Om Prakash Rawat
-
ఎన్నికలకు సర్వం సిద్ధం
-
రాజకీయ నేతలతో ఈసీ బృందం భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ నేతృత్వంలోని బృందం సోమవారం మధ్యాహ్నం రాష్ట్రానికి చేరుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఈసీ బృందం రాష్ట్రంలోని గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీల నాయకులతో హోటల్ తాజ్ క్రిష్ణలో భేటీ అయ్యింది. ఈసీతో సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు నేతలు హాజరుకానున్నట్లు సమాచారం. అంతేకాక ఈసీ ఒక్కో పార్టీ నాయకులతో దాదాపు 10 నిమిషాల పాటు సమావేశం కానున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈసీతో భేటీ నిమిత్తం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు హోటల్ తాజ్ క్రిష్ణకు చేరుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు వీరితో ముఖాముఖి నిర్వహించి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఈసీ బృందంతో భేటికి హాజరైన పార్టీలు - సభ్యులు బీఎస్పీ - సిద్ధార్థ్ పూలే బీజేపీ - ఇంద్రసేనా రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం సీపీఐ - చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు సీపీఎం - నంద్యాల నర్సింహా రెడ్డి, వెంకటేష్ ఎంఐఎం - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ జాఫ్రీ టీఆర్ఎస్ - వినోద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ - మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ టీడీపీ - రావుల చంద్రశేఖర్ రెడ్డి, గురుమూర్తి వైసీపీ - రవికుమార్, సంజీవరావు పార్టీలతో సమావేశం ముగిసిన అనంతరం ఈసీ బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, పోలీసు విభాగం నోడల్ అధికారి, అదనపు డీజీ జితేందర్‌రెడ్డిలతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. రేపటి షెడ్యూల్ మంగళవారం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు,డీఐజీలు, ఐజీలతో సమావేశం మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 7 గంటల వరకు అన్ని జిల్లాల డిఇఓలు, ఎస్పీలతో సమావేశం బుధవారం షెడ్యూల్ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు నోడల్ అధికారులు, ఇంకమ్ టాక్స్ అధికారులు, బ్యాంకు అధికారులు, రైల్వే, ఎయిర్పోర్ట్, సీపీఎఫ్, రాష్ట్ర పోలీస్ అధికారులతో సమావేశం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సీఎస్, డీజీపీ, ఫైనాన్స్ సెక్రటరీ, ఆబ్కారీ ముఖ్య కార్యదర్శి, రవాణా అధికారులతో భేటీ మధ్యాహ్నం 12.30 గంటల నుండి 1.00 వరకు మీడియా సమావేశం అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లనున్న ఈసీ బృందం -
నేడు రాజకీయ పార్టీలతో ఈసీ బృందం ముఖాముఖి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లావస బృందం సోమవారం రాష్ట్రానికి రానుంది. రాష్ట్రంలో మూడురోజులపాటు పర్యటించనుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సోమవారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ముఖాముఖి నిర్వహించి అభిప్రాయాలు సేకరించనుంది. సాయంత్రం 7.30 నుంచి 8.30 గంటల వరకు సీఈవో రజత్ కుమార్, పోలీసు విభాగం నోడల్ అధికారి, అదనపు డీజీ జితేందర్‌రెడ్డిలతో భేటీ అయి ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయ నుంది. మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలు, ఐజీలతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనుంది. 24న ఉదయం 10 నుంచి ఉదయం 11 గంటల వరకు ఆదాయ పన్ను శాఖ డైరెక్టర్ జనరల్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో సమావేశమై ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకోనుంది. ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషితో సమావేశం కానుంది. మధ్యాహ్నం 12.30 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు విలేకరుల సమావేశం నిర్వహించనుంది. ఎన్నికల కమిషనర్ల బృందం సాయంత్రం 4.40 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనుంది. -
డిసెంబర్ 7న ఎన్నికలు.. 11న ఫలితాలు
-
ఎన్నికల జాతర షురూ
న్యూఢిల్లీ: తదుపరి లోక్‌సభ ఎన్నికలకు రిహార్సల్స్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల శాసన సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. మావోయిస్టుల సమస్య కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో, మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఒకే దఫాలో పోలింగ్ జరుగుతుంది. అసెంబ్లీని రద్దుచేసినప్పటి నుంచే తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాక్షికంగా అమల్లోకి రాగా, శనివారం నుంచి 5 రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలుకానుంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 12, 20 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న 18 స్థానాల్లో నవంబర్ 12న, మిగిలిన 72 స్థానాల్లో నవంబర్ 20న పోలింగ్ నిర్వహిస్తారు. 230 సీట్లున్న మధ్యప్రదేశ్, 40 సీట్లున్న మిజోరంలో నవంబర్ 28న, 200 స్థానాలున్న రాజస్తాన్, 119 సీట్లున్న తెలంగాణలో డిసెంబర్ 7న పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11న వెల్లడిస్తారు. ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వచనాసదన్లో జరిగిన మీడియా సమావేశంలో కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్ లావాసాతో కలసి ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. తెలంగాణలో సీఎం కె.చంద్రశేఖర రావు అసెంబ్లీని 9 నెలల ముందే రద్దుచేయగా, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ గడువు జనవరి 5న ముగియనుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి 7న, మిజోరం శాసనసభ గడువు డిసెంబర్ 15న ముగియనున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీకి జనవరి 20 వరకు గడువు ఉంది. 12.30కు బదులుగా 3గంటలకు.. మధ్యాహ్నం 12.30 గంటలకు జరగాల్సిన ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ 3 గంటలకు వాయిదాపడటంపై విమర్శలు వచ్చాయి. రాజస్తాన్‌లో ప్రధాని మోదీ ర్యాలీ ఉన్నందునే ఆలస్యం చేశారని, మోదీ ఒత్తిడికి ఈసీ తలొగ్గిందని ప్రతిపక్షాలు ఆరోపించడంపై రావత్ వివరణ ఇచ్చారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, కొన్ని అధికారిక పనుల వల్లే మీడియా సమావేశం రెండున్నర గంటలు ఆలస్యమైందని చెప్పారు. దీని వల్ల పలానా వర్గానికి అనుచిత లబ్ధి చేకూరిందని భావిస్తే, రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. భాగస్వామ్య పక్షాలను సంతృప్తిపరచి, నిష్పాక్షికంగా, విశ్వసనీయతతో ఎన్నికలు నిర్వహించడం తమ బాధ్యత అని తెలిపారు. తెలంగాణ ఓటర్ల జాబితాపై నెలకొన్న సందిగ్ధత, భారీ వర్షాల ముప్పు నేపథ్యంలో ఉపఎన్నికను వాయిదావేయాలని తమిళనాడు కోరడం వల్లే ప్రెస్‌మీట్ కాస్త ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. ఎన్నికల సంఘం అధికారులు 5 రాష్ట్రాల్లో పర్యటించి, భాగస్వామ్య పక్షాలతో చర్చించారని, అంతా సిద్ధంగా ఉందని నిర్ధారించుకున్నాకే షెడ్యూల్‌ను విడుదలచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు ఓటరు ధ్రువీకరణ రశీదు ఇచ్చే వీవీప్యాట్లను వినియోగిస్తామని చెప్పారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను అవసరమైన మేరకు సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మోదీ ఒత్తిడి వల్లే.. రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో తన ర్యాలీకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ ఆలస్యమయ్యేలా ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతూ ఈసీ ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉందని పేర్కొంది. బీజేపీ సూపర్ ఈసీగా వ్యవహరిస్తోందని మండిపడింది. కోల్‌కతాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ గతేడాది గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ కూడా ఎన్నికల సంఘం ఇలాగే వ్యవహరించిందని ఆరోపించారు. ‘ ఇలాంటి వ్యూహాలు ఫలించవని బీజేపీ, ఈసీ గుర్తుంచుకోవాలి. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీకి ఓటేయొద్దని ఇప్పటికే నిర్ణయించుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ఉప ఎన్నికలు కర్ణాటకలో మూడు లోక్‌సభ స్థానాలకు నవంబర్ 3న ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. షిమోగా, బళ్లారి, మాండ్యా స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ స్థానాల్లోని ఎంపీలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలవడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 5 లోక్‌సభ స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించబోమని ఈసీ స్పష్టం చేసింది. నేర చిట్టా విప్పాల్సిందే సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు సందర్భంగా గత నేరచరిత్రను వెల్లడించాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ వివరాలను సంబంధిత రాజకీయ పార్టీకి తెలియజేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించే అఫివిడవిట్లో డిక్లరేషన్ ఇవ్వాలి. రాజకీయ పార్టీలు ఎవరికైతే టిక్కెట్లు ఇస్తున్నాయో వారి గత నేర చరిత్ర వివరాల్ని పార్టీ వెబ్సైట్లో పొందుపరచాలని, ప్రతికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అఫిడవిట్ పార్ట్–ఏలోని ఫారమ్–26 ద్వారా అభ్యర్థులు తమ ఫోన్ నంబర్, ఈ–మెయిల్, సామాజిక మాధ్యమాల ఖాతాలు, ఆదాయ వనరుల వివరాలు వెల్లడించాలి. ఈ నిబంధనలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. సీ–విజిల్‌తో కోడ్ ఉల్లంఘనలకు చెక్.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సీ–విజిల్ యాప్ ద్వారా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కోడ్ ఉల్లంఘన ఘటనలపై ప్రజలు ఈసీకి ఫిర్యాదుచేయొచ్చు. 5 నిమిషాల నిడివి గల వీడియోలను యాప్ ద్వారా చిత్రీకరించి పంపవచ్చు. ఫోన్లోని పాత వీడియోలను, ఫోటోలను యాప్ స్వీకరించదు. కోడ్ ఉల్లంఘన ఘటనల వీడియోలను ప్రత్యక్షంగా చిత్రీకరించి పంపాలి. వెంటనే ఓ గుర్తింపు నంబర్ వస్తుంది. ఇలా పంపిన వీడియోలు డిస్ట్రిక్ కంట్రోల్ రూంకు చేరుతాయి. అక్కడి నుంచి ఫ్లైయింగ్ స్క్వౌడ్ బృందాలకు చేరవేస్తారు. ఈ బృందాలు జియోగ్రాఫికల్ లోకేషన్ ఆధారంగా ఆ ప్రాంతానికెళ్లి దర్యాప్తుచేస్తారు. దీనిపై ఆ ప్రాంత రిటర్నింగ్ అధికారికి సమాచారమిచ్చి తదుపరి చర్యలు తీసుకుంటారు. గతంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సరైన ఆధారాలు లేకపోవడం, అలాంటి ఘటనలు ఆలస్యంగా వెలుగుచూసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు చేపట్టింది. ఫలితాల కోసం నెలరోజుల నిరీక్షణ.. ఛత్తీస్‌గఢ్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఆ రాష్ట్రంలో రెండు దఫాల్లో ఎన్నికలు నవంబర్ 12న, 20న జరుగుతాయి. ఫలితాల కోసం మాత్రం ప్రజలు డిసెంబర్ 11 వరకు ఎదురుచూడాల్సిందే. పోలింగ్‌ను ఐదు రాష్ట్రాల్లో వేర్వేరు దఫాల్లో నిర్వహిస్తున్నా ఫలితాల్ని ఒకేసారి ప్రకటించాలని ఈసీ నిర్ణయించడమే ఇందుకు కారణం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ రాజకీయ నేతలపై మావోయిస్టుల దాడి జరిగింది. మావోల ప్రాబల్యమున్న 18 స్థానాల్లో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం పోలీసు బలగాలను ఇక్కడ వినియోగించాల్సి వస్తున్నందున రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. -
డిసెంబర్ 7న తెలంగాణ పోరు
సాక్షి, న్యూఢిల్లీ : ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. త్వరలో గడువు ముగుస్తున్న నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణతో పాటు రాజస్తాన్‌లో డిసెంబర్ 7న ఒకే దఫాలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 12, 20న రెండు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, మధ్యప్రదేశ్, మిజోరంలలో నవంబర్ 28న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును డిసెంబర్ 11న చేపడతారు. తెలంగాణలో ఇప్పటికే పాక్షికంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇకనుంచి పూర్తిస్థాయిలో అమలవుతుంది. 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గత నెల 6న రద్దుచేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ రద్దయిన సందర్భంలో ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి. ఈ లెక్కన తెలంగాణలో మార్చి 5, 2019లోపు ఎన్నికలు జరగాల్సి ఉన్నందున నాలుగు రాష్ట్రాలతో పాటే ఇక్కడా ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా ప్రచురించాల్సి ఉండగా.. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో దాన్ని అక్టోబర్ 12 వరకు పొడిగించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. ఓటర్ల తుది జాబితాను ఖరారుచేసే ముందు తమకు చూపాలన్న హైకోర్టు ఈ ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్లో తెలంగాణను చివరగా చేర్చామని, ఓటర్ల జాబితాకు సంబంధించిన అన్ని సమస్యలను ఆలోపు పరిష్కరిస్తామని తెలిపారు. సాంకేతిక సమస్యల వల్లే జాబితా ఆలస్యం.. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ తొలుత తెలంగాణ అంశాన్నే ప్రస్తావించారు. ‘తెలంగాణలో అక్టోబరు 8న ఓటర్ల తుది జాబితా ప్రచురించాల్సి ఉంది. దీనిపై నిన్న సాయంత్రం సీడాక్ డైరెక్టర్ జనరల్‌తో సమావేశమయ్యాం. రెండు రోజుల్లో ఇబ్బందులు పరిష్కరించి అక్టోబరు 8న జాబితాను ప్రచురించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. అయితే ఈరోజు వారు ఒక అంచనాకు వచ్చి.. సమస్య పరిష్కారానికి మరికొంత సమయం పడుతుందని చెప్పారు. ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. తుది జాబితాను ఈనెల 8న హైకోర్టు తనకు చూపాలని ఆదేశించింది. తరువాతే ప్రచురించాలని చెప్పింది. దీంతో తెలంగాణ ఓటర్ల తుది జాబితా ప్రచురణను అక్టోబరు 8 నుంచి అక్టోబరు 12కు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశాం’అని చెప్పారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన సాంకేతిక సమస్య ఏంటని అడగగా ‘ఈఆర్వో నెట్ వెబ్సైట్ కొత్తది. ఓటర్ల నమోదుకు దేశవ్యాప్తంగా ఈ ఒక్క సైటే పనిచేస్తుంది. మనం ఇంగ్లీష్‌లో నమోదు చేసినప్పుడు స్థానిక భాషలో స్వీకరిస్తుంది. కానీ, తెలుగుకు సంబంధించి కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. వాటిని పరిష్కరించడానికి కొంత సమయం పడుతుంది. అందుకే తుది జాబితా ప్రచురణకు తేదీని పొడిగించాం’అని బదులిచ్చారు. తెలంగాణలో ఎన్నికల కమిషన్ పర్యటించకుండానే షెడ్యూల్‌ను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించగా.. ‘మా అధికారుల బృందం తెలంగాణకు వెళ్లింది. ఎస్పీలు, కలెక్టర్లతో సమీక్ష జరిపింది. శుక్రవారం కూడా సీఈవోతో మాట్లాడాం. వారిచ్చిన సమాధానంతో పూర్తి సంతృప్తిచెందాం. మేం మిజోరం కూడా వెళ్లలేదు. ఇప్పుడు వెళతాం’అని వివరణ ఇచ్చారు. తెలంగాణ గ్రామాల్లో పలానా పార్టీకి ఓటేయాలని సామూహిక తీర్మానాలు జరుగుతున్నాయని ప్రస్తావించగా.. అలాంటి విషయాలను పరిశీలిస్తామని తెలిపారు. -
వీవీప్యాట్‌ల్లో చిన్న మార్పులు
న్యూఢిల్లీ: ఓటు ధ్రువీకరణ యంత్రాలు (వీవీప్యాట్) సక్రమంగా పనిచేసేలా వాటికి చిన్న చిన్న మార్పులు చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ చెప్పారు. 10 రాష్ట్రాల్లోని నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది మే 28న ఉప ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే. ఇందుకోసం మొత్తం 10,300 వీవీప్యాట్ యంత్రాలను ఉపయోగించగా దాదాపు 1,150 యంత్రాలు మధ్యలో మొరాయించాయి. దీంతో సాంకేతిక నిపుణులు ఆయా యంత్రాలను పరిశీలించి అవి పనిచేయకపోవడానికి మూల కారణాన్ని గుర్తించారు. కాంట్రాస్ట్ సెన్సర్‌పై నేరుగా కాంతి పడుతుండటం వలన కొన్ని యంత్రాలు పనిచేయలేదనీ, దీనిని నివారించడంకోసం కాంట్రాస్ట్ సెన్సర్లపై చిన్న ముసుగును వినియోగించనున్నట్లు రావత్ వెల్లడించారు. అలాగే గాలిలో తేమ ఎక్కువ కావడం వల్ల ఆ తడికి పేపర్ కాస్త మెత్తబడటంతో మరికొన్ని వీవీప్యాట్ యంత్రాలు ఓటు ధ్రువీకరణ కాగితాన్ని ముద్రించలేకపోయాయని ఆయన వివరించారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఇకపై గాలిలోని తేమకు మెత్తబడకుండా ఉండే కాగి తాన్నే వీవీప్యాట్ యంత్రాల్లో ఉపయోగిస్తా మని తెలిపారు. ఓటర్లు ఈవీఎంలో ఓటు వేయగానే, వారు ఏ పార్టీకి ఓటు వేశారో ఆ పార్టీ గుర్తును ఓ చిన్న కాగితంపై వీవీప్యాట్ యం త్రాలు ముద్రిస్తాయి. ఏడు సెకన్ల పాటు ఈ కా గితం వీవీప్యాట్ యంత్రంపై ఉండి ఆ తర్వాత దానంతట అదే ఓ డబ్బాలోకి పడిపోతుంది. -
ఎమ్మెల్యేలపై వేటు; నూతన సీఈసీ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : రాజకీయంగా పెనుదుమారం రేపిన ‘20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హత’ వ్యవహారంపై నూతన ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) ఓం ప్రకాశ్ రావత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కనీసం మేం చెప్పేది ఆలకించకుండా వేటు వేశార’న్న ఆప్ వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘‘వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ ఇచ్చిన రెండు అవకాశాలను వారు(ఆప్) వినియోగించుకోలేదు’’ అని కుండబద్దలుకొట్టారు. మంగళవారం పదవీబాధ్యతలు చేపట్టనున్న రావత్.. సోమవారం పలు జాతీయ వార్తా సంస్థలతో మాట్లాడారు. రెండు ప్లస్ రెండు నాలుగే : సీఈసీ రావత్ చెప్పినట్లు.. అనర్హత అంశంపై వివరణ కోరుతూ ఈసీ.. 20 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది. 2017 సెప్టెంబర్ 28న మొదటి, నవంబర్2న రెండోసారి నోటీసులు జారీ అయ్యాయి. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈసీ నోటీసులకు బదులివ్వకుండా, ఏకంగా కేసు విచారణనే నిలిపేయాలని కోరింది. సరిగ్గా ఈ సాంకేతిక అంశమే ఈసీ కఠిననిర్ణయానికి దోహదపడింది. ‘‘నోటీసులకు సమాధానం చెప్పకుండా వాళ్లు(ఆప్).. మమ్మల్ని(ఈసీని) నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా వారు రెండు సార్లూ అవకాశాలను వదులుకున్నారు. ముందు మాకు చెప్పాల్సింది చెప్పి, వారు కోరేది అడగొచ్చు. కానీ అలా జరగలేదు. రెండుకు రెండు తోడైతే నాలుగే అవుతుంది కదా! అసలు విచారణే వద్దని వాదించడం సమంజసం కాదు కదా!’ అని సీఈసీ రావత్ వ్యాఖ్యానించారు. అసలేం జరిగింది? బ్రీఫ్‌గా.. : 2015 జనవరిలో బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఆప్.. నిబంధనల ప్రకారం ఏడుగురికి మాత్రమే మంత్రి పదవులిచ్చి, మరో 20 మంది ఎమ్మెల్యేలను మంత్రులకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. అయితే, ఆ నియామకాలు చెల్లబాటుకావంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పడంతో.. ఆరు నెలలు తిరగముందే ఆ 20 మంది అదనపు పదవులు ఊడిపోయాయి. ‘పార్లమెంటరీ కార్యదర్శులను తొలగించరాదం’టూ ఢిల్లీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని సైతం రాష్ట్రపతి కొట్టివేశారు. కాగా, కొంతకాలమే అయినా వారు లాభదాయక పదవులు నిర్వహించారు కాబట్టి ఆ 20 మందిని అనర్హులుగా ప్రకటించాలని యువన్యాయవాది ప్రశాంత్ పటేల్.. నాటి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం రాష్ట్రపతి ఆ ఫిర్యాదును ఈసీకి పంపారు. నాటి సీఈసీ నదీం జైదీ నేతృత్వంలో పూర్తి ప్యానెల్(జైదీతోపాటు ఈసీలు ఏకే జోతి, ప్రకాశ్ రావత్) ఆప్ ఎమ్మెల్యేల కేసును విచారించింది. అయితే, ప్రకాశ్ రావత్ బీజేపీ మనిషని, ఆయన పక్షపాతంతోనే వ్యవహరిస్తారని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. విమర్శల నేపథ్యంలో రావత్.. విచారణ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. జైదీ పదవీ విరమణ తర్వాత జోతి సీఈసీ కావడంతో రెండో స్థానంలో ఉన్న రావత్ మళ్లీ తప్పనిసరిగా కేసు విచారణలో పాల్గొనాల్సివచ్చింది. చివరికి జోతి పదవీవిరమణకు రెండు రోజుల ముందు.. ఈసీ విచారణను ముగించింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ రాష్ట్రపతికి సూచించింది. అలా అనర్హులైన 20 మంది.. సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నారు. జోతి వారసుడిగా రావత్ సీఈసీ పదవిని చేపడతారు. ఆనయ నేతృత్వంలోనే ఖాళీ అయిన ఆ 20 స్థానాలకు 6నెలల్లోపు ఉప ఎన్నికలు జరుగుతాయి. -
నూతన సీఈసీగా ఓం ప్రకాశ్ రావత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. రావత్ ఈ నెల 23న నూతన సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఈసీ అచల్ కుమార్ జ్యోతి పదవీ కాలం రేపటి (సోమవారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఓం ప్రకాశ్ రావత్‌ను సీఈసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పనిచేసిన ఏకే జ్యోతి గతేడాది జూలై 6న బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అశోక్ లావసను ఎన్నికల కమిషనర్ గా నిమమించారు. ఆయన మంగళవారం రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. 1977 ఐఏఎస్ బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన వారు రావత్. 64 ఏళ్ల రావత్ పలు రాష్ట్రాలతో పాటు కేంద్రంలోనూ పలు హోదాల్లో సేవలు అందించారు. భారీ పరిశ్రమలశాఖ సెక్రటరీగా చేసి ఇటీవల రిటైరయ్యారు. 1993లో రక్షణశాఖలో డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన ఆ మరుసటి ఏడాది ఐక్యరాజ్యసమితి ఎన్నికలకు పరిశీలకుడిగా దక్షిణాఫ్రికాకు వెళ్లారు. 2010లో ఆయన ఉత్తమ సేవలకుగానూ ప్రధాన మంత్రి నుంచి అవార్డ్ అందుకున్నారు. -
రావత్ మేల్కొలుపు!
నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరుకున్న వేళ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ గురువారం ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) నిర్వహించిన ఒక సమావేశంలో దిగజారుడు నేతల తీరుపై చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకమైనవి. డబ్బు, అధికారం, మద్యం, మోసపూరిత వాగ్దా నాలు వగైరాలతో ఎలాగైనా గెలిచి అధికార పీఠం అందుకోవాలని తహతహలాడే రాజకీయ పార్టీలూ, నేతలూ ఎక్కువైపోయారని ఘాటుగా విమర్శించడం మాత్రమే కాదు... ఈ బాపతు నేతల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడుతుందని రావత్ హెచ్చరించారు. కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయో అందరికీ తెలుసు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షంతో పోలిస్తే కేవలం స్వల్ప తేడాతో అధికారం అందిపుచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అచిరకాలంలోనే అన్ని విలువలనూ గాలికొదిలి సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించి వైఎస్సార్ కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచిన 21మంది ఎమ్మెల్యేలను అక్కున చేర్చుకున్నారు. అంతకు కొన్నాళ్ల ముందు పొరుగునున్న తెలంగాణలో తమ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన కొందరు ఎమ్మెల్యేల తీరుపైనా, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వైఖరిపైనా శివాలెత్తిన చంద్రబాబు తానూ ఆ సరసనే చేరారు. ఫిరాయింపుదారుల్లో ఒకరైన భూమా నాగి రెడ్డి అకాల మరణంతో నంద్యాల స్థానం ఖాళీ అయింది. సెంటిమెంటును చూపి ఎలాగోలా ఆ స్థానం ఏకగ్రీవం అయ్యేలా చూసి ఉప ఎన్నిక బెడదను తప్పించుకుం దామనుకున్న బాబు ఎత్తుగడ వైఎస్సార్ కాంగ్రెస్ ముందు పారలేదు. ఉప ఎన్నిక తేదీని ప్రకటించడానికి ముందే ఆ నియోజకవర్గంలో బాబు సర్కారు అభివృద్ధి పేరుతో నిధుల్ని వెదజల్లడం మొదలెట్టినప్పుడు నాగిరెడ్డి బావమరిది, మరో ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఒక మాటన్నారు. ఎమ్మెల్యే ఛస్తేనే అభివృద్ధి జరుగుతుందని నంద్యాలలో అందరూ అను కుంటున్నారని చమ త్కరించారు. ఆ సంగతేమోగానీ... ఫిరాయించినవారు ‘హరీ’ మంటే తప్ప బాబు ఉప ఎన్నికలకు ససేమిరా సిద్ధపడరని నంద్యాల రుజువు చేసింది. ఈ తప్పనిసరి ‘తలనొప్పి’ నుంచి క్షేమంగా బయటపడే మార్గం దొరక్క విలవిల్లాడుతున్న బాబుకూ, ఆయన బృందానికీ ఇప్పుడు రావత్ వ్యాఖ్యలు గోరుచుట్టిపై రోకటి పోటులా నిలువెల్లా బాధించి ఉండొచ్చు. ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డికి ఆ పదవిని వదులుకోవాలని షరతు విధించడం ద్వారా నైతిక విలువలపై తన కున్న పట్టింపు ఎలాంటిదో జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారు. మేధావులతో, ప్రజాస్వామికవాదులతో సెబాసనిపించుకున్నారు. అందుకు విరుద్ధంగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలలో శిబిరాలు పెట్టి నానా రకాల జిత్తుల్ని ప్రయో గిస్తున్నారు. రావత్ వ్యాఖ్యలు వింటే ఆయనకు బాబు సాగిస్తున్న కపటనాటకాలన్నీ పూస గుచ్చినట్టు తెలుసా అన్న సందేహం కలుగుతుంది. ఎమ్మెల్యేలు ఫిరాయించేలా చేసుకోవడం తెలివైన రాజకీయపుటెత్తుగడగా... డబ్బిచ్చి లోబర్చుకోవడం, అధి కారాన్ని ఉపయోగించుకుని వేధించడం వగైరాలన్నీ సృజనాత్మకతగా కీర్తించే స్థితి దాపురించిందన్న ఆయన మాటల్లోని వేదన వర్తమానాన్ని పట్టిచూపుతుంది. గెలి చినవారు అన్నిటికీ అతీతులనీ, ఫిరాయింపుదారు అధికారపక్షంలోకి గెంతడం తప్పు, నేరం కావని అనుకునే ‘కొత్త రాజకీయ నైతికత’ బయల్దేరిందని హెచ్చరిస్తూ దీనికి వ్యతిరేకంగా అన్ని వర్గాలూ ఏకం కావాలని రావత్ ఇచ్చిన పిలుపు ఆలో చింపజేసేది. రాజకీయ పక్షాలూ, నాయకులు, మీడియా, పౌర సమాజ సంస్థలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాస్వామిక వ్యవస్థపై విశ్వాసమున్నవారు సమష్టిగా కృషి చేయాలన్న ఆయన సూచన శిరోధార్యమైనదే. కానీ పరిస్థితులు అలా ఉన్నాయా? చేనుకు చీడ పడితే ఎకరాలకు ఎకరాలు తినేసినట్టు బాబు లాంటి నేతలు ఇప్పటికే సకల వ్యవస్థలనూ భ్రష్టుపట్టించి ఉన్నారు. ఇప్పుడు ఏ రంగం నిష్పాక్షికంగా, నిజాయితీగా, తప్పును తప్పుగా ఎత్తిచూపేలా వ్యవహరిస్తున్నదో తెలుసుకోవడానికి దుర్భిణితో గాలించాల్సిందే. ఎన్నికల్లో అడ్డగోలు వాగ్దానాలు చేస్తుంటే అదేమిటని ప్రశ్నించే అధికారమున్న సంస్థలు లేవు. యధేచ్ఛగా ఫిరాయిం పులకు పాల్పడుతుంటే అటు పార్లమెంటులోనైనా, ఇటు అసెంబ్లీల్లోనైనా స్పీకర్లు మూగనోము పడతారు. తమకేమీ తెలియనట్టు నటిస్తుంటారు. అధికార పక్షాల కీలుబొమ్మలవుతారు. ఫిరాయింపుదార్లతో గవర్నర్ కిక్కుమనకుండా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ దురంతాన్ని అత్యున్నత రాజ్యాంగ అధినేత రాష్ట్ర పతి దృష్టికి తీసుకొచ్చినా ఫలితం ఉండదు. న్యాయస్థానాలు సరేసరి. అవి విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. ఇన్ని విధాల అంద రికందరూ నిస్సహాయులవుతుంటే... చూస్తూ ఊరుకుంటుంటే డబ్బు, కండబలం, అధికార దుర్వినియోగం, ఫిరాయింపులు వంటి జాడ్యాలు విజృంభించడంలో వింతేముంది? ఈ ప్రజాస్వామ్య సౌధం బీటలువారకుండా కాపాడగలిగేది చైతన్యవంతులైన పౌరులు మాత్రమే. వారు తల్చుకుంటే సాధించలేనిదంటూ ఉండదు. నైతికతకు నీళ్లొదిలే, ఎంతటి హైన్యానికైనా దిగజారే నేతలకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం మాత్రమే సరిపోదు. తప్పుడు వాగ్దానాలపై, ఫిరాయింపులపై, అధికార దుర్వినియోగంపై నిర్దిష్ట కాల వ్యవధిలో చర్యలు తీసుకునే వ్యవస్థల ఏర్పాటు కోసం, అందుకు అవసరమైన చట్టాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిళ్లు తీసుకు రావాలి. సూత్రబద్ధంగా వ్యవహరించే పార్టీలూ, పౌర సమాజ సంస్థలు, ప్రజా స్వామికవాదులు సమష్టిగా ఉద్యమిస్తే ఇవి సాధించడం అసాధ్యమేమీ కాదు. ఈ కృషి జరగకుంటే సమాజంలో నిర్లిప్తత, నిరాశ అలుముకుంటాయి. ఎన్నికలపై ప్రజల్లో కలిగే ఏవగింపు అంతిమంగా ప్రజాస్వామిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. సకా లంలో పౌరులను అప్రమత్తం చేసినందుకు రావత్ అభినందనీయులు. -
ఎన్నికల కమిషనర్‌గా ప్రకాశ్ రావత్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఖాళీగా ఉన్న ఒక కమిషనర్ పదవి భర్తీ అయింది. ఎన్నికల కమిషనర్‌గా మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఓం ప్రకాశ్ రావత్ గురువారం నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి నియామకం అమల్లోకి వస్తుందని న్యాయశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రావత్ 2018 డిసెంబర్ వరకు పదవిలో ఉంటారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును ప్రకటించనున్న నేపథ్యంలో ఆయన నియామకం జరిగింది. 1953లో జన్మించిన రావత్ 1977 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందినవారు. కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసి గత డిసెంబర్లో రిటైర్ అయ్యారు. ముగ్గురు సభ్యులుండే ఎన్నికల సంఘంలో ప్రస్తుతం నసీం జైదీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా, అచల్ కుమార్ జోతి ఎన్నికల కమిషనర్‌గా ఉండడం తెలిసిందే. -
ఎన్నికల కమిషనర్ గా ఓపీ రావత్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్ గా మధ్యప్రదేశ్ మాజీ ఐఏఎస్ అధికారి ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఆయనను కమిషనర్ గా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పదవీ కాలం అమల్లోకి వస్తుందని కేంద్ర న్యాయశాఖ గురువారం ప్రకటించింది. 2018 చివరివరకు పదవిలో కొనసాగే అవకాశముంది. 1977 బ్యాచ్ కు చెందిన రావల్ గతేడాది డిసెంబర్ లో ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. ఎన్నికల కమిషనర్ పదవి రాజ్యాంగబద్దమైనదని, నిష్పక్షపాతంగా పనిచేస్తానని రావత్ చెప్పారు.