సంపాదకీయం: ఎప్పటిలాగే చర్చలకు ముందు అధీనరేఖ వద్దా, జమ్మూ-కాశ్మీర్‌లోనూ కొన్ని దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకున్నా న్యూయార్క్ లో భారత-పాకిస్థాన్ అధినేతల సమావేశం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చల సందర్భంగా పాకిస్థాన్ గురించి మన్మోహన్ ఆయనకు ఫిర్యాదుచేశారని వార్తలు వెలువడినా... దాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మన్మోహన్‌ను ‘చాడీలుచెప్పే పల్లెటూరి పడుచు’తో పోల్చారని కాసేపు వదంతులు వచ్చినా ఈ సమావేశం సామరస్యవాతావరణంలోనే జరిగింది. ఆగస్టు నెలలో అధీనరేఖ వద్ద గస్తీ తిరుగుతున్న భారత జవాన్లపై పాకిస్థాన్ సైనికులు దాడిచేసి ఐదుగురిని బలితీసుకున్నారు. ఈ ఘటనను మరిచిపోకముందే సరిగ్గా చర్చలకు మూడురోజుల ముందు పాక్ భూభాగంనుంచి వచ్చిన ఉగ్రవాదులు రెండుచోట్ల దాడిచేసి నలుగురు జవాన్లతోసహా 12 మందిని కాల్చిచంపారు. ఈ ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చలు జరపవద్దని బీజేపీ డిమాండ్‌చేసింది. ఒకపక్క ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మరోపక్క కాల్పులవిరమణను ఉల్లంఘిస్తూ ధూర్తదేశంగా తయారైన పాకిస్థాన్‌తో చర్చలేమిటన్నది ఆ పార్టీ ప్రశ్న. మన పొరుగున ఎవరుండాలో, వారు ఎలా ప్రవర్తించాలో మనం నిర్దేశించలేం.
అయితే, ఆ పొరుగు సరిగా లేనప్పుడు దాన్ని దారికి తీసుకు రావడానికి అన్ని పద్ధతుల్లోనూ ప్రయత్నించకతప్పదు. అలాంటి ప్రయత్నాల్లో చర్చలు కూడా భాగమే. సమస్య తలెత్తుతున్నది గనుక చర్చలు వద్దనడం సరైన తర్కం అనిపించుకోదు. సమస్యలున్నప్పుడే చర్చల అవసరం మరింత పెరుగుతుంది. మన్మోహన్, నవాజ్ షరీఫ్‌ల చర్చలు ఒకరకంగా సానుకూలంగా జరిగినట్టే లెక్క. ఇలాంటి సమావేశాలు ‘ఉపయోగమేన’ని మన దేశం వ్యాఖ్యానించగా, ఈ చర్చలు ‘నిర్మాణాత్మకంగా, అనుకూలవాతావరణంలో’ జరిగాయని పాకిస్థాన్ ప్రకటించింది. అధీనరేఖ వద్ద పాకిస్థాన్ తరచు కాల్పులవిరమణను ఉల్లంఘిస్తుండటం, వారి సైన్యం ఉగ్రవాదులకు అండదండలివ్వడంవంటి అంశాలను మన్మోహన్ షరీఫ్ దృష్టికి తీసుకొచ్చారు.
అధీనరేఖవద్ద కాల్పులవిరమణ కొనసాగించడానికి, శాంతి నెలకొల్పడానికి ఏంచేస్తే బాగుంటుందో నిర్ణయించడానికి త్వరలో ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్‌స డెరైక్టర్ జనరల్‌స (డీజీఎంఓలు) సమావేశం జరగాలని ఈ చర్చల్లో నిర్ణయించారు. ఆ సమావేశం జరిగి, విధివిధానాలు నిర్ణయమై అమల్లోకివస్తే తదుపరి చర్చలకు అవకాశాలు మరింత పెరుగుతాయి. ఇప్పటికిప్పుడు ఈ సమావేశం పర్యవసానంగా ఇరుదేశాధినేతల విస్తృత చర్చలకు అవసరమైన ప్రాతిపదిక ఏర్పడలేదన్నదే మన దేశం అవగాహన. అది నిజమే కూడా. క్షేత్రస్థాయిలో తగినంత సామరస్యత ఏర్పడకుండా చర్చల కోసం చర్చలు... ఇక్కడేదో జరుగుతున్నదని చెప్పుకోవడానికి కలవడమూ వంటివి అర్ధంలేనివి. పాకిస్థాన్‌తో సమస్య ఎక్కడంటే... అక్కడి పౌర ప్రభుత్వం ఇచ్చే హామీలకు ఎలాంటి విలువా ఉండదు. భారత్‌తో సఖ్యతకు అక్కడి ప్రభుత్వం ముందడుగేసినప్పుడల్లా పాక్ సైన్యం దాన్ని వమ్ము చేస్తుంటుంది. మన దేశంతో చర్చలనేసరికి అధీనరేఖ రక్తసిక్తంకావడం, జమ్మూ-కాశ్మీర్‌లో ఏదోచోట ఉగ్రవాదులు చెలరేగి పోవడం ఇందుకే. తన సైన్యాన్ని తప్పుబట్టడం సాధ్యంకాదు గనుక అక్కడి ప్రభుత్వం నీళ్లు నములుతుంటుంది.
వాస్తవానికి పాక్ వైపునుంచి కాల్పుల విరమణ ఉల్లంఘన, ఉగ్రవాద ముఠాలకు ప్రోత్సాహం వంటివి ఆగితే రెండు దేశాలూ పరిష్కరించుకోవాల్సిన సమస్యలు, సహకరించుకోవాల్సిన అంశాలూ చాలా ఉన్నాయి. కాశ్మీర్ సమస్య, సియాచిన్, సర్‌క్రీక్ వివాదాలు, సింధు నదీజలాల ఒప్పందానికి సంబంధించిన అంశాలు, ఇరుదేశాలమధ్యా పెరగవలసిన వ్యాపార, వాణిజ్య సంబంధాలు, సరిహద్దుల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణావంటివి అందులో ముఖ్యమైనవి. ఈ అంశాలన్నిటిలో ఎంతో కొంత ప్రగతి సాధించ… గలిగితే క్రమేపీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. రెండు దేశాలూ ఆర్ధికంగా బలపడటానికి అవి దోహదపడతాయి. కానీ, రెండు దేశాలమధ్యా సుహృద్భావ సంబంధాలు ఏర్పడకుండా పాకిస్థాన్‌లో బలమైన శక్తులు పనిచేస్తున్నాయి. ఈ ధోరణిని నవాజ్ షరీఫ్ ఎంతవరకూ నియంత్రించగలరనే సందేహాలున్నా ఆయన ప్రధాని పదవిని స్వీకరించిన వెంటనే మాట్లాడిన మాటలు అందుకు సంబంధించి కొంత ఆశను కల్పించాయి. తమ గడ్డనుంచి ఇకపై ఉగ్రవాదులకు సహకారం అందబోదని ఆయన ప్రకటించారు.
భారత్‌తో సామరస్యత నెలకొల్పుకుంటే విద్యుత్ కొనుగోలు అవకాశం ఏర్పడుతుందని, అందువల్ల తమ దేశంలో పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని షరీఫ్ భావిస్తున్నారు. 2008లో ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడిలో తమ పౌరుల ప్రమేయాన్ని నిగ్గుతేల్చేందుకు ఒక విచారణ సంఘాన్ని ముంబైకి పంపడం, సాక్ష్యాధారాలను సేకరించడం కూడా ఆయన చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారన్న నమ్మకాన్ని కలిగించింది. అయితే, నవాజ్ షరీఫ్ అధికారంలో ఇంకా కుదురుకోవాల్సే ఉంది. ఆయన అధికారంలోకొచ్చి వందరోజులు దాటుతుండగా ఇంచుమించు ప్రతిరోజూ దేశంలో ఏదో ఒకచోట ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్నాయి. త్వరలో ఖాళీ అవుతున్న సైనిక దళాల ప్రధానాధికారి పదవికి తన విధేయుణ్ణి ఎంపిక చేసుకోగలిగితే వీటిని నియంత్రించడం సులభమవుతుందని, అప్పుడు పాలనపై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం కలుగుతుందని నవాజ్ షరీఫ్ విశ్వసిస్తున్నారు. అది ఎంతవరకూ సాధ్యమవుతుందో ఇంకా చూడాల్సే ఉంది. ఈలోగా పాకిస్థాన్‌తో చర్చించడంద్వారా, అంతర్జాతీయంగా ఆ దేశంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకురావడంద్వారా సరిహద్దుల్లో సామరస్యత ఏర్పడేందుకు మనవైపుగా కృషి జరుగుతూనే ఉండాలి. సమస్యల పరిష్కారానికి ఇంతకు మించిన మార్గంలేదు.
పాక్‌తో మాటా మంతీ!
Published Tue, Oct 1 2013 12:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement