రావత్ మేల్కొలుపు!
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరుకున్న వేళ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ గురువారం ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) నిర్వహించిన ఒక సమావేశంలో దిగజారుడు నేతల తీరుపై చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకమైనవి. డబ్బు, అధికారం, మద్యం, మోసపూరిత వాగ్దా నాలు వగైరాలతో ఎలాగైనా గెలిచి అధికార పీఠం అందుకోవాలని తహతహలాడే రాజకీయ పార్టీలూ, నేతలూ ఎక్కువైపోయారని ఘాటుగా విమర్శించడం మాత్రమే కాదు... ఈ బాపతు నేతల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడుతుందని రావత్ హెచ్చరించారు. కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయో అందరికీ తెలుసు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షంతో పోలిస్తే కేవలం స్వల్ప తేడాతో అధికారం అందిపుచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అచిరకాలంలోనే అన్ని విలువలనూ గాలికొదిలి సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించి వైఎస్సార్ కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచిన 21మంది ఎమ్మెల్యేలను అక్కున చేర్చుకున్నారు. అంతకు కొన్నాళ్ల ముందు పొరుగునున్న తెలంగాణలో తమ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన కొందరు ఎమ్మెల్యేల తీరుపైనా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వైఖరిపైనా శివాలెత్తిన చంద్రబాబు తానూ ఆ సరసనే చేరారు. ఫిరాయింపుదారుల్లో ఒకరైన భూమా నాగి రెడ్డి అకాల మరణంతో నంద్యాల స్థానం ఖాళీ అయింది. సెంటిమెంటును చూపి ఎలాగోలా ఆ స్థానం ఏకగ్రీవం అయ్యేలా చూసి ఉప ఎన్నిక బెడదను తప్పించుకుం దామనుకున్న బాబు ఎత్తుగడ వైఎస్సార్ కాంగ్రెస్ ముందు పారలేదు.
ఉప ఎన్నిక తేదీని ప్రకటించడానికి ముందే ఆ నియోజకవర్గంలో బాబు సర్కారు అభివృద్ధి పేరుతో నిధుల్ని వెదజల్లడం మొదలెట్టినప్పుడు నాగిరెడ్డి బావమరిది, మరో ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఒక మాటన్నారు. ఎమ్మెల్యే ఛస్తేనే అభివృద్ధి జరుగుతుందని నంద్యాలలో అందరూ అను కుంటున్నారని చమ త్కరించారు. ఆ సంగతేమోగానీ... ఫిరాయించినవారు ‘హరీ’ మంటే తప్ప బాబు ఉప ఎన్నికలకు ససేమిరా సిద్ధపడరని నంద్యాల రుజువు చేసింది. ఈ తప్పనిసరి ‘తలనొప్పి’ నుంచి క్షేమంగా బయటపడే మార్గం దొరక్క విలవిల్లాడుతున్న బాబుకూ, ఆయన బృందానికీ ఇప్పుడు రావత్ వ్యాఖ్యలు గోరుచుట్టిపై రోకటి పోటులా నిలువెల్లా బాధించి ఉండొచ్చు. ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డికి ఆ పదవిని వదులుకోవాలని షరతు విధించడం ద్వారా నైతిక విలువలపై తన కున్న పట్టింపు ఎలాంటిదో జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించుకున్నారు. మేధావులతో, ప్రజాస్వామికవాదులతో సెబాసనిపించుకున్నారు. అందుకు విరుద్ధంగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలలో శిబిరాలు పెట్టి నానా రకాల జిత్తుల్ని ప్రయో గిస్తున్నారు.
రావత్ వ్యాఖ్యలు వింటే ఆయనకు బాబు సాగిస్తున్న కపటనాటకాలన్నీ పూస గుచ్చినట్టు తెలుసా అన్న సందేహం కలుగుతుంది. ఎమ్మెల్యేలు ఫిరాయించేలా చేసుకోవడం తెలివైన రాజకీయపుటెత్తుగడగా... డబ్బిచ్చి లోబర్చుకోవడం, అధి కారాన్ని ఉపయోగించుకుని వేధించడం వగైరాలన్నీ సృజనాత్మకతగా కీర్తించే స్థితి దాపురించిందన్న ఆయన మాటల్లోని వేదన వర్తమానాన్ని పట్టిచూపుతుంది. గెలి చినవారు అన్నిటికీ అతీతులనీ, ఫిరాయింపుదారు అధికారపక్షంలోకి గెంతడం తప్పు, నేరం కావని అనుకునే ‘కొత్త రాజకీయ నైతికత’ బయల్దేరిందని హెచ్చరిస్తూ దీనికి వ్యతిరేకంగా అన్ని వర్గాలూ ఏకం కావాలని రావత్ ఇచ్చిన పిలుపు ఆలో చింపజేసేది. రాజకీయ పక్షాలూ, నాయకులు, మీడియా, పౌర సమాజ సంస్థలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాస్వామిక వ్యవస్థపై విశ్వాసమున్నవారు సమష్టిగా కృషి చేయాలన్న ఆయన సూచన శిరోధార్యమైనదే. కానీ పరిస్థితులు అలా ఉన్నాయా? చేనుకు చీడ పడితే ఎకరాలకు ఎకరాలు తినేసినట్టు బాబు లాంటి నేతలు ఇప్పటికే సకల వ్యవస్థలనూ భ్రష్టుపట్టించి ఉన్నారు. ఇప్పుడు ఏ రంగం నిష్పాక్షికంగా, నిజాయితీగా, తప్పును తప్పుగా ఎత్తిచూపేలా వ్యవహరిస్తున్నదో తెలుసుకోవడానికి దుర్భిణితో గాలించాల్సిందే. ఎన్నికల్లో అడ్డగోలు వాగ్దానాలు చేస్తుంటే అదేమిటని ప్రశ్నించే అధికారమున్న సంస్థలు లేవు. యధేచ్ఛగా ఫిరాయిం పులకు పాల్పడుతుంటే అటు పార్లమెంటులోనైనా, ఇటు అసెంబ్లీల్లోనైనా స్పీకర్లు మూగనోము పడతారు. తమకేమీ తెలియనట్టు నటిస్తుంటారు. అధికార పక్షాల కీలుబొమ్మలవుతారు. ఫిరాయింపుదార్లతో గవర్నర్ కిక్కుమనకుండా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ దురంతాన్ని అత్యున్నత రాజ్యాంగ అధినేత రాష్ట్ర పతి దృష్టికి తీసుకొచ్చినా ఫలితం ఉండదు. న్యాయస్థానాలు సరేసరి. అవి విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఇన్ని విధాల అంద రికందరూ నిస్సహాయులవుతుంటే... చూస్తూ ఊరుకుంటుంటే డబ్బు, కండబలం, అధికార దుర్వినియోగం, ఫిరాయింపులు వంటి జాడ్యాలు విజృంభించడంలో వింతేముంది?
ఈ ప్రజాస్వామ్య సౌధం బీటలువారకుండా కాపాడగలిగేది చైతన్యవంతులైన పౌరులు మాత్రమే. వారు తల్చుకుంటే సాధించలేనిదంటూ ఉండదు. నైతికతకు నీళ్లొదిలే, ఎంతటి హైన్యానికైనా దిగజారే నేతలకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం మాత్రమే సరిపోదు. తప్పుడు వాగ్దానాలపై, ఫిరాయింపులపై, అధికార దుర్వినియోగంపై నిర్దిష్ట కాల వ్యవధిలో చర్యలు తీసుకునే వ్యవస్థల ఏర్పాటు కోసం, అందుకు అవసరమైన చట్టాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిళ్లు తీసుకు రావాలి. సూత్రబద్ధంగా వ్యవహరించే పార్టీలూ, పౌర సమాజ సంస్థలు, ప్రజా స్వామికవాదులు సమష్టిగా ఉద్యమిస్తే ఇవి సాధించడం అసాధ్యమేమీ కాదు. ఈ కృషి జరగకుంటే సమాజంలో నిర్లిప్తత, నిరాశ అలుముకుంటాయి. ఎన్నికలపై ప్రజల్లో కలిగే ఏవగింపు అంతిమంగా ప్రజాస్వామిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. సకా లంలో పౌరులను అప్రమత్తం చేసినందుకు రావత్ అభినందనీయులు.