చారిత్రక పాతబస్తీ సరికొత్త అందాలను సంతరించుకోనుంది. మహానగరానికే గుర్తింపు చిహ్నమైన చార్మినార్ పరిసరాలు సర్వాంగ సుందరంగా మారనున్నాయి. చార్మినార్ కట్టడాన్ని ‘స్వచ్ఛ ఐకానిక్’ ప్రదేశంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించేందుకు సీఎస్సార్ కింద ఎన్టీపీసీని ఎంపిక చేసింది. సంవత్సర కాలంలో కట్టడం పరిసరాల్ని అభివృద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ముసాయిదాను సైతం రూపొందించారు. ఇప్పటి దాకా సీపీపీ కోసం ఖర్చు చేసిన రూ.20 కోట్లతో సహా మరో రూ.104 కోట్లు ఖర్చు కాగలవని అంచనా వేశారు. అందులో రూ.25 కోట్ల పనులకు సహకరించాల్సిందిగా ఎన్టీపీసీకి ప్రతిపాదనలు పంపించారు. ఈ పనులన్నీ పూర్తయితే భాగ్యనగర చిహ్నమైన చార్మినార్, దాని పరిసరాలు.. ఇప్పటికే స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశంగా గుర్తింపు పొందిన పంజాబ్‌లోని స్వర్ణదేవాలయం పరిసరాల్లా మారనున్నాయి.
ఏం చేస్తారంటే..
♦ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు 24 గంటలూ స్వీపింగ్ యంత్రాలు
♦ పచ్చదనంతో ఆహ్లాదకర వాతారణం
♦ పరిసర చారిత్రక భవనాలకు విద్యుత్ కాంతులు, మ్యూజియంగా సర్దార్‌మహల్
♦ పర్యాటకుల కోసం రిసెప్షన్ సెంటర్, స్త్రీ, పురుషులకు ప్రత్యేక టాయ్‌లెట్లు
♦ పాదచారులు, దివ్యాంగులకు అనువుగా రవాణా సదుపాయం. కాలుష్యం లేకుండా బ్యాటరీ వాహనాలు
♦ చార్మినార్ చుట్టూ బఫర్‌జోన్ ఏర్పాటు.. అందులోకి వాహనాలు రాకుండా చర్యలు
♦ పరిసరాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణం
♦ అన్ని దుకాణాలూ ఒకేరీతిలో..
♦ వేలాడుతున్న విద్యుత్, టెలిఫోన్, టీవీ కేబుళ్లు భూగర్భంలో ఏర్పాటు
సాక్షి, సిటీబ్యూరో: చార్మినార్ స్వచ్ఛ ఐకాన్‌గా ఎంపిక కావడంతో చేపట్టబోయే పనులతో ఆ ప్రాంత పరిసరాలు సర్వాంగ సుందరంగా మారనున్నాయి. దీంతో దాదాపు దశాబ్దకాలంగా సాగుతున్న చార్మినార్ పాదచారుల పథకం(సీపీపీ)పనుల్లో వేంగం పుంజుకోనుంది. చారిత్రకకట్టడం పరిసరాలను 24 గంటలూ పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన స్వీపింగ్ యంత్రాలు సమకూర్చుకుంటారు. పరిసరాల్లో పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారు. రోడ్డు మార్కింగ్‌లు తదితరమైన వాటితో రహదారులకు మెరుగులద్దుతారు. చార్మినార్‌కు నలువైపులా ఉన్న పరిసరాల్లోని చారిత్రక భవనాలను కూడా పునరుద్ధరించి విద్యుత్ వెలుగులతో నింపనున్నారు.
సకల సదుపాయాల కల్పన..
అభివృద్ధి పనుల్లో భాగంగా తాగునీరు, సీవరేజీ సమస్యలు లేకుండా, యూజర్ ఫ్రెండ్లీ రవాణా, తదితర సదుపాయాలు కల్పిస్తారు. పర్యాటకుల కోసం రిసెప్షన్ సెంటర్, సైనేజీలు, టాయ్‌లెట్లు.. ఏర్పాటు చేస్తారు. సీసీకెమెరాల ఏర్పాటుతో పాటు పాదచారులు, దివ్యాంగులకు అనువుగా రవాణా సదుపాయం కల్పిస్తారు. కాలుష్యం లేకుండా బ్యాటరీ వాహనాల్ని ప్రవేశపెడతారు. చార్మినార్ చుట్టూ బఫర్‌జోన్‌ను ఏర్పాటుచేసి అందులోకి వాహనాలు రాకుండా చర్యలు తీసుకుంటారు. చార్మినార్ పరిసరాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సులు సైతం నిర్మిస్తారు.
స్వర్ణ దేవాలయం తరహాలో మార్పు..
మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి వచ్చిన అధికారులు.. అదే తరహాలో చార్మినార్ పరిసరాల్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అక్కడి మాదిరిగా పాదచారులు సాఫీగా నడిచేందుకు తగిన ఏర్పాట్లతో పాటు గజిబిజి.. వాహన, ధ్వని కాలుష్యం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. పరిసరాల్లో పోస్టర్లు, హోర్డింగులు, గాల్లో వేల్లాడే విద్యుత్, టెలిఫోన్ వైర్లు తొలగించనున్నారు.
అమృత్‌సర్‌లో చేశారు..?
స్వర్ణదేవాలయం సరిసరాల్లో ఇరుకుగా ఉన్న రహదారులను, ఫుట్‌పాత్‌లను విస్తరించారు. గందరగోళంగా ఉన్న విద్యుత్, కేబుల్ వైర్లను తొలగించారు. పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. దుకాణాలపై ఉన్న పెద్దపెద్ద బోర్డులను, రోడ్డువైపున్న పెద్ద హోర్డింగుల్ని తీసేశారు. రోడ్లపై రద్దీతో ఉండే మార్కెట్లను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఆలయానికి చుట్టూ వీధుల్ని ఆధునీకరించారు. వీధుల్లోని షాçపులన్నింటి ముందు భాగం ఒకే తీరుగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా అధికారులతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. పాత నిర్మాణాలు దెబ్బతినకుండా అందంగా తీర్చిదిద్దారు. అమృత్‌సర్ దేవాలయానికీ, చార్మినార్‌కు పలు అంశాల్లో సామీప్యత ఉండటంతో ఇక్కడా ఆ తరహాలోనే అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.
ఇక్కడేం చేయవచ్చు..
చార్మినార్ వద్దగల వీధి వ్యాపారులను దాదాపు కిలోమీటర్ మేర తరలించేందుకు సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ముందుగా రాజకీయ నేతలతో సంప్రదించి, వారి ద్వారా వ్యాపారులకు తగిన అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. అక్కడి మాదిరిగా కేబుళ్లు , విద్యుత్ వైర్లు పైకి కనిపించకుండా భూగర్భంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్వర్ణ దేవాలయానికి సమీపంలోని టౌన్‌హాల్‌లో ఒక మ్యూజియాన్ని ఏర్పాటుచేసి అందులో చరిత్రకు సంబంధించిన వివిధ కళాఖండాలు, ఫొటోలు, దస్త్రాలు భద్రపరిచారు. చార్మినార్‌కు సమీపంలోని సర్దార్‌మహల్‌ను పునరుద్ధరించి అందులో హైదరాబాద్ చరిత్ర, విశేషాలు తెలిపే మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. చార్మినార్‌కు నాలుగుదిక్కులా ఉన్న కమాన్లను అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే మచిలీకమాన్ పనులు పురోగతిలో ఉన్నాయి.
అభివృద్ధి పనులపై అధికారుల సమావేశం..
చార్మినార్ వద్ద ఏయే పనులు చేయాలనే అంశంపై చర్చించేందుకు గురువారం మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ అధ్యక్షతన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్ కోసం రెండు కాంప్లెక్సులు నిర్మించేందుకు ఆస్కి సహకారంతో టెండర్లు ఆహ్వానించాలని సూచించారు. ఆర్‌టీసీ బస్టాండ్ వద్ద, ఖిల్వత్ వద్ద వీటిని నిర్మించనున్నారు. ఖిల్వత్ వద్ద కూల్చేసిన పెన్షన్ ఆఫీసు డెబ్రిస్‌ను వెంటనే తొలగించాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద సైతం స్థలాన్ని ఖాళీ చేసి పార్కింగ్‌కు అనువుగా మార్చనున్నారు. విద్యుత్ వైర్లు డక్ట్‌లో ఏర్పాటు చేయాలని, పోల్స్ అధునాతనమైనవి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలన్నింటి ముందు భాగం ఒకేలా ఉండేందుకు తొలుత లాడ్‌బజార్‌వైపు ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు తగిన డిజైన్ రూపొందించాల్సిందిగా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment