సాక్షి, న్యూఢిల్లీ : ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. త్వరలో గడువు ముగుస్తున్న నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణతో పాటు రాజస్తాన్‌లో డిసెంబర్ 7న ఒకే దఫాలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 12, 20న రెండు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, మధ్యప్రదేశ్, మిజోరంలలో నవంబర్ 28న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును డిసెంబర్ 11న చేపడతారు. తెలంగాణలో ఇప్పటికే పాక్షికంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇకనుంచి పూర్తిస్థాయిలో అమలవుతుంది. 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గత నెల 6న రద్దుచేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ రద్దయిన సందర్భంలో ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి. ఈ లెక్కన తెలంగాణలో మార్చి 5, 2019లోపు ఎన్నికలు జరగాల్సి ఉన్నందున నాలుగు రాష్ట్రాలతో పాటే ఇక్కడా ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా ప్రచురించాల్సి ఉండగా.. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో దాన్ని అక్టోబర్ 12 వరకు పొడిగించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. ఓటర్ల తుది జాబితాను ఖరారుచేసే ముందు తమకు చూపాలన్న హైకోర్టు ఈ ఆదేశాలను పాటిస్తామని చెప్పారు. 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌లో తెలంగాణను చివరగా చేర్చామని, ఓటర్ల జాబితాకు సంబంధించిన అన్ని సమస్యలను ఆలోపు పరిష్కరిస్తామని తెలిపారు.
సాంకేతిక సమస్యల వల్లే జాబితా ఆలస్యం..
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ తొలుత తెలంగాణ అంశాన్నే ప్రస్తావించారు. ‘తెలంగాణలో అక్టోబరు 8న ఓటర్ల తుది జాబితా ప్రచురించాల్సి ఉంది. దీనిపై నిన్న సాయంత్రం సీడాక్ డైరెక్టర్ జనరల్‌తో సమావేశమయ్యాం. రెండు రోజుల్లో ఇబ్బందులు పరిష్కరించి అక్టోబరు 8న జాబితాను ప్రచురించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. అయితే ఈరోజు వారు ఒక అంచనాకు వచ్చి.. సమస్య పరిష్కారానికి మరికొంత సమయం పడుతుందని చెప్పారు. ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. తుది జాబితాను ఈనెల 8న హైకోర్టు తనకు చూపాలని ఆదేశించింది. తరువాతే ప్రచురించాలని చెప్పింది. దీంతో తెలంగాణ ఓటర్ల తుది జాబితా ప్రచురణను అక్టోబరు 8 నుంచి అక్టోబరు 12కు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశాం’అని చెప్పారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన సాంకేతిక సమస్య ఏంటని అడగగా ‘ఈఆర్వో నెట్ వెబ్‌సైట్ కొత్తది. ఓటర్ల నమోదుకు దేశవ్యాప్తంగా ఈ ఒక్క సైటే పనిచేస్తుంది. మనం ఇంగ్లీష్‌లో నమోదు చేసినప్పుడు స్థానిక భాషలో స్వీకరిస్తుంది. కానీ, తెలుగుకు సంబంధించి కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. వాటిని పరిష్కరించడానికి కొంత సమయం పడుతుంది. అందుకే తుది జాబితా ప్రచురణకు తేదీని పొడిగించాం’అని బదులిచ్చారు. తెలంగాణలో ఎన్నికల కమిషన్ పర్యటించకుండానే షెడ్యూల్‌ను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించగా.. ‘మా అధికారుల బృందం తెలంగాణకు వెళ్లింది. ఎస్పీలు, కలెక్టర్లతో సమీక్ష జరిపింది. శుక్రవారం కూడా సీఈవోతో మాట్లాడాం. వారిచ్చిన సమాధానంతో పూర్తి సంతృప్తిచెందాం. మేం మిజోరం కూడా వెళ్లలేదు. ఇప్పుడు వెళతాం’అని వివరణ ఇచ్చారు. తెలంగాణ గ్రామాల్లో పలానా పార్టీకి ఓటేయాలని సామూహిక తీర్మానాలు జరుగుతున్నాయని ప్రస్తావించగా.. అలాంటి విషయాలను పరిశీలిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment