swach bharath
-
‘స్వచ్ఛ దర్పణ్’లో ఆరు తెలంగాణ జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ మూడో దశ సర్వేలో తెలంగాణలోని ఆరు జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. స్వచ్ఛ దర్పణ్ ఫేస్– 3 ర్యాంకింగ్ వివ రాలను కేంద్ర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ శనివారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 700 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. అందులో 8 జిల్లాలకు మొదటి ర్యాంకు దక్కింది. వీటిలో రాష్ట్రంలోని వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలతో పాటు గుజరాత్‌లోని ద్వారక, హరియాణాలోని రేవరీ జిల్లాలకు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు దక్కింది. స్వచ్ఛభారత్ అమలు తీరుపై అంచనాలకోసం కేంద్రం దశల వారీగా సర్వేలు నిర్వహిస్తోంది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే ఫలితాల ఆధారంగా గరిష్టంగా వంద మార్కులు వేస్తారు. పూర్తి స్థాయి మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం, నిర్వహణ, కమ్యూనిటీ సోక్ పిట్స్, కంపోస్టు పిట్స్, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలపై అవగాహన పెంచడం, జియో ట్యాగింగ్ పరిశీలన వంటి అంశాలపై దేశంలోని మొత్తం 700 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించింది. దేశంలోని ఎనిమిది జిల్లాలకు వందకు వంద మార్కులు వచ్చాయి. వీటిలో మన రాష్ట్రంలోని ఆరు జిల్లాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాల సంఖ్య 42,33,614గా ఉంది. 2014 వరకు 11,56,286 కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్డి సౌకర్యం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇప్పుడు వంద శాతం లక్ష్యం పూర్తయ్యింది. పెరిగిన కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా కొత్త మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని కేంద్ర ప్రభుత్వ సర్వేలో నమోదైంది. మిగతా జిల్లాల్లో అంతంతే... ఈ జాతీయ స్థాయి ర్యాంకింగ్‌లలో 6 జిల్లాలు ప్రథమ స్థానంలో నిలవగా, మహబూబ్‌నగర్ 19, వనపర్తి జిల్లా 20 స్థానంతో సరిపెట్టుకున్నాయి. మిగతా జిల్లాల విషయానికొస్తే... ఖమ్మం–65, మేడ్చల్–75, జనగామ–86, గద్వాల–89, మంచిర్యాల–96, మెదక్–105, వరంగల్ రూరల్–108, సిద్దిపేట–143, నాగర్‌కర్నూల్–149, మిగతా జిల్లాలు 168 నుంచి 307 మధ్య ర్యాంకింగ్‌లు సాధించగా భూపాలపల్లి –530తో రాష్ట్రం నుంచి చివరిస్థానంలో నిలిచింది. అందరి కృషితోనే సాధ్యమైంది: ఎర్రబెల్లి ‘స్వచ్ఛదర్పణ్’లో మన రాష్ట్రం మంచి పనితీరు కనబరిచినట్లు కేంద్ర ప్రభుత్వ సర్వేతో స్పష్టమైంది. జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ఎనిమిది జిల్లాలు ఉంటే, వాటిలో తెలంగాణలోని ఆరు జిల్లాలు ఉండడం గర్వకారణం. సీఎం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు వాటి వినియోగంపై అవగాహన కలి్పంచాం. స్వచ్ఛదర్పన్లో తాజా ఫలితాలకోసం పనిచేసిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు , ఎంపీడీవోలు, ఉపాధి హామీ సిబ్బంది, డీఆర్డీఏ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక అభినందనలు’అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. -
అవినీతితో కను‘మరుగు’
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : ఈ లెక్కలు చూస్తే స్వచ్ఛ భారత్ పక్కాగా అమలైందని అనుకుంటారు. కానీ క్షేత్రస్థాయిలో అనేక అక్రమాలు జరిగాయి. అధికారులు రికార్డులపరంగా శతశాతం పూర్తి చేశామని చెబుతున్నా అనేక చోట్ల నిర్మాణాలు చేపట్టకుండా నిధులు మింగేశారు. జిల్లాలో రూ.100 కోట్ల వరకు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. అందుకు.తగ్గట్టుగానే దాదాపు ప్రతి మండలంలో మరుగుదొడ్ల అక్రమాలపై ఫిర్యాదులొచ్చాయి. ♦ రౌతులపూడి మండలంలో రూ. 1.50 కోట్లు మేరకు మరుగుదొడ్లు నిర్మాణాల పేరిట మింగేశారు. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన నేత, ఓ మండల అధికారి కుమ్మక్కై దోచుకున్నారన్న విమర్శలున్నాయి. పరిమాణం ప్రకారం ఒక్కో మరుగుదొడ్డికి రూ. 12వేలు, రూ.15 వేలు, రూ.18 వేల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో సొంతంగా మరుగుదొడ్లను నిర్మించుకోవాలని లబ్ధిదారులు భావించారు. ఇలాగైతే ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణాలు పూర్తికావని అధికార పార్టీ నాయకులు నిధులు మింగేసేందుకు పథక రచన చేశారు. కాంట్రాక్టర్‌తో నిర్మిస్తామని, లేకుంటే మరుగుదొడ్డి మంజూరు కాదని పరోక్షంగా బెదిరించారు. దీంతో లబ్ధిదారులు తప్పని పరిస్థితుల్లో అంగీకరించారు. ఇలా పనులు మొదలు పెట్టి, సగం నిర్మాణం కూడా పూర్తి చేయకుండానే ప్రభుత్వం విడుదల చేసిన నిధులు చాల్లేదని చెబుతూ ఒక్కో లబ్ధిదారుని నుంచి రూ. 3వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేశారు. అయినప్పటికీ నిర్మాణా లు పూర్తి చేయకుండా సగంలో వదిలేశారు. ఇలా రాజవరం, గంగవరం, ఎ.మల్లవరం, పారుపాక, ఎస్.పైడిపాలలో పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిధులు కైంకర్యం చేశారు. ♦ తొండంగి మండలంలో కూడా రూ.2 కోట్ల మేర మరుగుదొడ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయి. నిర్మాణాలు చేపట్టకుండానే, లబ్ధిదారులకు తెలియకుండానే నిధులు డ్రా చేసేశారు. ఒక్క పైడికొండ పంచాయతీ పరిధిలో రూ.70 లక్షల వరకూ అవినీతి జరిగింది. గుత్తేదారు ఆన్లైన్లో నిర్మాణాలు పూర్తయినట్టు చూపించి నిధులు మింగేశారు. తొలుత పైడికొండ పంచాయతీ పరిధిలో ఆనూరులో అక్రమాలు వెలుగు చూడగా, పైడికొండ గ్రామస్తులు కూడా అనుమానంతో జాబితాలు పరిశీలించుకోగా లబ్ధిదారులకు తెలియకుండానే గుత్తేదారులు, అధికారులు కుమ్మక్కై దోచుకున్నట్టు తేలింది. దీనిపై విచారణ జరపగా అవినీతి నిజమని అధికారులు కూడా వెల్లడించారు. చనిపోయిన వారిపై కూడా మరుగుదొడ్లు నిర్మించినట్టు తేలింది. ఆనూరు, పైడికొండ గ్రామాల నుంచి అక్రమాలపై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టగా అవినీతి తేట తెల్లమయ్యింది. ♦ పిఠాపురం మండలం కోనపాపపేటకు చెందిన బెణుగు బంగారమ్మ పేరున 2013లో ఒక వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరు కాగా దానిని ఆమె సొంతఖర్చుతో నిర్మించుకుంది. ఇంతలో (2014లో) బంగారమ్మ చనిపోయింది. కానీ కట్టుకున్న మరుగుదొడ్డికి బిల్లు మాత్రం రాలేదు. ఆమె పేరున రెండు మరుగుదొడ్లు కట్టినట్లు, నిధులు డ్రా చేసినట్టు రికార్డుల్లో చూపించాయి. ఐడీ నంబరు 04047220500400094తో 13–6– 2013న ఒకటి పూర్తయినట్లు, రెండవది 040472205004000901 ఐడీ నంబరుతో 14–11–2013న పూర్తయినట్లు ఒక్కో దానికి రూ 12900 బిల్లులు మంజూరైనట్లు వాటిని డ్రా చేసినట్లు ఆన్లైన్లో ఉండడంతో వారి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. తాము తీసుకోకుండా ఎవరు తీసుకున్నారని ప్రశ్నిస్తే ఎవరూ సమాధానం చెప్పడం లేదని బంగారమ్మ కుమారుడు వాపోతున్నాడు. ♦ కోనపాపపేటకు చెందిన వికలాంగుడు తిత్తి సింహాద్రి, వాసుపల్లి పంపమ్మ తదితరుల ఇంటి దగ్గర మరుగుదొడ్డి నిర్మించకుండానే నిర్మించినట్లు ఆన్లైన్లో చూపించి, వారి తరపున వేరే వ్యక్తులు బిల్లులు డ్రా చేశారని ఫిర్యాదులొచ్చాయి. ♦ కాకినాడలోని దుమ్ములపేట మత్స్యకార ప్రాంతంలో మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మించినట్టు రికార్డుల్లో చూపించి నిధులు కైంకర్యం చేశారు. లబ్ధిదారుల ఖాతాలో పడాల్సిన సొమ్ము ఇతర ఖాతాలకు మళ్లించి దిగమింగేశారు. ఓ ఏఈ, స్థానిక అధికార పార్టీ నేతలు కుమ్మక్కు వ్యవహారాన్ని నడిపారు. విషయం బయటికి పొక్కడంతో పాటు అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్లింది. దీంతో నాటి కమిషనర్ సీరియస్‌గా తీసుకుని హెచ్చరించడంతో సదరు అధికారి, నేతలు సర్ధుకుని ఎవరికివ్వాల్సిన సొమ్మును వారికి ఇచ్చేసి అల్లరి కాకుండా చూసుకున్నారు. ♦ జగ్గంపేట నియోజకవర్గంలో శుక్రవారం వ్యక్తిగత మరుగుదొడ్లపె ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. మిగిలిన నలుగురు మాత్రం నిర్మించిన మరుగుదొడ్ల విషయంలో ఇప్పటి వరకు విచారణ చేపట్టకపోవడమే కాకుండా కనీసం రికవరీ చేయడానికి ఇంత వరకు చర్యలు చేపట్టలేదు. అవినీతి వెలుగు చూడడంతో బాధితులు లబోదిబోమంటూ ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి పలుమార్లు అందోళన చేయడంతో ఎట్టకేలకు విచారణ చేసేందుకు మూడు బృందాలను నియమించారు. మొక్కుబడిగా నాలుగు రోజులు విచారణ నిర్వహించి మధ్యలో విచారణ నిలిపివేశారు. ఈ మొత్తం అవినీతికి ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేసిన అప్పటి కంప్యూటర్ ఆపరేటర్ కఠారి హరి, టెక్నికల్ అసిస్టెంట్ సహకారంతో అధికార పార్టీ నాయకుల అండతో దళారులు భారీ అవినీతికి పాల్పడ్డారని పలువురు ఆరోపిస్తున్నారు. జీపీఎస్ సిస్టమని, జియోట్యాగింగ్ అని, అవినీతే ఉండదన్నారు. తీరా చూస్తే అడుగడుగునా అక్రమాలేనని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ♦ కిర్లంపూడి మండలం జగపతినగరం పంచాయతీ పరిధిలో స్వచ్ఛభారత్ పేరుతో చిల్లంగి, కిర్లంపూడి, జగపతినగరం గ్రామాల పరిధిలో సుమారు 1957 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణంలో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండానే నిధులు పక్కదారికి మళ్లాయి. కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామానికి చెందిన టిడిపి నాయకులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు యడ్ల మురళీ కృష్ణ పేరు మీద ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా 15 మరుగుదొడ్లకు రూ. 1,35,000 ఒకసారి, రూ.90,000 జమయ్యాయి. ఈ గ్రామానికి ఎటువంటి సంబంధం లేని బూరుగుపూడి ఫీల్డ్ అసిస్టెంట్ పాఠంశెట్టి వీరబాబు పేరుమీద పది వ్యక్తిగత మరుగుదొడ్లకు రూ.90,000, ఒకసారి, రూ.60,000 ఒకసారి మొత్తం కలిపి రూ.1,50,000 జమయ్యాయి. గ్రామానికి ఎటువంటి సంబంధం లేని, ఎక్కడో ఐ.ఐ.టి ఫ్యాకల్టీగా పనిచేస్తున్న గుడిమెల్ల శ్రీలక్ష్మి అనే మహిళ పేరుమీద 11 మరుగుదొడ్లకు వివిధ తేదీల్లో రూ.1,65,000 జమయ్యాయి. కిర్లంపూడి గ్రామానికి చెందిన ఎ. దుర్గా పోలారావు పేరుమీద 30 మరుగుదొడ్లకు సంబంధించి 2017మార్చి 20న రూ. 12వేలు, మార్చి 27న రూ.42,000, జూలై 17న రూ. 1,80,000, మళ్లీ మార్చి 27న రూ.36,000, జూలై 10న రూ.24,000, జూలై 3న రూ.1,20,000, జూలై 10న రూ.36,000 జమయ్యాయి. అలాగే మాజీ సర్పంచి పి.నాగశివరామారావు పేరుమీద కొన్ని వ్యక్తిగత మరుగుదొడ్లకు ఎన్జీవోలు పేర్లమీద వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు మంజూరయ్యాయి. ఇవే కాక వందలాది వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులు పంచాయతీ ఖాతాకు జమయినప్పటికీ పలువురు లబ్ధిదారులకు బిల్లులు చేరలేదు. ♦ అయినవిల్లి మండలంలో రూ.80 లక్షలపైనే అవకతవకలు జరిగాయి. వీటిపై పలువురు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని 21 గ్రామాలకుగాను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 1090, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 2090 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి సొమ్ములు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేయాల్సి ఉంది. అయితే అలా కాకుండా పంచాయతీ ఖాతాల్లోను, కాంట్రాక్టర్ ఖాతాల్లో, ఏజెన్సీ ఖాతాల్లోను జమ చేశారు. ఇదే అదనుగా భావించిన అధికార పార్టీ నాయకులు లబ్ధిదారుల ఖాతాల్లో కాకుండా తమకు ఇష్టం వచ్చిన ఖాతాల్లో మరుగుదొడ్ల సొమ్ములు జమ చేశారు. ఇదీ పూర్తిగా అధికారుల నిర్వాకమేనని లబ్ధిదారులు ఆరోపించారు. మరుగుదొడ్లు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఒత్తిడి తేవడంతో వారి ఒత్తిడి తట్టుకోలేక ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసేందుకు అధికార పార్టీ నేతలు చెప్పినట్లుగా వారు చెప్పిన ఖాతాల్లో జమ చేశారు. ఇదే అదునుగా భావించిన క్షేత్ర స్థాయి సిబ్బంది తామేమీ తక్కువ కాదని తమ స్టైల్లో అవకతవకలకు పాల్పడ్డారు. మండలంలోని తొత్తరమూడిలో ఓ క్షేత్రస్థాయి సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో 15 మరుగుదొడ్లకు సంబంధించిన సొమ్ములు జమ చేశారు. కొండుకుదురు, శానపల్లిలంక, నేదునూరు, పొట్టిలంక, మడుపల్లి తదితర గ్రామాల్లోనూ క్షేత్ర స్థాయి సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో మరుగుదొడ్ల సొమ్ములను జమచేసినట్లు తెలుస్తోంది. అక్రమాలపై విచారణ జిల్లాలో ఐదు చోట్ల మరుగుదొడ్ల అక్రమాలపై విచారణలు జరుగుతున్నాయి. విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోంది. కుటుంబాలు పెరగడం కారణంగా కొత్త ప్రతిపాదనలు వస్తున్నాయి. రూ.35 వేల వరకు మరుగుదొడ్లు అవసరమని గుర్తించాం.– సీహెచ్, అప్పారావు, ఇన్ఛార్జ్ ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ -
రైల్వే కోచ్‌లపై స్వచ్ఛభారత్ లోగో
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మహా త్ముడిని స్మరిస్తూ అన్ని రైలు కోచ్‌లపై స్వచ్ఛభారత్ లోగోతో పాటు జాతీయ జెండాను ముద్రించనున్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. దీనికి సంబంధించి ‘స్వచ్ఛతా పక్వారా’పేరుతో సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. దీని కోసం మహాత్మునితో ప్రత్యేక అను బంధం ఉన్న ప్రాంతాల్లోని 43 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. -
స్వర్ణదేవాలయం తరహాలో..
చారిత్రక పాతబస్తీ సరికొత్త అందాలను సంతరించుకోనుంది. మహానగరానికే గుర్తింపు చిహ్నమైన చార్మినార్ పరిసరాలు సర్వాంగ సుందరంగా మారనున్నాయి. చార్మినార్ కట్టడాన్ని ‘స్వచ్ఛ ఐకానిక్’ ప్రదేశంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించేందుకు సీఎస్సార్ కింద ఎన్టీపీసీని ఎంపిక చేసింది. సంవత్సర కాలంలో కట్టడం పరిసరాల్ని అభివృద్ధి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ముసాయిదాను సైతం రూపొందించారు. ఇప్పటి దాకా సీపీపీ కోసం ఖర్చు చేసిన రూ.20 కోట్లతో సహా మరో రూ.104 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. అందులో రూ.25 కోట్ల పనులకు సహకరించాల్సిందిగా ఎన్టీపీసీకి ప్రతిపాదనలు పంపించారు. ఈ పనులన్నీ పూర్తయితే భాగ్యనగర చిహ్నమైన చార్మినార్, దాని పరిసరాలు.. ఇప్పటికే స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశంగా గుర్తింపు పొందిన పంజాబ్‌లోని స్వర్ణదేవాలయం పరిసరాల్లా మారనున్నాయి. ఏం చేస్తారంటే.. ♦ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు 24 గంటలూ స్వీపింగ్ యంత్రాలు ♦ పచ్చదనంతో ఆహ్లాదకర వాతారణం ♦ పరిసర చారిత్రక భవనాలకు విద్యుత్ కాంతులు, మ్యూజియంగా సర్దార్‌మహల్ ♦ పర్యాటకుల కోసం రిసెప్షన్ సెంటర్, స్త్రీ, పురుషులకు ప్రత్యేక టాయ్లెట్లు ♦ పాదచారులు, దివ్యాంగులకు అనువుగా రవాణా సదుపాయం. కాలుష్యం లేకుండా బ్యాటరీ వాహనాలు ♦ చార్మినార్ చుట్టూ బఫర్‌జోన్ ఏర్పాటు.. అందులోకి వాహనాలు రాకుండా చర్యలు ♦ పరిసరాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణం ♦ అన్ని దుకాణాలూ ఒకేరీతిలో.. ♦ వేలాడుతున్న విద్యుత్, టెలిఫోన్, టీవీ కేబుళ్లు భూగర్భంలో ఏర్పాటు సాక్షి, సిటీబ్యూరో: చార్మినార్ స్వచ్ఛ ఐకాన్‌గా ఎంపిక కావడంతో చేపట్టబోయే పనులతో ఆ ప్రాంత పరిసరాలు సర్వాంగ సుందరంగా మారనున్నాయి. దీంతో దాదాపు దశాబ్దకాలంగా సాగుతున్న చార్మినార్ పాదచారుల పథకం(సీపీపీ)పనుల్లో వేంగం పుంజుకోనుంది. చారిత్రకకట్టడం పరిసరాలను 24 గంటలూ పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన స్వీపింగ్ యంత్రాలు సమకూర్చుకుంటారు. పరిసరాల్లో పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారు. రోడ్డు మార్కింగ్‌లు తదితరమైన వాటితో రహదారులకు మెరుగులద్దుతారు. చార్మినార్‌కు నలువైపులా ఉన్న పరిసరాల్లోని చారిత్రక భవనాలను కూడా పునరుద్ధరించి విద్యుత్ వెలుగులతో నింపనున్నారు. సకల సదుపాయాల కల్పన.. అభివృద్ధి పనుల్లో భాగంగా తాగునీరు, సీవరేజీ సమస్యలు లేకుండా, యూజర్ ఫ్రెండ్లీ రవాణా, తదితర సదుపాయాలు కల్పిస్తారు. పర్యాటకుల కోసం రిసెప్షన్ సెంటర్, సైనేజీలు, టాయ్లెట్లు.. ఏర్పాటు చేస్తారు. సీసీకెమెరాల ఏర్పాటుతో పాటు పాదచారులు, దివ్యాంగులకు అనువుగా రవాణా సదుపాయం కల్పిస్తారు. కాలుష్యం లేకుండా బ్యాటరీ వాహనాల్ని ప్రవేశపెడతారు. చార్మినార్ చుట్టూ బఫర్‌జోన్‌ను ఏర్పాటుచేసి అందులోకి వాహనాలు రాకుండా చర్యలు తీసుకుంటారు. చార్మినార్ పరిసరాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సులు సైతం నిర్మిస్తారు. స్వర్ణ దేవాలయం తరహాలో మార్పు.. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి వచ్చిన అధికారులు.. అదే తరహాలో చార్మినార్ పరిసరాల్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అక్కడి మాదిరిగా పాదచారులు సాఫీగా నడిచేందుకు తగిన ఏర్పాట్లతో పాటు గజిబిజి.. వాహన, ధ్వని కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. పరిసరాల్లో పోస్టర్లు, హోర్డింగులు, గాల్లో వేల్లాడే విద్యుత్, టెలిఫోన్ వైర్లు తొలగించనున్నారు. అమృత్‌సర్‌లో చేశారు..? స్వర్ణదేవాలయం సరిసరాల్లో ఇరుకుగా ఉన్న రహదారులను, ఫుట్‌పాత్‌లను విస్తరించారు. గందరగోళంగా ఉన్న విద్యుత్, కేబుల్ వైర్లను తొలగించారు. పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. దుకాణాలపై ఉన్న పెద్దపెద్ద బోర్డులను, రోడ్డువైపున్న పెద్ద హోర్డింగుల్ని తీసేశారు. రోడ్లపై రద్దీతో ఉండే మార్కెట్లను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఆలయానికి చుట్టూ వీధుల్ని ఆధునీకరించారు. వీధుల్లోని షాçపులన్నింటి ముందు భాగం ఒకే తీరుగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా అధికారులతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. పాత నిర్మాణాలు దెబ్బతినకుండా అందంగా తీర్చిదిద్దారు. అమృత్సర్ దేవాలయానికీ, చార్మినార్‌కు పలు అంశాల్లో సామీప్యత ఉండటంతో ఇక్కడా ఆ తరహాలోనే అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇక్కడేం చేయవచ్చు.. చార్మినార్ వద్దగల వీధి వ్యాపారులను దాదాపు కిలోమీటర్ మేర తరలించేందుకు సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ముందుగా రాజకీయ నేతలతో సంప్రదించి, వారి ద్వారా వ్యాపారులకు తగిన అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. అక్కడి మాదిరిగా కేబుళ్లు , విద్యుత్ వైర్లు పైకి కనిపించకుండా భూగర్భంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్వర్ణ దేవాలయానికి సమీపంలోని టౌన్హాల్లో ఒక మ్యూజియాన్ని ఏర్పాటుచేసి అందులో చరిత్రకు సంబంధించిన వివిధ కళాఖండాలు, ఫొటోలు, దస్త్రాలు భద్రపరిచారు. చార్మినార్‌కు సమీపంలోని సర్దార్‌మహల్‌ను పునరుద్ధరించి అందులో హైదరాబాద్ చరిత్ర, విశేషాలు తెలిపే మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. చార్మినార్‌కు నాలుగుదిక్కులా ఉన్న కమాన్లను అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే మచిలీకమాన్ పనులు పురోగతిలో ఉన్నాయి. అభివృద్ధి పనులపై అధికారుల సమావేశం.. చార్మినార్ వద్ద ఏయే పనులు చేయాలనే అంశంపై చర్చించేందుకు గురువారం మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ అధ్యక్షతన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్ కోసం రెండు కాంప్లెక్సులు నిర్మించేందుకు ఆస్కి సహకారంతో టెండర్లు ఆహ్వానించాలని సూచించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద, ఖిల్వత్ వద్ద వీటిని నిర్మించనున్నారు. ఖిల్వత్ వద్ద కూల్చేసిన పెన్షన్ ఆఫీసు డెబ్రిస్‌ను వెంటనే తొలగించాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద సైతం స్థలాన్ని ఖాళీ చేసి పార్కింగ్‌కు అనువుగా మార్చనున్నారు. విద్యుత్ వైర్లు డక్ట్‌లో ఏర్పాటు చేయాలని, పోల్స్ అధునాతనమైనవి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలన్నింటి ముందు భాగం ఒకేలా ఉండేందుకు తొలుత లాడ్బజార్వైపు ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు తగిన డిజైన్ రూపొందించాల్సిందిగా సూచించారు. -
స్వచ్ఛ భారత్‌కు ఇదా తోవ?
జనాన్ని ‘క్రమశిక్షణ’లో పెట్టే భారాన్ని నెత్తినేసుకుని వీధుల్లో వీరంగం వేస్తున్న ప్రైవేటు బృందాలకు ఇప్పుడు సర్కారీ సిబ్బంది కూడా తోడయ్యారు. రాజ స్థాన్లోని ప్రతాప్‌గఢ్‌లో కాలకృత్యాలు తీర్చుకుంటున్న మహిళల ఫొటోలు తీస్తున్నందుకు అభ్యంతరపెట్టిన జాఫర్ ఖాన్ అనే వ్యక్తిని మున్సిపల్ సిబ్బంది కొట్టి చంపారు. తమకు నచ్చని రచన చేశారనో, తమ భావాలకు భిన్నమైనవాటిని కలిగి ఉన్నారనో, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారనో, పశు మాంసాన్ని దగ్గరుంచుకున్నారనో, పశువులను తరలిస్తున్నారనో ఆరోపించి దాడు లకు దిగడం, కొన్నిసార్లు అంతమొందించడంలాంటివి చూశాం. ఆ పనులకు పాల్పడుతున్నవారిని అదుపులో పెట్టడం ప్రభుత్వాల వల్ల కావడం లేదు. అలాంటి ఉదంతాల్లో కేసులు పెడుతున్నారు. దర్యాప్తులూ నడుస్తున్నాయి. కానీ వారు చాలా తొందరగానే బయటికొచ్చి చట్టాలు తమను ఏమీ చేయలేవని నిరూపిస్తున్నారు. ఆ కేసుల విచారణ ఎప్పటికి పూర్తయి, దోషులకు శిక్ష పడు తుందో ఎవరూ చెప్పలేని స్థితి ఉంటున్నది. ఈలోగా ‘అభ్యంతరకర చర్యల’ జాబితా పెరుగుతూ పోతున్నదన్న అభిప్రాయం కలుగుతోంది. తాజా ఉదం తంలో దారుణమేమంటే సిబ్బంది చేసిన హత్యను రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే తక్కువ చేసి చూపడానికి ప్రయత్నించడం. పారిశుద్ధ్య సిబ్బంది తోపాటు అధికారి అయిన నగర పరిషత్ కమిషనర్ అశోక్ జైన్ కూడా ఈ దాడిలో పాల్గొన్నారని మృతుడి సోదరుడు ఆరోపిస్తుంటే సీఎం మాత్రం జరిగిన ఉదం తాన్ని హత్యగా భావించడానికి తగిన ‘శాస్త్రీయ ఆధారం’ లేదని తేల్చి చెప్పారు. దాన్ని ‘దురదృష్టకర మరణం’గా మాత్రమే ప్రస్తావించారు. పోలీసులు ఇంకా దర్యాప్తు పూర్తి చేయకముందే అది హత్య కాదని చెప్పడానికి దొరికిన శాస్త్రీయ ఆధారమేమిటో ఆమె ఇంతవరకూ వెల్లడించలేదు. ఇంతకూ జాఫర్‌గఢ్ ఉదంతం ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అది సహనం కోల్పోయి కలబడిన ఉదంతం కూడా కాదు. ఆ ఊళ్లో గట్టి పోలీసు బందో బస్తు ఉంది. అలాగని అక్కడెవరూ ఘర్షణపడలేదు. ఉద్రిక్తతలు అంతకన్నా లేవు. తెల్లారాక కాలకృత్యాల కోసం ఎవరూ బయటికి రాకుండా చూడటం కోసమే, అలా వచ్చేవారిని బెదరగొట్టడంకోసమే ఆ బందోబస్తు! ఆ సమయంలో ఊరి చివర మరుగు ప్రదేశంలోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటున్న మహిళలను ఫొటోలు తీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తే జాఫర్ ఖాన్ అభ్యంతర పెట్టాడు. ఊరినిండా పోలీసులున్నప్పుడు సాధారణ పౌరులైతే అంతటి సాహసం చేయలేక పోయేవారేమో. కానీ జాఫర్ ఖాన్ వామపక్ష సీపీఐ(ఎంఎల్)కు చెందినవాడు. అలా నియదీయడం నేరమైంది. స్వచ్ఛభారత్‌కు సంబంధించి దేశంలోనే రాజస్థాన్‌కు పేరుంది. అక్కడ ‘పారి శుద్ధ్య విప్లవం’ జరుగుతున్నదని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం ఉంది. ఆ రాష్ట్రంలో ‘సంపూర్ణ పారిశుద్ధ్యం’ పథకాన్ని 1999లో ప్రారం భినప్పుడు శ్రద్ధ తీసుకున్నారు. ఆ తర్వాత 2012లో ప్రారంభించిన నిర్మల్ భారత్ అభియాన్ పథకం కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే అక్కడ మెరుగ్గా అమలైంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంటికొక మరుగుదొడ్డి నిర్మించుకుని అక్కడివారు దేశంలోని పౌరులందరికీ ఆదర్శనీయంగా ఉంటున్నారని చెబుతు న్నారు. ఆ రాష్ట్రంలో 58.26 లక్షల మరుగుదొడ్ల నిర్మించామని ప్రభుత్వ లెక్కలు వివరిస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పటికీ ఆ సమస్య సంపూర్ణంగా పరి ష్కారం కాకపోవడం వెనక ఆ పథకాల అమలులో ఉన్న లోటుపాట్లను గమనించి సరిదిద్దకపోవడమేనన్న అభిప్రాయం ఉంది. జాఫర్ ఖాన్ ఈ విషయంలో కొంత కాలంగా పోరాడుతున్నాడు. సమస్యంతా మొండికేస్తున్న పౌరుల వల్లనే వస్తున్న దని భావించి పల్లెసీమలకు పోలీసుల్ని తరలించడాన్ని ప్రశ్నించాడు. కాలకృత్యాలు తీర్చుకుంటున్న మహిళలను హేళన చేయడం, బెదిరించడం, ఫొటోలు తీయడం లైంగిక వేధింపులకిందికే వస్తుందని, వారి గౌరవానికి భంగం కలిగించడమే అవు తుందని మున్సిపాలిటీ అధికారులకు ఇచ్చిన వినతిపత్రంలో తెలిపాడు. ఇప్పటికే ఉన్న మరుగుదొడ్లను పనికొచ్చేలా చేసి, కొత్తవాటిని నిర్మిస్తే ఫలితం ఉంటుందని, స్వచ్ఛభారత్ అభియాన్ విజయవంతమవుతుందని సూచించాడు. ఇలాంటి వినతి పత్రాన్నే కలెక్టర్‌కి ఇవ్వబోతే ఆయన తీసుకోవడానికి నిరాకరించారని అక్కడి పౌరులు చెబుతున్నారు. రెండున్నరేళ్లక్రితం ప్రధాని నరేంద్రమోదీ ‘స్వచ్ఛభారత్ అభియాన్’ పథకాన్ని ప్రారంభించినప్పుడు అందరూ స్వాగతించారు. పౌరుల్లో ప్రతి ఒక్కరూ వారానికి రెండు రోజులు, ఏడాదికి 100 గంటలు పరిశుభ్ర భారత్ కోసం స్వచ్ఛందంగా పనిచేయాలని అంతకు ముందు ఆయన పిలుపునిచ్చారు. దేశంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగానే ఉంది. ప్రపంచంలో 110 కోట్లమందికి మరుగుదొడ్డి సౌకర్యం లేదని ఒక అంచనా. అందులో 60 కోట్లమందికిపైగా జనం మన దేశంలోనే ఉన్నారు. కేవలం పారిశుద్ధ్య లోపాల కారణంగా చనిపోతున్న అయిదేళ్లలోపు పిల్లల్లో చాలామంది మన దేశంలోనే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంటువ్యాధులు విజృంభించడానికి పారిశుద్ధ్య లోపమే ప్రధాన కారణం. ఈ వ్యాధుల తీవ్రత దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోంది. కనుకనే స్వచ్ఛభారత్ అవసరం ఎంతో ఉంది. అయితే మోదీ కోరుకున్నట్టు మహాత్మా గాంధీ 150వ జయంతి(2019 అక్టోబర్ 2)నాటికి ‘స్వచ్ఛభారత్’ను ఆవిష్కరించి కానుకగా ఇవ్వాలనుకుంటే ఆ పథకాన్ని అమలు చేయాల్సిన తీరు ఇది కాదు. మహిళలు ఏ పరిస్థితుల్లో ఆత్మాభిమానాన్ని చంపుకుని కాలకృత్యాల కోసం బయటికి రావ లసివస్తున్నదో గ్రహిస్తే వారిని ఫొటోలు తీయడం, బెదిరించడంలాంటి చవకబారు ఎత్తుగడలకు దిగరు. పోలీసు బలగాల్ని దించి బెదరగొట్టే పనులకు పూనుకోరు. ప్రైవేటు బృందాల దౌర్జన్యాలను అరికట్టాల్సిన ప్రభుత్వాలు తామే అలాంటి పనులకు దిగజారితే, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఇక పౌరులకు దిక్కేది? -
'ఈ దేశంలో పుట్టినందుకు గర్వించండి'
నెల్లూరు: భారత దేశంలో పుట్టినందుకు మనమంతా గర్వించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచమంతా భారత దేశం వైపు చూస్తోందని చెప్పారు. ఇండోనేషియా కరెన్సీపై గణేశుడి బొమ్మ ఉంటుందని, దీపావళి రోజున మలేసియా ఎయిర్ పోర్ట్ అంతా దీపాలు వెలిగించారని చెప్పారు. ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కు పిలుపునిచ్చారని అయితే, తన మన, ధన పరంగా స్వచ్ఛంగా ఉంటేనే ముందకెళతామని వెంకయ్య చెప్పారు. -
జిల్లాలో ఆదోని మున్సిపాలిటీ బెస్ట్
– ఎమ్మిగనూరు అధ్వానం – కేంద్రకమిటీ ప్రత్యేక బృందం సభ్యుల వెల్లడి ఆదోని టౌన్ : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆదోని మున్సిపాలిటీ బాగుందని స్వచ్ఛ భారత్ మిషన్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇన్స్పెక్షన్ కేంద్ర కమిటీ సభ్యుడు విజయ్ తెలిపారు. సామూహిక, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్వహణపై కొన్ని మార్పులు, చేర్పులు జరిగినట్లయితే ఆదోని పరిశుభ్రతలో మంచిఫలితాలు సాధించవచ్చని చెప్పారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర కమిటీ ప్రత్యేక బృందం శుక్రవారం ఆదోనిలో పర్యటించింది. అనంతరం కమిటీ సభ్యుడు విజయ్ విలేకరులతో మాట్లాడారు. భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ఆరుబయట మలమూత్ర విసర్జన లేకుండా చేయడమే స్వచ్ఛభారత్ లక్ష్యమన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నంద్యాల, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, కర్నూలు, ఆదోని మున్సిపాలిటీలలో పర్యటించామని చెప్పారు. శనివారం డోన్‌లో పర్యటించనున్నట్లు చెప్పారు. అయితే అన్ని మున్సిపాలిటీల కన్న ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ఆరుబయట మలమూత్ర విసర్జన ఎక్కువగా ఉందని, శానిటేషన్ సైతం అధ్వానంగా ఉందని చెప్పారు. ఆదోని పట్టణంలో 9ప్రాంతాల్లో పర్యటించామని, అందులో కొన్ని ప్రాంతాల్లో ఆరుబయట మలవిసర్జన ప్రాంతాలు ఉన్నాయని అయితే వాటిని బాగు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
ఈ–లెర్నింగ్‌లో జీహెచ్ఎంసీ టాప్
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ భారత్ ఆశయాలపై కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ–లెర్నింగ్ పోర్టల్‌ను జీహెచ్ఎంసీకి చెందిన అధికారులు, సిబ్బంది ఇతర నగరాలకంటే అత్యధికంగా వినియోగించుకుని టాప్‌లో నిలిచినట్టు జీహెచ్ఎంసీ ఓ ప్రకట నలో తెలిపింది. స్వచ్ఛభారత్ మిషన్ లక్ష్యాలు, పారిశుధ్యం తదితర కార్యక్రమాలకు సంబంధించి మున్సిపల్ అధికారులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేం దుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. జీహెచ్ఎంసీకి చెందిన 4,323 మంది ఇందులో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ లెర్నింగ్ శిక్షణ పొం దారు. వీరిలో 2,889 మంది విజయవంతంగా కోర్సును పూర్తిచేయడంతో సర్టిఫికెట్లు కూడా అందుకున్నట్టు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో ఎక్కువ మందితో కోర్సును పూర్తిచేయించిన వారిలో ఏఎంఓహెచ్ డాక్టర్ మైత్రేయి, వర్క్ ఇన్స్పెక్టర్ గజేందర్‌బాబు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్టు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ హైదరాబాద్‌సిటీ సపోర్టింగ్ యూనిట్ విశేషంగా కృషి చేస్తుండటంపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.