ప్రపంచకప్ సాధించిన ఫ్రాన్స్ సాకర్ టీం
ఏ క్షణాన ఏమవుతుందో తెలియకుండా ఊహాతీతమైన మలుపులు తిరుగుతూ ఆద్యంతం ఉత్కంఠ రేపే ప్రపంచ సాకర్ క్రీడా సంరంభం ముగిసింది. హోరాహోరీగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో క్రొయే షియా జట్టును ఓడించి, ప్రపంచ కప్ చేజిక్కించుకుని ఫ్రాన్స్ విశ్వ విజేతగా నిలిచింది. పరస్పరం తలపడుతున్న రెండు జట్లూ బరిలో నువ్వా నేనా అన్నట్టు చెలరేగేవి అయినప్పుడే ఆట రంజుగా ఉంటుంది. అవతలి టీం బలహీనమైనదన్న ముద్ర పడితే, ఫలితం ముందే అంచనాకు వచ్చేలా ఉంటే ఆసక్తి పుట్టదు. నిజానికి ఫ్రాన్స్‌తో ఫైనల్లో తలపడిన క్రొయేషియా జట్టు తొలిసారి 1998లో అడుగు పెట్టినప్పుడు మూడో స్థానంలో నిలిచిందిగానీ ఆ తర్వాత అది పెద్దగా ప్రతిభ కనబర్చలేదు.
అయితే ఈసారి దాని కెప్టెన్ లూకా మోడ్రిక్ నాయకత్వంలో ఆ జట్టు అసాధారణ రీతిలో ఆడింది. లీగ్ దశలో అర్జెంటీనా లాంటి కాకలు తీరిన జట్టునే మట్టి కరిపించింది. ప్రి క్వార్టర్స్‌లో డెన్మార్క్‌పై, క్వార్టర్స్‌లో రష్యాపై, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై అద్భుతంగా ఆడింది. అన్ని దశల్లోనూ ఎన్నెన్నో ఒత్తిళ్లనూ, అవాంత రాలనూ ఎదుర్కొంది. చివరకు ఫైనల్‌కి చేరింది. చెప్పాలంటే దానిది శక్తికి మించిన పోరాటం. జట్టు సభ్యులు మంచి సమన్వయంతో దూకుడు ప్రదర్శించడం వల్ల క్రొయేషియాపై అంచనాలు పెరుగుతూ పోయాయి. దాని దూకుడు ఫ్రాన్స్ జట్టును మొదట్లో అయోమయంలో పడేసింది. కానీ చూస్తుండగానే అంతా తిరగబడింది. ఫ్రాన్స్ జట్టు కోలుకుని జోరు పెంచింది.
ఎలాగైతేనేం అది క్రొయేషియాను జయించగలిగింది. గెలుపోటముల మాటెలా ఉన్నా క్రొయేషియా చివరి వరకూ పోరాడిన తీరు చిరస్మరణీయమైనది. పట్టుమని 40 లక్షలమంది జనాభా లేని ఆ దేశం ఇంతటి పోరాటస్ఫూర్తిని ప్రద ర్శించడం నిజంగా మెచ్చదగింది. అందువల్లే క్రీడాభిమానులంతా ఫ్రాన్స్ క్రీడాకారులతోపాటు క్రొయేషియా జట్టు సభ్యుల్ని కూడా హీరోలుగానే పరిగణించారు. ఫ్రెంచ్ జట్టు ఎన్నడో 20 ఏళ్లక్రితం ప్రపంచకప్ గెల్చుకుంది. పన్నెండేళ్లక్రితం అంటే...2006లో ఫైనల్ వరకూ వచ్చి ఆగిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు అది విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. అందుకే పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద దాదాపు లక్షమంది అభిమానులు ఆరోజు పెద్ద పండగ చేసుకున్నారు. ప్రతిసారిలాగే ఈసారి కూడా రిఫరీ నిర్ణయం వివాదాస్పదమైంది. క్రొయేషియా ఆటగాడి చేతికి బంతి తగిలిందని రిఫరీ పెనాల్టీ ఇచ్చాడు. అది ఉద్దేశపూర్వకంగా చేయలేదని క్రొయేషియా వాదించిన లాభం లేకపోయింది. బహుశా ఇది జరగ కపోయి ఉంటే క్రొయేషియా మరింత నిబ్బరంగా ఆడగలిగేదేమో!
అయితే ఇరవైయ్యేళ్లనాడు ప్రపంచకప్ గెల్చుకున్నప్పటి రీతిలోనే ఈసారి కూడా ఫ్రాన్స్ జట్టుకు ‘బ్లాక్, బ్లాంక్, బ్యూరో(నలుపు, తెలుపు, అరబ్) అన్న ముద్ర పడింది. ఫ్రెంచ్‌లో బ్లాంక్‌కు తెలుపు, బ్యూరోకు అరబ్ అని అర్ధం. ఫ్రాన్స్ జట్టులో శ్వేత జాతీయులు, నల్లజాతీయులు, అరబ్బులు ఉండటం వల్ల ‘బ్లాక్, బ్లాంక్, బ్యూరో’ పేరొచ్చింది. ఇప్పుడున్న జట్టులో 14మంది ఆటగాళ్లకు ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాల మూలాలున్నాయి. 19వ శతాబ్దంలో ఆ దేశాలన్నీ ఫ్రెంచ్ వలసలు. రెండో ప్రపంచ యుద్ధానంతరం దేశ పునర్నిర్మాణం కోసం ఫ్రాన్స్ ఆరాటపడినప్పుడు అందుకవసరమైన కార్మికులు దానికి లేరు. అందుకే ఉత్తర ఆఫ్రికాలో గతంలో తన పెత్తనంకింద ఉన్న దేశాలనుంచి ఫ్రాన్స్ భారీయెత్తున వలసలను ప్రోత్సహించింది.
60వ దశకంలో ప్రపంచ సాకర్ పోటీల్లో తన ప్రాభవం కొడిగట్టడం ప్రారంభించాక తన ఫుట్‌బాల్ క్రీడా నైపుణ్యానికి కూడా పదును పెట్టాలని నిర్ణయించింది. అందుకోసం ఒక అకాడెమీని ప్రారంభించి వందలమందిని చేర్చుకుని తర్ఫీదు నివ్వడం మొదలెట్టింది. ఆ శిక్షణలో ఎందరో ప్రతిభగల ఆటగాళ్లు రూపొందారు. చిత్రమేమంటే వీరిలో అత్యధికులు వలస కూలీల బిడ్డలు. ఈ కుటుంబాలకు కేటాయించిన ప్రాంతాల్లో జీవనం ఎంతో దుర్భరమైంది. అరకొర వసతులతో, అర్థాకలితో ఆ కుటుంబాలు బతకాల్సివచ్చేంది. స్థానికుల జాత్యహంకార ధోరణి, వారికి వత్తాసు పలికే పోలీసుల తీరు కూలీల కుటుంబీకులకు ఎప్పుడూ దుఃఖాన్నే మిగిల్చేది. బహుశా అవి అక్కడి పిల్లల్లో కసిని రగిల్చి కష్టపడటం నేర్పాయి. ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొని గెలిచి తీరాలన్న కృతనిశ్చయాన్ని కలిగించాయి. అందుకే ఆఫ్రికా వలస దారుల పిల్లలు అకాడెమీలో మెరికల్లా తయారయ్యారు. ఫ్రాన్స్ జాతీయ టీంలో స్థానం సంపాదించి చిచ్చరపిడుగుల్లా ప్రశంసలందుకున్నారు.
సాకర్ ప్రపంచంలో దిగ్గజాలుగా వెలిగిన జిండేన్, పాట్రిక్ వీరా సెనెగల్ దేశస్తుల పిల్లలైతే... ఇప్పటి పాల్ పోగ్బా, కిలియాన్ ఎంబాపెలిద్దరూ అల్జీరియా, కామెరూన్‌లకు చెందిన తల్లిదండ్రుల పిల్లలు. నిజానికి పారిస్ ప్రపంచ సాకర్ తారలకు పుట్టిల్లు. అల్జీరియా జట్టు మాజీ కెప్టెన్ బగెర్రా, సెంట్రల్ ఆఫ్రికా దేశమైన గబన్‌కు చెందిన ఆటగాడు పెర్రీ ఎమెరిక్‌లు అక్కడ ఎదిగినవారే. ప్రపంచంలో ఇంతమంది ప్రతిభాశాలురను అందించిన ఘనత మరే అకాడెమీకి లేదంటారు. ఈసారి ప్రపం చకప్ పోటీల్లో సైతం వివిధ దేశాల జట్లలోని 50మంది ఆటగాళ్లు అక్కడ పదునుదేలినవారే. వీటన్నిటిని సరిగా అధ్యయనం చేస్తే మన దేశం కూడా ఫుట్‌బాల్ క్రీడలో రాణించడానికి అవకాశం ఉంటుంది.
ఎన్నడో 1950లో ఒక్కసారి వరల్డ్ కప్‌లో పాల్గొనడానికి అనుకోకుండా అవకాశం వచ్చినా జట్టును పంపలేక ఆ అవకాశాన్ని మన దేశం చేజార్చుకుంది. ఇటీవలికాలంలో మన ఆట గాళ్లు కూడా మెరుగ్గా ఆడుతున్నారు. వచ్చే ఏడాది జరిగే ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ) ఆసియా కప్‌లో పాల్గొనడానికి మన జట్టు అర్హత సాధించింది. అక్కడ మంచి తీరు ప్రదర్శించగలిగితే మున్ముందు దానిపై ఆశలు పెట్టుకోవచ్చు. చిన్నా చితకా దేశాలు సైతం ప్రపంచ సాకర్ యవనికపై మెరుస్తున్నప్పుడు మనమెందుకు వెనకబడ్డామన్న ఆత్మ విమర్శ పాలకుల కుండాలి. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే... తగిన ప్రోత్సాహకాలందిస్తే... రాజకీయాలను దరిచేరనీయ కుంటే మనం సైతం ఆ క్రీడలో ఎదగడానికి అవకాశం ఉంటుందని గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment