ప్రయోగాలే ప్రాణం | creator of agricultural equipment | Sakshi
Sakshi News home page

ప్రయోగాలే ప్రాణం

Published Mon, Apr 14 2014 1:24 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ప్రయోగాలే  ప్రాణం - Sakshi

ప్రయోగాలే ప్రాణం

వ్యవసాయ పరికరాల సృష్టికర్త గురుమూర్తి
నీళ్ళు తగ్గిన బోర్లకు కేసింగ్ పైప్ డ్రిల్లర్‌తో కొత్త జీవం
కలుపుతీత యంత్రంతోనే ఎరువుల పిచికారీ
సాగునీటి ఆదా కోసం వాటర్ స్టోరేజీ ట్యాంక్


నడిచే దారిలో అడ్డంకులెదురయినప్పుడే మనిషి కొత్త దారి వెతుకుతాడు. ఉన్నచోటే ఉండిపోయిన తరువాత కొద్దిరోజులకు అక్కడే ఎందుకున్నామో తెలియని పరిస్థితి వస్తుందంటాడు ప్రఖ్యాత నావికుడు, అన్వేషి జేమ్స్ కుక్. చిత్తూరు జిల్లా ఏడూరు గ్రామానికి చెందిన గాండ్ల గురుమూర్తి శెట్టి కూడా ఈ స్పూర్తిని పుణికి పుచ్చుకున్నట్లున్నారు.
 
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన గురుమూర్తి చదువు ఆర్థిక స్థోమత లేక పదో తరగతితోనే ఆగిపోయింది. వ్యవసాయంలో ఆటుపోట్లు ఎదురైన ప్రతిసారీ పట్టుదలతో కొత్త ఆలోచనలు చేశారు. ఈ ప్రయత్నంలో ఆయా సమస్యలను తీర్చే పరికరాలను రూపొందించారు. నిత్య ప్రయోగశీలి అయిన గురుమూర్తికి సోదరులు సుబ్రమణ్యం శెట్టి, చిన్నగురుమూర్తి ఆయనకు వెన్నుదన్నుగా నిలవడం విశేషం.వ్యవసాయ భూముల్లో బోర్లు వేసేటప్పుడు తొలుత కేసింగ్ పైపు అమర్చి ఆ తరువాత డ్రిల్లింగ్ చేస్తారు. దీని వలన కేసింగ్ పైప్ అమర్చినంత మేర పై పొరల్లో నీరు బోరులోకి చేరకుండా నిలిచిపోతుంది.
 
కింది పొరల్లో ఉన్న నీళ్ళు మాత్రమే మోటర్‌కు అందుతాయి. అయితే, పై పొరల్లో నీరున్నా అది బోరుకు చేరదు. కేసింగ్‌కు రంధ్రాలు పెట్టగలిగితే పై ఊట కూడా బోరులోనికెళుతుంది. మామూలుగా అయితే జాలికేసింగ్ వేయడానికి మళ్లీ బోరు బండి వచ్చి కేసింగ్ తీసి రంధ్రాలున్న కేసింగ్ అమర్చాలి. గురుమూర్తి రూపొందించిన పరికరం ద్వారా మోటార్ పైకి ఎత్తిన తరువాత ఈ పరికరంతో లోపలి వైపు నుంచి రంధ్రాలు వేయవచ్చు. ఈ పరికరాన్ని కేసింగ్ కింది భాగం వరకు దించి.. దానికి అమర్చిన పైపులను చేత్తో తిప్పుతూ ఉన్నట్లయితే కేసింగ్‌కు ఇరువైపులా రంధ్రాలు పడుతాయి. ఇలా పై వరకు చేస్తూ వస్తే భూమి పై భాగంలోని నీరు బోరులోకి వెళ్తుంది. ఈ యంత్రం కారణంగా ఎండుముఖం పట్టిన బోర్లలోనూ నీరు వస్తుంది.
 
ఇప్పటికే వందకు పైగా బోర్లలో కేసింగ్‌కు రంధ్రాలు పెట్టి.. ఆ రైతుల పొలాలు పచ్చగా చేశాడు. కనీసం పది మంది సహాయకులు ఇతని వద్ద పనిచేస్తూ ఈ యంత్రం ద్వారా కేసింగ్‌కు రంధ్రాలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ పరికరంపై మేధోహక్కులు పొందేందుకు పేటెంట్ కోసం ధరఖాస్తు చేసుకొని రిజిస్టర్ నెంబర్ (పబ్లికేషన్ నెంబర్  గిై/2010/131064,్కఇఖీ/ఐఆ 2009/005620, ఛ్టీ:18.11.2010)ను పొందారు. పేటెంట్ పొందడానికి 2007 నుంచే గురుమూర్తి తిప్పలు పడుతున్నారు. అప్పటి వ్యవసాయ శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య సహాయ సహకారాలతో పేటెంట్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు.
 
కలుపు తీతతో పాటే ఎరువులు..


వ్యవసాయ శాఖ ద్వారా సమకూర్చుకున్న కలుపుతీసే పరికరానికి కొద్దిగా మార్పులు చేసి.. పనిలో పనిగా రసాయన ఎరువులను సైతం వేసుకొనే విధంగా పరికరాన్ని రూపొందించారు. చక్రానికి అదనంగా ఓ సైకిల్ టైర్‌ను అమర్చి, పరికరం పైభాగంలో ఓ బాక్సును ఏర్పాటు చేసి అందులో రసాయనిక ఎరువులను నింపి కలుపుతీత సమయంలోనే ఎరువు వేసేకునేలా తయారు చేశాడు. వ్యవసాయ శాఖ అందజేసిన వేరుశెనగ విత్తనాలు వేసే పరికరానికి గతంలో ఎద్దులను వాడేవారు. ఈ పరికరాన్ని రెట్టింపు వెడల్పు చేసి తక్కువ సమయంలోనే ట్రాక్టర్‌తో వేరుశెనగ విత్తనాలు వేసేందుకు మరో పరికరాన్ని తయారు చేశారు.
 
నీటి నిలువ ట్యాంక్‌తో ఎరువుల విడుదల


బోర్లలో నీటిమట్టం తగ్గి సన్నటి నీటి ధార వచ్చినప్పుడు డ్రిప్పుకు నీరు పెట్టడం కష్టం. నీటి ఒత్తిడి తగినంత లేకపోవడం వలన డ్రిప్పు పైపులకు నీరు సరిగ్గా వెళ్లదు. ఇందుకోసం ఒక స్టోరేజీ ట్యాంక్‌ను నిర్మించి.. దాన్ని కలుపుతూ మరో చిన్న అరలాంటి భాగంలో ఆవుపేడ, మూత్రం వేసి వాటిని 3 అశ్వ శక్తిగల మోటార్‌తో డ్రిప్పు ఫిల్టర్‌కు జత చేశారు. దీని వలన బోరు నీటి ఒత్తిడితో సంబంధం లేకుండా డ్రిప్పుకు నీరు విడుదలవుతుంది.  ట్యాంకులోని నీటితో పాటే పంటకు కావాల్సిన ఎరువులు సైతం మొక్కకు అందేలా చేశారు.
 
ఇలాంటివి మరెన్నో

సాధారణంగా మల్బరీ రైతులు ఏడాదికి 4 నుంచి 5 పంటలు తీస్తుంటే.. గురుమూర్తి ఏడాదికి 7 పంటలు తీస్తున్నారు. పట్టు పురుగులు పెంచే ైరైతులు షెడ్లలో యాంగిల్స్‌తో స్డాండు బిగించుకోవడంతో వస్తున్న ఇబ్బందులను అధిగమించడానికి కొయ్యలతో తాత్కాలిక స్టాండును అమర్చారు. మల్బరీ పంట పూర్తయ్యాక ఆ వ్యర్ధాలను తొలగించడం రైతులకు కష్టమే. ఇతను రూపొందించిన విధానంతో కొయ్యలకు అమర్చిన స్క్రూలను తీసేస్తే స్టాండు ఓ వైపునకు వాలుతుంది.
 
దీంతో పై నుంచి కింది వరకు అన్ని స్టాండులోని వ్యర్ధాలను సులభంగా ఒకే మనిషి కిందికి తీసేయొచ్చు. రైతులు తమ పనుల్లో భాగంగా ఏదేని పంట కోతకొచ్చినపుడు దాన్ని సంచుల్లో నింపేందుకు ఒకరు సంచిని పట్టుకోవడం మరొకరు అందులోకి నింపడం జరుగుతుంది. అయితే సంచిని పట్టుకొనే పనిలేకుండా కేవలం రూ.200 వ్యయంతో స్టాండును తయారు చేశారు. కొబ్బరి  పొట్టుతో 60 రోజుల్లో సేంద్రియ ఎరువు తయారు చేసే పద్ధతిని గురుమూర్తి రైతులకు ఉచితంగా నేర్పుతున్నారు.   

 - పి. సుబ్రమణ్యం, న్యూస్‌లైన్ , పలమనేరు, చిత్తూరు జిల్లా
 
 నాకొచ్చిన కష్టం ఇంకో రైతుకొద్దు!


 నాకు వ్యవసాయమంటే ప్రాణం. అసలే కూలీలు దొరక్క వ్యవసాయానికి ఖర్చులు పెరిగిపోయాయి. సమస్యలను అధిగమించడానికి ఏదో ఉపాయం వెతకాలనుకున్నా. అందుకే ఎదురైన ప్రతి ఇబ్బందినీ అధిగమించేందుకు ఓ కొత్త పరికరాన్ని తయారు చేస్తున్నా. నేను ఉపయోగించిన తర్వాతే ఇతరులకు చెబుతున్నా. కేసింగ్‌కు రంధ్రాలు పెట్టే పరికరం రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. నా పరికరాలను ఉపయోగించుకోవాలనుకునే రైతులు నన్ను నేరుగా కలవొచ్చు.    

 - గాండ్ల గురుమూర్తి శెట్టి(98491 26223),ఏడూరు గ్రామం, గంగవరం మండలం, చిత్తూరు జిల్లా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement