‘న్యాయం’ బలపడుతుందా?!
Published Sat, Sep 7 2013 12:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఒక కొలిక్కి వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో న్యాయ నియామకాల కమిషన్ (జేఏసీ) ఏర్పాటుకు వీలుకల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు లోక్‌సభలో కూడా మూడింట రెండువంతుల మంది ఆమోదం పొందాక రాష్ట్రాల అసెంబ్లీల ముందుకె ళ్తుంది. వాటిల్లో కనీసం సగం అసెంబ్లీలు బిల్లును ఆమోదిస్తే అటు తర్వాత జేఏసీ విధివిధానాలతో కూడిన మరో బిల్లును పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. చర్చ సందర్భంగా న్యాయవ్యవస్థ పనితీరుపై అధికార పక్షం నుంచీ, విపక్షం నుంచీ వచ్చిన విమర్శలనూ, వ్యాఖ్యలనూ గమనించినా... అటు తర్వాత బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు 131 మంది అనుకూలంగా, ఒకే ఒక్కరు వ్యతిరేకంగా ఓటేయడాన్ని చూసినా న్యాయవ్యవస్థ పనితీరుపై మన రాజకీయ నాయకుల అంతరాంతరాల్లో అసంతృప్తి ఏ స్థాయిలో గూడుకట్టుకుని ఉన్నదో అర్ధమవుతుంది ఆ ఒక్కరూ న్యాయకోవిదుడు రాంజెఠ్మలానీ.
ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమైందని ఆయనంటున్నారు. అయితే, ఏ వ్యవస్థ అయినా విమర్శలకు అతీతమైనది కాదు. న్యాయవ్యవస్థ సైతం అందుకు మినహాయింపు కాదు. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు ఏ విధంగా ఉండాలో రాజ్యాంగంలోని 124, 217 అధికరణాలు స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించి 222వ అధికరణం ఉంది. చర్చ సందర్భంగా మాట్లాడిన కేంద్ర న్యాయమంత్రి కపిల్ సిబల్ 124వ అధికరణానికి 1993లో సుప్రీంకోర్టు కొత్త భాష్యం చెప్పి రాజ్యాంగాన్ని తిరగరాసిందన్నారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో బయటివారి ప్రమేయంలేకుండా చేసిన ఆ తీర్పు న్యాయ, కార్యనిర్వాహక, శాసనవ్యవస్థల మధ్య ఉన్న అధికారాల సమతూకాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు. ఇన్ని మాటలు మాట్లాడిన సిబల్... ఈ రెండు దశాబ్దాలుగా దేశాన్ని ఏలినవారంతా దాన్ని సాధారణ స్థాయికి తీసుకురావడంలో ఎందుకు విఫలమయ్యారన్నది మాత్రం చెప్పలేదు.
చెప్పాలంటే ఈ దేశ ప్రజానీకానికి ఇతర వ్యవస్థలపై ఉన్నంత అసంతృప్తిగానీ, ఆగ్రహంగానీ న్యాయవ్యవస్థపై లేదు. ఏ ఘటన జరిగినా న్యాయవిచారణ జరిపించాలని సాధారణ ప్రజానీకం సైతం డిమాండ్ చేయడం, న్యాయస్థానాల మాటను వేదవాక్కుగా భావించడం ఇంకా పోలేదు. అందుకు కారణం ఆ వ్యవస్థలో పనిచేసి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పిన ఉద్దండులైన న్యాయ కోవిదులేనని వేరే చెప్పనవసరం లేదు. కానీ, ఇతర వ్యవస్థల పరిస్థితి వేరు. అవి తమ కార్యాచరణతో రాను రాను విశ్వసనీయతను దిగజార్చుకున్నాయి. అందువల్లే న్యాయమూర్తుల నియామక ప్రక్రియను ప్రశ్నించే నైతిక స్థైర్యాన్ని ప్రదర్శించలేకపోయాయన్నది నిజం. నిజానికి న్యాయవ్యవస్థలో అవినీతి గురించి అయినా, ఇప్పుడున్న కొలీజియం వ్యవస్థ లోటుపాట్ల గురించి అయినా బయటి వారి కంటే ఎక్కువగా లోపలి వారే మాట్లాడారు. న్యాయపీఠంపై ఉన్న వారిలో 20 శాతం అవినీతి పరులున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వెంకటాచలయ్య ఒక సందర్భంలో అన్నారు. అవినీతికి న్యాయవ్యవస్థ అతీతమని తాను చెప్పడంలేదని ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. సదాశివం పదవీ బాధ్యతలు స్వీకరించేముందు తెలిపారు. అలహాబాద్ హైకోర్టు విషయంలో సుప్రీంకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా ఎలాంటి కటువైన వ్యాఖ్యలు చేసిందో అందరూ చూశారు. ఎందరో న్యాయమూర్తులు దిగజారుతున్న ప్రమాణాలపై అనేక సందర్భాల్లో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు.
న్యాయమూర్తుల నియామకాల విషయంలో విలువలకు పాతరేసింది నిజానికి కార్యనిర్వాహక వ్యవస్థే. జడ్జీల నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని ఏమీ లేదని, తగిన కారణాలు చూపి నిరాకరించవచ్చని 1981లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక పుష్కరకాలం పాటు ‘రాజకీయ నియామకాలు’ జోరందుకున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాటకు విలువే లేకుండాపోయింది. ఈ అరాచకానికి 1993లో జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం అడ్డుకట్టవేసింది. నియామకాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాకే ప్రాముఖ్యతనివ్వాలని, కార్యనిర్వాహక వ్యవస్థకు సమాన ప్రతిపత్తి ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై మరో ఐదేళ్లకు రాష్ట్రపతి నివేదన ద్వారా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పుడు దానికి చుక్కెదురైంది. కొలీజియం వ్యవస్థ మరింత దృఢంగా పాతుకుపోయింది. అయితే, కొలీజియం వ్యవస్థ దుర్వినియోగం అవుతున్నదని తన మరణానికి ముందు జస్టిస్ వర్మ వాపోయారు.
ఏ వ్యవస్థ అయినా లోపరహితంగా పనిచేయాలంటే దానికి జవాబుదారీ తనం, పారదర్శకత చాలా ముఖ్యం. ఆ రెండూ లేకపోబట్టే కొలీజియం వ్యవస్థపై ఇన్ని విమర్శలొచ్చాయి. అయితే, ఇప్పుడు దీన్ని మార్చతలపెట్టిన యూపీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? అనుమానమే. న్యాయ నియామకాల కమిషన్‌లో విపక్ష నేతకు చోటిస్తామని తొలుత చెప్పినా బిల్లులో ఆ మాట లేదు. ఈ కమిషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉన్నా అందులో సభ్యులుగా న్యాయమంత్రి, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉంటారు. న్యాయశాఖ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఏతావాతా కార్యనిర్వాహక వర్గానిదే పైచేయి అవుతుందన్నమాట. అధికారాలనేవి పెత్తనం చేయడానికి కాక ప్రజలకు సేవ చేసేందుకు, ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేసేందుకన్న గ్రహింపు ఉన్నప్పుడే ఏ అమరికైనా విజయవంతమవుతుంది. ఆ సంగతిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంది.
Advertisement
Advertisement