భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) విజయపరంపరలో మరో నూతనాధ్యాయం ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర పెద్దల సమక్షంలో సోమవారం ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంనుంచి పీఎస్‌ఎల్‌వీ సీ23 బహుళ ఉపగ్రహాలతో ఆకాశంలోకి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగమనేసరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శాస్త్రవేత్తల్లో ఎంతో టెన్షన్ ఉంటుంది. కౌంట్ డౌన్ సమయం ముగిసేకొద్దీ ఇది ఇంతకింతా పెరుగుతూ ఉంటుంది. ప్రతి ప్రయోగాన్నీ సవాలుగా తీసుకుని పనిచేసినా మానవ మేథస్సు కందని మరేదైనా లోపం దాగివున్నదేమోనన్న సందేహం పీడిస్తుం టుంది. కానీ, అత్యధిక సందర్భాల్లో జరిగినట్టే ఈసారి కూడా మన శాస్త్రవేత్తలు ఘన విజయాన్ని సొంతం చేసుకోగలిగారు. ఏదైనా కష్టసాధ్యమైన విషయాన్ని చెప్పడానికి, అందులో ఇమిడివుండే సంక్లిష్టతను సూచించడానికి రాకెట్ సైన్స్ పోలిక తెస్తారు. నిజమే...అంతర్గతంగా అనేకానేక వ్యవస్థలు, ఉప వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే తప్ప రాకెట్ నిర్దిష్టమైన వేగంతో దూసుకెళ్లడం, తీసుకెళ్లిన ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ఉంచడం సాధ్యపడదు. ఇక బహుళ ఉపగ్రహాలను ఒకే రాకెట్‌తో ప్రయోగించడం, వాటిని భిన్న కక్ష్యల్లో ప్రవేశపెట్టడమంటే... ఈ సంక్లిష్టత మరిన్ని రెట్లు పెరుగుతుంది. అంచనాల్లో వెంట్రుకవాసి తేడా వచ్చినా వైఫల్యం తప్పదు. ఇది తాడు మీద నడకలాంటిది. సమగ్రమైన లోతైన అవగాహన, ఏకాగ్రత, నిరంతర శ్రమ ఉంటే తప్ప విజయం సులభంగా దక్కదు. కానీ, ఇస్రో శాస్త్రవేత్తలు ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలను మించిపోయారు. ఆ సంగతిని తాజా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం మరోసారి ధ్రువీకరించింది.
మన అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్ర విజ్ఞానంలో ముందడుగేయ డంతోపాటు వాణిజ్యపరంగా కూడా దేశానికి బోలెడు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నది. విదేశీ ఉపగ్రహాలను ఈ గడ్డపైనుంచి ప్రయోగిం చడం 1999లోనే ప్రారంభమైంది. ఒకేసారి రెండు ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలకు చేర్చడంతో మొదలెట్టి నిరుడు ఏడు ఉపగ్రహాలను పంపడమనే అత్యంత కష్టసాధ్యమైన ప్రయోగంలో మన శాస్త్రవేత్తలు సఫలీకృతులయ్యారు. ఈ ప్రయోగాల న్నిటా దేశీయ రాకెట్లనే ఉపయోగించడాన్ని ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ పరిజ్ఞానంతో ఇంతవరకూ 35 విదేశీ ఉపగ్రహాలు నింగికెగయగా సోమవారంనాటి ప్రయోగం ద్వారా వాటికి మరో అయిదు జతయ్యాయి. ఈ ఉపగ్రహాల్లో ఫ్రాన్స్‌కు చెందిన ఉపగ్రహం అధిక బరువుగలది. స్పాట్-7 నామధేయంతో ఉన్న 714 కిలోల ఆ ఉపగ్రహం నిరంతరం భూ ఉపరితల ఛాయా చిత్రాలను తీస్తుంది. కెనడాకు చెందిన కెన్-ఎక్స్4, కెన్-ఎక్స్5 ఉపగ్రహాలు రెండూ పది హేను కిలోల చొప్పున బరువుంటాయి. ఇవి కూడా ఛాయాచిత్రాలను పంపడానికి ఉద్దేశించినవే. జర్మనీకి చెందిన 14 కిలోల ఏఐశాట్, సింగపూర్‌కు చెందిన ఏడు కిలోల వెలాక్స్-1 కూడా ఈ ఉపగ్రహాల వెంట వెళ్లాయి. ఇలా విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షానికి పంపడం ద్వారా ఏటా మనకు దాదాపు 40 కోట్ల రూపాయల రాబడి లభిస్తున్నది. ఇంతటితో ఇస్రో సంతృప్తిచెందడంలేదు. రాగల రెండుమూడేళ్లలో జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా 2,000 కిలోలకుపైగా బరువుండే హెవీ కమ్యూనికేషన్ల ఉపగ్రహాలను ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నది. ఆ విజయం మన దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో సమున్నత స్థానంలో నిలబెట్టగలుగుతుంది.
పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతమైన తర్వాత శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని ప్రత్యేకించి ప్రస్తావించు కోవాలి. ఈ విజయపరంపరను ఆసరా చేసుకుని రాగలకాలంలో సార్క్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాలని ఆయన సూచిం చారు. మనం ఎదగడమే కాకుండా మన ఇరుగుపొరుగు దేశాల అభ్యున్నతికి కూడా తోడ్పడాలన్నది ఆయన సూచనలోని ఆంతర్యం. ఉపగ్రహాలు అందజేసే సమాచారం అపారమైనది. సాగర జలాల ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు సూచించడంవల్ల అతివృష్టి, అనావృష్టివంటివి అంచనావేయడం సాధ్యమవుతుంది. సునామీలను, హిమపాతాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. రైతులకు సాగుకు అనువైన కాలాన్ని సూచించడానికి తోడ్పడుతుంది. భూగర్భంలో ఉండే ఖనిజాల వివరాలను తెలపడంతోపాటు, సముద్ర జలాల్లో మత్స్యరాశి ఏ దిశలో ఎక్కువగా ఉన్నదో ఖచ్చితమైన సమాచారాన్ని ఇచ్చి మత్స్యకారులకు ఉపయోగపడుతుంది. అపారమైన ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించుకోవడంద్వారా భిన్నరంగాల్లో అభివృద్ధి జరిగితే అది ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలను పటిష్టం చేస్తుంది. మన ఇరుగుపొరుగు దేశాలు సాధించే అలాంటి అభివృద్ధి భారత్‌పై అనుకూల ప్రభావాన్ని కలగజేస్తుంది. మన దేశం ఇప్పటికే పాకిస్థాన్, మయన్మార్ వంటి దేశాలకు అవసరమైన సమయాల్లో ఉపగ్రహ సమాచారాన్ని అందిస్తున్నది. ఇప్పుడు మోడీ సూచించిన సార్క్ ఉపగ్రహం అలాంటి సేవల పరిధిని మరింత విస్తృతం చేస్తుంది. అంతరిక్ష విజ్ఞానం ఉన్నతస్థాయి వర్గాలకోసమేనన్న అభిప్రాయాలకు కాలం చెల్లిందన్న మోడీ మాటల్లో నిజముంది. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు అందుబాటులోకొచ్చిన వర్తమాన కాలంలో అన్ని రంగాలూ ఉపగ్రహాలతో పెనవేసుకుపోయాయి. ఈ బంధాన్ని ఎంత విస్తృతం చేస్తే అంతగా ఆయా రంగాలు అభివృద్ధి చెందుతాయి. అమెరికా వంటి అగ్ర రాజ్యాలు విధించిన ఆంక్షలను, అడ్డంకులను పంటిబిగువున భరించి...ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనుకూలంగా మలుచుకుని అంతరిక్ష రంగంలో మనల్ని ప్రబలశక్తిగా నిలిపిన ఘనత ఇస్రో శాస్త్రవేత్తలది. ఇందుకు దేశ ప్రజలంతా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తారు.
జయహో ఇస్రో!
Published Tue, Jul 1 2014 12:47 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement