కొన్ని అధివాస్తవిక దృశ్యాలు స్మృతిపథం నుంచి తొలగిపోవడం కష్టం. మూడు రోజులుగా శ్రీలంక అధ్యక్షభవనం – ప్రధాన మంత్రి నివాసాల ప్రజా దిగ్బంధం, బయటపడ్డ బంకర్లు – నోట్లకట్టలు, ప్రధాని ఆఫీసులో కసి తీరని సామాన్యుల వినోద సంచారం – ఇవన్నీ టీవీల్లో చూసిన ప్రపంచ ప్రజలు వాటిని ఇప్పుడప్పుడే మర్చిపోలేరు. జూలై 9 నుంచి శ్రీలంక వీధుల్లో నిరసనకు దిగిన ప్రజా సమూహ సన్నివేశాలు కొన్నేళ్ళ క్రితం అరబ్ దేశాల్లో వీధికెక్కిన ప్రజాగ్రహ ‘అరబ్ స్ప్రింగ్’ ఉద్యమ దృశ్యాలను తలపించాయి. ఒకరకంగా ద్వీపదేశం ఎదుర్కొంటున్న బాధాకరమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాలకు ఇది పరాకాష్ఠ. జనం నిరసన మధ్య ఆచూకీ లేకుండా పరారైన దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స, వ్యక్తిగత నివాసం జనాగ్రహంలో దగ్ధమైన ప్రధాని రణిల్ విక్రమసింఘే గద్దె దిగుతామంటున్నారు. సమష్టి మధ్యంతర ప్రభుత్వ ప్రయత్నాలు సాగుతున్నాయి.
సరిగ్గా రెండు నెలల క్రితం మే 9న ఇలాగే ప్రజాగ్రహం పెల్లుబికి, హింసాకాండ చెలరేగి, ప్రధానమంత్రి మహిందా రాజపక్స గద్దె దిగి, ప్రాణాలు దక్కించుకున్నారు. ముళ్ళకిరీటం లాంటి ప్రధాని పదవిని రణిల్ చేపట్టారు. తనకున్న పేరుతో సంప్రతింపులు సుగమం అవుతాయనీ, సులభంగా దేశానికి అప్పు పుడుతుందనీ భావించారు. ఇంతలో కరెంట్, పెట్రోల్, ఆహారం సహా అన్నిటికీ కొరతతో సామాన్య జనజీవితం ఇడుముల పాలవడంతో జనంలో అసహనం, కోపం కట్టలు తెంచుకొని, రెండే నెలల్లో మరోసారి వీధికెక్కి అవినీతి గొటబయతో పాటు ఆపద్ధర్మంగా వచ్చిన విక్రమ సింఘేకూ ఇంటిదారి చూపెట్టారు.
లంకలో అంతర్యుద్ధం ముగిశాక, గత మూడు దశాబ్దాలుగా దేశ రాజకీయాలను రాజపక్సీయులే శాసించారు. ఒక దశలో ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏకంగా 40 మంది రాజపక్స కుటుంబ సభ్యులు, బంధువులే. అలా ఆర్థిక వ్యవస్థను గుప్పెట పెట్టుకొని, యథేచ్ఛగా చరించి దేశానికి ఈ గతి పట్టించారు. అన్ని అధికారాలూ అధ్యక్షుడికే కట్టబెట్టే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ పద్ధతి తెచ్చి, రాజపక్స నిరంకుశత్వానికి బాటలు వేశారు.
రాజపక్సీయుల అసమర్థ ఆర్థిక నిర్వహణతో విదేశీ రుణభారం మోయలేనిదైంది. అందులోనూ ఖరీదైన వాణిజ్య రుణం వాటా 2006లో 7 శాతమే ఉండేది. 2019కి అది ఏకంగా 55 శాతమైంది. చైనాపై అతిగా ఆధారపడడం, 2019 నవంబర్‌లో పన్నులు తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యం బయటకు పోకూడదనే లక్ష్యంతో 2021 ఏప్రిల్‌లో ప్రత్యామ్నాయం ఆలోచించకుండా రసాయన ఎరువుల వినియోగంపై నిషేధం లాంటివన్నీ ఆత్మహత్యా సదృశమయ్యాయి. కరోనాతో ఆ దేశ ప్రధాన ఆదాయ వనరైన పర్యాటకం దెబ్బతింటే, తాజా ఉక్రెయిన్ యుద్ధం సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది.
శ్రీలంకలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందంటే, ద్రవ్యోల్బణం 50 శాతానికి చేరింది. రూపాయి విలువ డాలర్‌కు 350 స్థాయికి పడిపోయింది. స్కూళ్ళు, ఆఫీసులు మూతబడ్డాయి. ఆసుపత్రుల్లో మందులు అడుగంటాయి. రెండు నెలల క్రితం సోదరుడు మహిందా వైదొలగాల్సి వచ్చినప్పుడే అధ్యక్షుడు గొటబయ కూడా తప్పుకొని, దేశంలో మార్పుకు దోహదపడాల్సింది. ప్రజాగ్రహం చల్లార్చాల్సింది. అలా కాక కుర్చీ పట్టుకు వేలాడి, పెద్ద తప్పు చేశారు. దీన్ని సరిదిద్దడానికి అందరికీ ఆమోదయోగ్యుడైన, విశ్వసనీయమైన పాలకుడు శ్రీలంకకు అవసరం.
అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్థ పాలన, తాజా ఆర్థిక సంక్షోభంతో సింహళీయుల్లో తలెత్తిన ఆగ్రహం అర్థం చేసుకోదగినదే! కానీ, హింసాకాండ, చట్టసభల ప్రతినిధులను కొట్టి, ఇళ్ళు తగల బెట్టడంతో ప్రయోజనం శూన్యం. శ్రీలంకలో ప్రభుత్వం లేక అరాచకం నెలకొన్నదనే భావన కలిగితే అది ఆ దేశవాసులకే నష్టం. ఆ దేశం పుంజుకొనేందుకు చేయూతనివ్వడానికి సిద్ధపడే పొరుగు దేశాలు, ప్రపంచ సంస్థలు వెనుకంజ వేసే ప్రమాదం ఉంది.
ఆ సంగతి సింహళీయులు గుర్తించాలి. ఇప్పటికిప్పుడు శ్రీలంకకు కావాల్సిందల్లా – ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించే నిఖార్సయిన ప్రభుత్వం. దేశప్రయోజనాలే లక్ష్యంగా... ఇతర దేశాలతో, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) లాంటి వాటితో సంప్రతింపులు జరిపే పాలకులు. సింహళాన్ని మళ్ళీ పట్టాలెక్కించే అంకితభావమున్న అనుభవజ్ఞులు. ఇప్పటికే ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర బ్యాంకు అధిపతి రోజువారీ పని నడిపించే ప్రభుత్వం తక్షణ అవసరమని గుర్తు చేశారు.
తమిళనాడుకు 10 కి.మీల పడవ ప్రయాణం దూరంలోని ఈ 2.2 కోట్ల లంకేయుల ద్వీపదేశంలో స్థిరమైన సర్కారు ఏర్పడడం భౌగోళిక రాజకీయాల దృష్ట్యా భారత్‌కూ కీలకం. జపాన్‌తో కలసి మనం శ్రీలంక పునర్నిర్మాణానికి ‘జీ–20’ వేదికగా క్రియాశీలక పాత్ర పోషించాలి. మరోపక్క సింహళం మళ్ళీ పర్యాటకులను ఆకర్షించాలన్నా, విదేశాల నుంచి ఆర్థిక సాయం, పెట్టుబడులు రావాలన్నా... ముందుగా అక్కడ విశ్వసనీయ ప్రభుత్వం రావాలి. పొదుపు చర్యలు చేపట్టాలి.
ప్రజాకర్షక పథకాలకు బ్రేకులు వేసైనా దేశాన్ని గాడిలో పెట్టాలి. అలా పని చేసే ప్రభుత్వం వస్తేనే, దాన్ని ప్రజలూ పని చేయనిస్తేనే... క్రమంగా ఫలితం కనిపిస్తుంది. లేదంటే మళ్ళీ ఆగ్రహావేశాలు అదుపు తప్పుతాయి. గమ్మత్తేమిటంటే, రోజులు మారాలని కోరుకుంటున్నా, లంక ప్రజలెవరికీ ప్రస్తుత రాజకీయనేతలపై నమ్మకం ఉన్నట్టు లేదు. ఈ విషాదకర పరిణామం రాజకీయ నేతల స్వయంకృతా పరాధం. అవినీతి, నిరంకుశత్వం హెచ్చి, పాలకులు, పాలితుల మధ్య అంతరాలు అగాధమైతే, ఏ వ్యవస్థలోనైనా ఇలాంటివే ఎదురవుతాయి. ఇది ప్రపంచానికి శ్రీలంక చెబుతున్న పాఠం.
Sakshi Editorial On Sri Lanka PM: రోజులు మారాలి!
Published Tue, Jul 12 2022 12:22 AM | Last Updated on Tue, Jul 12 2022 11:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment