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాదికన్నా రూ. 4,375 కోట్లు ఎక్కువ. అయితే, జాతీయ ఆరోగ్య మిషన్‌కు ఎప్పటిలానే రూ. 19,037 కోట్లు దక్కాయి. శిశు మరణాల్లో, పౌష్టికాహార లోపంలో ఇప్పటికీ కొన్ని వెనకబడిన దేశాలతో పోలిస్తే వెనకనే ఉంటున్న మనకు ఆ రంగాన్ని సరిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. జైట్లీ చెప్పినట్టు నిరుపేద వర్గాలకు ఆరోగ్య బీమా పథకాలు అవసరమే. అయితే అదే సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టం చేసి, అక్కడ మౌలిక సదుపాయాలను పెంచడం ముఖ్యమని ఆయన గుర్తించాలి. ఈ బడ్జెట్‌లో అందుకు అనుగుణమైన చర్యలు లేవు. ఒకపక్క ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కు చేయబోతున్నామని చెబుతూ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు, నర్స్‌ల పోస్టుల భర్తీకి ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం ఆశ్చర్యకరం.  

విపక్ష ఎమ్మెల్యేల షాపింగ్‌లో బిజీగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ సంక్షేమాన్ని గాలికొదిలిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిర్వాకాన్ని ఈ బడ్జెట్ మరింత విస్పష్టంగా చూపింది. మొన్నటి రైల్వే బడ్జెట్‌లో విశాఖ రైల్వే జోన్ ఊసులేదు. ఈ బడ్జెట్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. పోలవరానికి కూడా అరకొర కేటాయింపులే దక్కాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న బాబు వైఖరివల్ల ఈ స్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement