స్వచ్ఛ భారత్‌కు ఇదా తోవ?
జనాన్ని ‘క్రమశిక్షణ’లో పెట్టే భారాన్ని నెత్తినేసుకుని వీధుల్లో వీరంగం వేస్తున్న ప్రైవేటు బృందాలకు ఇప్పుడు సర్కారీ సిబ్బంది కూడా తోడయ్యారు. రాజ స్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో కాలకృత్యాలు తీర్చుకుంటున్న మహిళల ఫొటోలు తీస్తున్నందుకు అభ్యంతరపెట్టిన జాఫర్ ఖాన్ అనే వ్యక్తిని మున్సిపల్ సిబ్బంది కొట్టి చంపారు. తమకు నచ్చని రచన చేశారనో, తమ భావాలకు భిన్నమైనవాటిని కలిగి ఉన్నారనో, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారనో, పశు మాంసాన్ని దగ్గరుంచుకున్నారనో, పశువులను తరలిస్తున్నారనో ఆరోపించి దాడు లకు దిగడం, కొన్నిసార్లు అంతమొందించడంలాంటివి చూశాం.
ఆ పనులకు పాల్పడుతున్నవారిని అదుపులో పెట్టడం ప్రభుత్వాల వల్ల కావడం లేదు. అలాంటి ఉదంతాల్లో కేసులు పెడుతున్నారు. దర్యాప్తులూ నడుస్తున్నాయి. కానీ వారు చాలా తొందరగానే బయటికొచ్చి చట్టాలు తమను ఏమీ చేయలేవని నిరూపిస్తున్నారు. ఆ కేసుల విచారణ ఎప్పటికి పూర్తయి, దోషులకు శిక్ష పడు తుందో ఎవరూ చెప్పలేని స్థితి ఉంటున్నది. ఈలోగా ‘అభ్యంతరకర చర్యల’ జాబితా పెరుగుతూ పోతున్నదన్న అభిప్రాయం కలుగుతోంది. తాజా ఉదం తంలో దారుణమేమంటే సిబ్బంది చేసిన హత్యను రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించడం.
పారిశుద్ధ్య సిబ్బంది తోపాటు అధికారి అయిన నగర పరిషత్ కమిషనర్ అశోక్ జైన్ కూడా ఈ దాడిలో పాల్గొన్నారని మృతుడి సోదరుడు ఆరోపిస్తుంటే సీఎం మాత్రం జరిగిన ఉదం తాన్ని హత్యగా భావించడానికి తగిన ‘శాస్త్రీయ ఆధారం’ లేదని తేల్చి చెప్పారు. దాన్ని ‘దురదృష్టకర మరణం’గా మాత్రమే ప్రస్తావించారు. పోలీసులు ఇంకా దర్యాప్తు పూర్తి చేయకముందే అది హత్య కాదని చెప్పడానికి దొరికిన శాస్త్రీయ ఆధారమేమిటో ఆమె ఇంతవరకూ వెల్లడించలేదు.
ఇంతకూ జాఫర్‌గఢ్ ఉదంతం ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అది సహనం కోల్పోయి కలబడిన ఉదంతం కూడా కాదు. ఆ ఊళ్లో గట్టి పోలీసు బందో బస్తు ఉంది. అలాగని అక్కడెవరూ ఘర్షణపడలేదు. ఉద్రిక్తతలు అంతకన్నా లేవు. తెల్లారాక కాలకృత్యాల కోసం ఎవరూ బయటికి రాకుండా చూడటం కోసమే, అలా వచ్చేవారిని బెదరగొట్టడంకోసమే ఆ బందోబస్తు! ఆ సమయంలో ఊరి చివర మరుగు ప్రదేశంలోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్న మహిళలను ఫొటోలు తీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తే జాఫర్ ఖాన్ అభ్యంతర పెట్టాడు. ఊరినిండా పోలీసులున్నప్పుడు సాధారణ పౌరులైతే అంతటి సాహసం చేయలేక పోయేవారేమో. కానీ జాఫర్ ఖాన్ వామపక్ష సీపీఐ(ఎంఎల్)కు చెందినవాడు. అలా నియదీయడం నేరమైంది.
స్వచ్ఛభారత్‌కు సంబంధించి దేశంలోనే రాజస్థాన్‌కు పేరుంది. అక్కడ ‘పారి శుద్ధ్య విప్లవం’ జరుగుతున్నదని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం ఉంది. ఆ రాష్ట్రంలో ‘సంపూర్ణ పారిశుద్ధ్యం’ పథకాన్ని 1999లో ప్రారం భినప్పుడు శ్రద్ధ తీసుకున్నారు. ఆ తర్వాత 2012లో ప్రారంభించిన నిర్మల్ భారత్ అభియాన్ పథకం కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే అక్కడ మెరుగ్గా అమలైంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంటికొక మరుగుదొడ్డి నిర్మించుకుని అక్కడివారు దేశంలోని పౌరులందరికీ ఆదర్శనీయంగా ఉంటున్నారని చెబుతు న్నారు. ఆ రాష్ట్రంలో 58.26 లక్షల మరుగుదొడ్ల నిర్మించామని ప్రభుత్వ లెక్కలు వివరిస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పటికీ ఆ సమస్య సంపూర్ణంగా పరి ష్కారం కాకపోవడం వెనక ఆ పథకాల అమలులో ఉన్న లోటుపాట్లను గమనించి సరిదిద్దకపోవడమేనన్న అభిప్రాయం ఉంది.
జాఫర్ ఖాన్ ఈ విషయంలో కొంత కాలంగా పోరాడుతున్నాడు. సమస్యంతా మొండికేస్తున్న పౌరుల వల్లనే వస్తున్న దని భావించి పల్లెసీమలకు పోలీసుల్ని తరలించడాన్ని ప్రశ్నించాడు. కాలకృత్యాలు తీర్చుకుంటున్న మహిళలను హేళన చేయడం, బెదిరించడం, ఫొటోలు తీయడం లైంగిక వేధింపులకిందికే వస్తుందని, వారి గౌరవానికి భంగం కలిగించడమే అవు తుందని మున్సిపాలిటీ అధికారులకు ఇచ్చిన వినతిపత్రంలో తెలిపాడు. ఇప్పటికే ఉన్న మరుగుదొడ్లను పనికొచ్చేలా చేసి, కొత్తవాటిని నిర్మిస్తే ఫలితం ఉంటుందని, స్వచ్ఛభారత్ అభియాన్ విజయవంతమవుతుందని సూచించాడు. ఇలాంటి వినతి పత్రాన్నే కలెక్టర్‌కి ఇవ్వబోతే ఆయన తీసుకోవడానికి నిరాకరించారని అక్కడి పౌరులు చెబుతున్నారు.
రెండున్నరేళ్లక్రితం ప్రధాని నరేంద్రమోదీ ‘స్వచ్ఛభారత్ అభియాన్’ పథకాన్ని ప్రారంభించినప్పుడు అందరూ స్వాగతించారు. పౌరుల్లో ప్రతి ఒక్కరూ వారానికి రెండు రోజులు, ఏడాదికి 100 గంటలు పరిశుభ్ర భారత్ కోసం స్వచ్ఛందంగా పనిచేయాలని అంతకు ముందు ఆయన పిలుపునిచ్చారు. దేశంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగానే ఉంది. ప్రపంచంలో 110 కోట్లమందికి మరుగుదొడ్డి సౌకర్యం లేదని ఒక అంచనా. అందులో 60 కోట్లమందికిపైగా జనం మన దేశంలోనే ఉన్నారు. కేవలం పారిశుద్ధ్య లోపాల కారణంగా చనిపోతున్న అయిదేళ్లలోపు పిల్లల్లో చాలామంది మన దేశంలోనే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంటువ్యాధులు విజృంభించడానికి పారిశుద్ధ్య లోపమే ప్రధాన కారణం. ఈ వ్యాధుల తీవ్రత దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోంది.
కనుకనే స్వచ్ఛభారత్ అవసరం ఎంతో ఉంది. అయితే మోదీ కోరుకున్నట్టు మహాత్మా గాంధీ 150వ జయంతి(2019 అక్టోబర్ 2)నాటికి ‘స్వచ్ఛభారత్’ను ఆవిష్కరించి కానుకగా ఇవ్వాలనుకుంటే ఆ పథకాన్ని అమలు చేయాల్సిన తీరు ఇది కాదు. మహిళలు ఏ పరిస్థితుల్లో ఆత్మాభిమానాన్ని చంపుకుని కాలకృత్యాల కోసం బయటికి రావ లసివస్తున్నదో గ్రహిస్తే వారిని ఫొటోలు తీయడం, బెదిరించడంలాంటి చవకబారు ఎత్తుగడలకు దిగరు. పోలీసు బలగాల్ని దించి బెదరగొట్టే పనులకు పూనుకోరు. ప్రైవేటు బృందాల దౌర్జన్యాలను అరికట్టాల్సిన ప్రభుత్వాలు తామే అలాంటి పనులకు దిగజారితే, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఇక పౌరులకు దిక్కేది?