ఈమధ్యే శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గోతబయ రాజపక్స తన తొలి విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకుని గురువారం ఇక్కడికొచ్చారు. పదిరోజులనాడు జరిగిన ఎన్నికల్లో రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పొదుజన పెరమున(ఎస్‌ఎల్‌పీపీ) అధిక శాతం ఓట్లు సాధించింది మొదలు కొని ఇరు దేశాల సంబంధాలపైనా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. గోతబయ సోదరుడు మహిందా రాజపక్స అయిదేళ్ల క్రితం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన భారత్ విషయంలో వ్యవహ రించిన తీరు నేపథ్యంలో ఈ ఊహాగానాలు తలెత్తాయి. అయితే భారత్ భద్రతకు ఇబ్బందిగా పరిణ మించే విధాన నిర్ణయాలేవీ తీసుకోబోమని గోతబయ ఇప్పటికే చెప్పారు. చైనాతో తమ సంబంధాలు పూర్తిగా వాణిజ్యపరమైనవేనని వివరించారు. బహుశా మన ప్రభుత్వానికి కూడా ఇందుకు సంబం ధించిన సంశయాలున్నట్టున్నాయి. కనుకనే గోతబయ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే విదేశాంగ మంత్రి జైశంకర్ కొలంబో వెళ్లి ఆయన్ను కలిశారు. భారత్ పర్యటనకు రావాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని ఆయనకు అందించారు.
శ్రీలంకతో మన సంబంధాలు శతాబ్దాలనాటివి. అయితే ఈ సంబంధాల్లో గత కొన్నేళ్లుగా ఆటుపోట్లు తప్పడం లేదు. ముఖ్యంగా మహిందా ఏలుబడిలో ఆ దేశం చైనాకు సన్నిహితమై మనల్ని దూరం పెట్టింది. హిందూ మహాసముద్ర ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. ఈ ప్రాంతం మీదుగానే తూర్పు, పడమర దేశాల మధ్య నిరంతరం సరుకు రవాణా సాగుతుంటుంది. కనుకనే అది తమ అదుపాజ్ఞల్లో ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆటాడించవచ్చునని అగ్రరాజ్యాలు ఆశిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో అక్కడున్న లంక మన ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే అది మన భద్రతకు ముప్పు కలిగిస్తుంది. వాస్తవానికి చైనా ఒక వ్యూహం ప్రకారం హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో సాన్నిహిత్యాన్ని పెంచుకుని మనకు సవాలు విసురుతోంది.
ఈ విషయంలో మన సమస్యలు మనకున్నాయి. మామూలుగా అయితే విదేశాంగ విధానం విషయంలో ఏ రాష్ట్ర ప్రభు త్వమూ జోక్యం చేసుకోదు. ఫలానా విధంగా ఉండాలని కేంద్రాన్ని కోరదు. కానీ లంకతో సంబంధా లకు ఇది వర్తించదు. శ్రీలంక తమిళులపై అక్కడి ప్రభుత్వం లేదా సింహళ తీవ్రవాద సంస్థలూ విరుచుకుపడినప్పుడల్లా తమిళనాట ఆగ్రహావేశాలు పెల్లుబికేవి. ప్రభాకరన్ నేతృత్వంలోని లిబరేషన్ టైగర్ల సంస్థ శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతంలో ఆధిపత్యం చలాయించినప్పుడు, ఉగ్రవాద దాడు లకు పాల్పడినప్పుడు లంక సర్కారు ఆ వంకన అక్కడి తమిళులపై దమనకాండ ప్రయోగించేది. అలాంటి పరిణామాలు తలెత్తినప్పుడల్లా ఆ దేశాన్ని గట్టిగా హెచ్చరించాలని, అక్కడున్న తమిళుల రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు బయల్దేరేవి. ఈ పరిస్థితుల్లో సహజంగానే మన దేశం లిబరేషన్ టైగర్ల అణచివేతకు సహకరించలేకపోయింది. దాంతో రాజపక్స చైనాకు దగ్గరయ్యారు.
అది ఉదారంగా ఇచ్చిన యుద్ధ విమానాలు, మారణాయుధాలు, రాడార్ల సాయంతో 2009లో ప్రభా కరన్‌తోసహా లిబరేషన్ టైగర్లందరినీ మట్టుబెట్టాక ఆయన పూర్తిగా చైనాపై ఆధారపడటం మొదలుపెట్టారు. ఇదే అదునుగా అక్కడి మౌలిక సదుపాయాల రంగంపై చైనా దృష్టి కేంద్రీకరించి భారీయెత్తున పెట్టుబడులు పెట్టింది. శ్రీలంకలో నౌకాశ్రయాలు, రహదారులు నిర్మించడానికి సిద్ధ పడింది. చూస్తుండగానే చైనా పెట్టుబడులు అమాంతం పెరిగిపోగా, మన వాటా క్షీణించింది. వాణిజ్య సంబంధాలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. అయితే చైనాతో సంబంధాలకు ఎంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో లంకకు ఆలస్యంగా అర్థమైంది. పెట్టుబడులన్నిటిపై అది వసూలు చేసిన వడ్డీలు కాబూలీవాలాను తలపించాయి.
ప్రాజెక్టులన్నీ లంకకు గుదిబండలుగా మారాయి. రుణాలను చెల్లించడం మాట అటుంచి వడ్డీలు కట్టడానికే దిక్కుతోచని స్థితి ఏర్పడింది. దేశ సార్వ భౌమత్వానికి పాతరేస్తున్న ఈ ప్రాజెక్టులపై స్థానికుల్లో నిరసనలు పెల్లుబికాయి. ఉద్యమాలు ఉధృత మయ్యాయి. పర్యవసానంగా కొలంబో పోర్టు సిటీ వంటివి చాన్నాళ్లు నిలిచిపోయాయి. ఈ ప్రాజె క్టుల్ని రద్దు చేసుకుంటే చైనాకు భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి రావడంతో లంక సంకటంలో పడింది. గత్యంతరం లేక కొలంబో పోర్టు సిటీ ప్రాజెక్టును చైనాకే 99 ఏళ్ల లీజుకివ్వాల్సి వచ్చింది. ఇది తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగిస్తుందని లంక ప్రజానీకం భావిస్తుంటే, భారత్ భద్రతకు సమ స్యగా మారుతుందని మన ప్రభుత్వం అనుకుంటోంది.
గత ఎన్నికల్లో ఓడిపోయాక మహిందా రాజపక్స మన దేశంపై ఆక్రోశం వెళ్లగక్కారు. భారత్ హైకమిషన్ కార్యాలయం తన ఓటమికి పావులు కదిపిందని ఆరోపించారు. ఆ తర్వాత ఆయన స్వరం తగ్గించినా, గోతబయ మాత్రం నిరుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మన దేశాన్ని నిందిం చారు. అయితే మన దేశం కూడా మొన్నటిదాకా పాలించిన సిరిసేనపై అసంతృప్తిగా ఉంది. చైనాతో ఆయన దృఢంగా వ్యవహరించలేదన్న అభిప్రాయంతో ఉంది. కనుకనే ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉండి పోవడమే కాదు... గోతబయ ఎన్నికయ్యాక వెనువెంటనే ఆయన్ను అభినందించింది. ఇరు దేశాలూ చర్చించుకుని పరిష్కరించుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.
కొలంబో పోర్టులో జపాన్ సహ కారంతో మన దేశం ఒక టెర్మినల్ నిర్మించడానికి సుముఖత వ్యక్తం చేసి చాన్నాళ్లయింది. అలాగే ట్రింకోమలీ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు, మరొకచోట 500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణం ప్రతిపాదనలు సిరిసేన కాదనడంతో ఆగిపోయాయి. వీటిని ఖరారు చేసుకోవడంతోపాటు గోత బయతో లంకలో పెచ్చుమీరుతున్న ఉగ్రవాదం, దానివల్ల మన దేశానికి ఏర్పడగల ముప్పు వగైరా అంశాలు చర్చించాల్సి ఉంది. దౌత్యసంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అప్పుడప్పుడు అల కలు, అపోహలు తప్పవు. నరేంద్రమోదీ, రాజపక్స శుక్రవారం జరిపే చర్చలు ఇరు దేశాల సంబం ధాల మెరుగుదలకు దోహదపడతాయని ఆశించాలి.
Comments
Please login to add a commentAdd a comment