క్లాస్‌రూమ్‌లో పేలిన గ్యాస్ సిలిండర్
-
ప్రమాద సమయంలో వందమందికి పైగా విద్యార్థులు
-
నలుగురికి గాయాలైనట్లు ప్రచారం
-
టీడీపీ నాయకుడి కాలేజీ కావడంతో గోప్యత పాటిస్తున్న వైనం
కావలిరూరల్ : తరగతి గదిలో గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటన పట్టణంలోని జనతాపేటలో ఉన్న శ్రీనివాస జూనియర్ కాలేజీలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. కాలేజీ మూడో అంతస్తులో ఉన్న తరగతి గదిలో వందమందికి పైగా ఇంటర్మీడియట్ విద్యార్థులు కూర్చొని చదువుకుంటున్నారు. ఐదుగంటల ప్రాంతంలో అక్కడే కాలేజీ సిబ్బంది టీ తయారుచేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో గ్యాస్ లీకైనట్లుగా విద్యార్థులు గుర్తించి చూడగా సిలిండర్ వద్ద మంటలు రేగాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ విద్యార్థులు పుస్తకాలు వదిలి కిందకు పరుగులు తీశారు. అంతలోనే పెద్దశబ్దంతో సిలిండర్ పేలింది. గది కిటికీ అద్దాలు తునాతునకలయ్యాయి. పుస్తకాలు కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు చెలరేగకుండా అదుపుచేశారు.
టీడీపీ నాయకుడిది కావడంతో..
కళాశాల పట్టణానికి చెందిన ఓ టీడీపీ నాయకుడిది కావడంతో కొందరు నాయకులు అక్కడకు చేరుకుని ప్రమాద వివరాలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. మీడియా ప్రతినిధులను కళాశాలలోకి పోనివ్వకుండా అడ్డుకున్నారు. కళాశాల సిబ్బందిని మాట్లాడకుండా చేశారు. ప్రమాదం ఎలా జరిగింది? ఎవరైనా గాయపడ్డారా? తదితర వివరాలు బయటకు రాకుండా పట్టణస్థాయి నాయకుడు దగ్గరుండి చూసుకున్నారు. కాగా నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయని వారిని కారులో నెల్లూరు తరలించారని ప్రచారం జరిగింది. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు మరణించారని పుకార్లు వచ్చాయి. అయితే వివరాలను మాత్రం కాలేజీ యాజమాన్యం వెల్లడించడంలేదు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం లేదు.