రహదార్ల రక్తచరిత్ర! | dangerous roads that's why central Rural Development Minister Gopinath Munde is died | Sakshi
Sakshi News home page

రహదార్ల రక్తచరిత్ర!

Published Wed, Jun 4 2014 12:10 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

dangerous roads that's why central Rural Development Minister Gopinath Munde is died

మహారాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య నేత, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండే మంగళవారం ఢిల్లీలో దుర్మరణం చెందిన తీరు మన రహదారుల రక్త చరిత్రను మరోసారి గుర్తుచేసింది. పౌరుల యోగక్షే మాలు అసలే పట్టని ప్రభుత్వాల సాక్షిగా రహదారులు నిత్యమూ నెత్తురోడుతూనే ఉన్నాయి. ఈమధ్యే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిం చిన వివరాల ప్రకారం ప్రపంచంలోనే మన దేశం రోడ్డు ప్రమాదాల్లో అగ్రస్థానంలో ఉన్నది. 2012లో ఈ రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 461మంది మరణించగా, 1,301మంది గాయపడ్డారు. అంటే ఆ ఏడాదిలో దాదాపు లక్షా 66వేలమంది దుర్మరణంపాలయ్యారు. నాలు గున్నర లక్షలమంది గాయపడ్డారు. సగటున ప్రతి గంటకూ 19 మర ణాలు సంభవిస్తున్నాయి. అంటే ప్రతి మూడు నిమిషాలకూ ఒకరు చనిపోతున్నారన్నమాట! ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు ‘పుట్టిన వారు గిట్టక తప్పద’న్న వేదాంత ధోరణిలో మందకొడిగా ఉండిపోతు న్నాయి. తమ వంతుగా ఏమి చేయవచ్చునో, ఏమి చేయాల్సివున్నదో ఆలోచించక రోజులు వెళ్లదీస్తున్నాయి. గోపీనాథ్ ముండేను బలిగొన్న ప్రమాదాన్నే గమనిస్తే దేశ రాజధాని నగరంలో సైతం ఎంతటి అస్తవ్యస్థ పరిస్థితులున్నాయో అర్ధమవుతుంది. తెలతెలవారుతున్న తరుణంలో, ట్రాఫిక్ మరీ పద్మవ్యూహంలా మారని ఘడియల్లో కూడా సిగ్నల్‌ను సైతం పట్టించుకోకుండా వేగంగా వచ్చిన కారొకటి కాన్వాయ్‌లో వెళుతున్న కేంద్రమంత్రి కారును ఢీకొన్నదంటే ఆశ్చర్యం కలుగుతుంది.

రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను సూచించడానికి రెండు నెలలక్రితం సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ విషయంలో ప్రభుత్వాలపై ఎంత ఒత్తిడి తెచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయాక సర్వోన్నత న్యాయస్థానం ఈ చర్య తీసుకుంది. మనకు మోటారు వాహనాల చట్టం ఒకటుంది. 1939 నాటి చట్టాన్ని సవరించి 1989లో ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చారు. అందులో డ్రైవింగ్ లెసైన్స్ మంజూరు చేయడం దగ్గరనుంచి పర్మిట్లు, ఇన్సూరెన్స్, నేరంగా పరిగణించే చర్యలు, విధించే పెనాల్టీలు వగైరా వివరాలన్నీ ఉంటాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధించే జరిమానా రూ. 100కాగా, ప్రమాదంలో మనిషి ప్రాణం పోయిన సందర్భాల్లో కూడా దాన్ని బెయిల్‌కు వీలైన నేరంగానే పరిగణిస్తున్నారు. శిక్ష కూడా రెండేళ్లు మించడంలేదు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన సందర్భాల్లో డ్రైవింగ్ లెసైన్స్‌ను రద్దుచేయడంతోసహా కఠిన చర్యలు తీసుకోవాలని ఎందరు మొత్తు కుంటున్నా ఫలితం లేదు. మన మోటారు వాహనాల చట్టం ద్విచక్ర వాహనం మొదలుకొని అన్ని రకాల వాహనాల గురించి మాట్లాడు తుంది. వేగ పరిమితుల గురించి చెబుతుంది. ఇవన్నీ ఎంతసేపూ వాహనచోదకుల చుట్టూ తిరుగుతాయి తప్ప మొత్తంగా రహదారుల భద్రత కోణాన్ని స్పృశించవు. పాదచారుల దగ్గరనుంచి మొదలుపెట్టి ఎవరెవరు ఎలాంటి నిబంధనలను పాటించాలో, పాటించకపోతే తీసు కోవాల్సిన చర్యలేమిటో తెలియజేసే సమగ్రమైన చట్టం ఉంటే... అందులోని నిబంధనల అమలు తీరును తెలుసుకునేందుకు అవసర మైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తే ప్రమాదాలను చాలా వరకూ నివారించవచ్చు. ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా పాటించే సంస్కృతిని పెంపొందించవచ్చు. వాహనాల్లో వెళ్లేవారు సీటు బెల్టులు ధరించాలన్న నిబంధన ఉన్నా దాన్ని పట్టించుకునేవారు తక్కువ. ముందు సీట్లో కూర్చునేవారిలో కొందరైనా ఈ బెల్టులు పెట్టుకుంటా రుగానీ వెనక సీట్లో ఉండేవారు అసలు పట్టించుకోరు. గోపీనాథ్ ముండే కూడా వెనక వరసలో కూర్చున్నా సీటు బెల్టు ధరించలేదు. రహదారుల తీరుతెన్నులు ఎలా ఉండాలో...అలా లేనప్పుడు జవాబు దారీతనాన్ని నిర్దేశించడమెలాగో, బాధ్యులపై చర్యలెలా ఉండాలో చట్టం చెప్పాలి. మన దేశంలో 97 శాతం రహదారులకు అసలు ఫుట్‌పాత్‌లే ఉండవని గణాంకాలు అంటున్నాయి. రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తున్నా, భారీ వర్షాలకు రోడ్లు అధ్వాన్న స్థితికి చేరినా పట్టించుకు నేవారుండరు. రహదారుల బాగోగులను ఎప్పటికప్పుడు చూస్తూ వెనువెంటనే చక్కదిద్దే వ్యవస్థ లేదు. రోజులు, నెలలు గడిచాక ఏదో మొక్కుబడిగా చేయడం, సరిచేసిన కొన్నాళ్లకే అవి యథాస్థితికి చేరడం మనకు నిత్యానుభవం.

రహదారుల భద్రత గురించిన సమగ్ర చట్టం లేకపోవడంవల్లనే మన దేశంలో నానాటికీ ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రపంచం లోని మొత్తం వాహనాల్లో మన దేశంలో ఉన్నవి ఒక్క శాతమే. కానీ ప్రపంచ దేశాల్లో జరిగే ప్రమాదాల్లో మన వాటా 11 శాతం ఉంటు న్నది. ఉగాండా, వియత్నాంవంటి దేశాలు సైతం రహదారి భద్రతపై దృష్టిసారించి పటిష్టమైన చర్యలు తీసుకుంటుండగా మన పాలనా యంత్రాంగానికి ఏమొచ్చిందో తెలియదు. రహదారులు సక్రమంగా లేనికారణంగా వాహనాలు దెబ్బతిని ఏటా కొన్ని వేల కోట్ల రూపా యల నష్టం సంభవిస్తున్నదని మోటారు వాహనాల యాజమాన్యాలు మొత్తుకున్నా వారిది అరణ్యరోదనే అవుతున్నది. పెట్రోల్, డీజిల్ వగై రాలపై వసూలు చేసే సుంకాల్లో కనీసం కొంత మొత్తాన్నయినా రహ దారులను మెరుగుపరచడానికి ఖర్చుచేస్తే కాస్తయినా ప్రయోజనం ఉండేది. వాహనాల తయారీలో ఉండే లోపభూయిష్టత  కూడా ప్రమా దాలకు కారణమవుతున్నదని, డిజైన్ సక్రమంగా లేని కారణంగా కొన్నివాహనాలు నిర్దిష్ట వేగం మించిన తర్వాత ప్రమాదాల బారినప డుతున్నాయని నిపుణులు చెబుతున్నా పట్టించుకున్న దాఖ లాలు లేవు. కనీసం ఇప్పటికైనా కేంద్రం మేల్కొని ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలి. అది సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement