నవాజ్ షరీఫ్ రాయని డైరీ
ఒబామా ముఖం చిట్లిస్తే చూడలేం. చిట్లింపులు, చిటపటలు లేకుండా ఒబామాతో చర్చల్ని ముగించుకొస్తే ఇక్కడ అపోజిషన్ వాళ్ల ముక్కుల్ని ముఖాల్ని చూడలేం. యు.ఎస్. వెళ్లే ముందు సొంతపార్టీవాళ్లు కూడా చెప్పారు.. ఏదైనా సాధించుకు రమ్మని. ఏమిటి సాధించుకు రావడం? సాగనిస్తేనా ఒబామా? ఎకానమీ అంటాడు, ట్రేడ్ అంటాడు. ఎడ్యుకేషన్ అంటాడు, డిఫెన్స్ అంటాడు, హెల్త్ అంటాడు, క్లైమేట్ చేంజ్ అంటాడు. ఇండియా అనగానే టాపిక్ ఛేంజ్ అంటాడు!
ఓవల్ ఆఫీస్‌లో ఒబామాతో కూర్చుని మాట్లాడుతున్నాను. నిజానికి నేను మాట్లాడ్డం లేదు. వింటున్నాను. నా దగ్గర మాట్లాడ్డానికి ఒకే ఒక పాయింట్ ఉంది. ఒబామా దగ్గర ఉన్నది కూడా ఒకటే పాయింట్ కానీ తిప్పి తిప్పి ఆ ఒక్క పాయింటే మాట్లాడుతున్నాడు. నన్ను నా పాయింట్ దగ్గరికి రానివ్వడం లేదు. చేతులు కలుపుకుని, స్నేహపూర్వకంగా సైడ్ బై సైడ్ కూర్చున్నాక మొదలు పెట్టాడు ఒబామా. మనది డెబ్బై ఏళ్ల స్నేహం అన్నాడు. అది మరింత బలోపేతం కావాలి అన్నాడు. ఈ సమావేశం మరిన్ని సమావేశాలకు ప్రేరణ అవ్వాలి అన్నాడు. గంటన్నర గడుస్తున్నా అంటున్నదే అంటున్నాడు. పూలబొకేని రెండు చేతులతో పట్టుకున్నట్లు, నవ్వుని నా ముఖంతో ఎత్తిపట్టుకుని నేనూ వింటున్నదే వింటున్నాను. రెండేళ్ల క్రితం కూడా ఇదే అక్టోబర్‌లో, ఇవే తేదీల్లో అమెరికాలో ఉన్నాను. అప్పుడూ ఇంతే. అమెరికాతో బాగున్న రిలేషన్స్ గురించి తప్ప, ఇండియాతో బాగోలేని రిలేషన్స్ గురించి ఆయన మాట్లాడలేదు!
అమెరికన్ ప్రెసిడెంటుతో కలసి కూర్చున్నంత సేపూ, బయట పాక్ ప్రతిపక్షాలు రహస్యంగా వైట్‌హౌస్ గోడలకు చెవులు ఆన్చి వింటున్నట్టుగా అనిపిస్తుంటుంది నాకు.. ఎప్పుడు అమెరికా వెళ్లినా! ‘ఏమిటి ఆలోచిస్తున్నారు’ అన్నాడు ఒబామా. య్యస్. మాట్లాడే చాన్స్ దొరికింది. నా పాయింట్ నేను చెప్పాలి. పాక్ హిస్టరీలో ఇదో టర్నింగ్ పాయింట్ కావాలి. ‘కశ్మీర్ మీద ఈసారైనా ఓ హామీ తెస్తానని నా దేశ ప్రజలకు మాట ఇచ్చాను మిస్టర్ ప్రెసిడెంట్’ అన్నాను. పెద్దగా నవ్వాడు ఒబామా. ‘వియ్ ఆర్ ఫ్రెండ్స్’ అన్నాడు! ‘మళ్లీ ఎప్పుడు రావడం?’ అన్నాడు. ‘పాకిస్తాన్‌లో పండే మామిడిపండ్లు రుచిగా ఉంటాయట కదా’ అన్నాడు. వెంటనే ఫ్లైట్ ఎక్కి వచ్చేశాను.
అమెరికా నుంచి వచ్చాక ఎందుకనో మోదీజీ పదే పదే గుర్తుకు వస్తున్నారు. పాక్‌లో జరిగే సార్క్ సమావేశాల వరకైనా నా మనసు ఆగలేకపోతోంది. నిరుడు సెప్టెంబర్‌లో ఆయనకు పదిహేను బుట్టల మధురమైన మామిడి పండ్లు కానుకగా పంపించాను. అలా పంపుతూ ఉంటే.. ఏనాటికైనా ఆయన నా కోసం ఒక బుట్ట కశ్మీర్ ఆపిల్స్ పంపించకుండా ఉంటారా?!
- మాధవ్ శింగరాజు