సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర సిగలో మరో ఆకర్షణ వచ్చి చేరనుంది. హైదరాబాద్‌కు ప్రతీక అయిన చారిత్రక చార్మినార్ ప్రాంతానికి న్యూ జనరేషన్ ట్రామ్‌వే ఏర్పాటు దిశగా రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మెట్రోరైలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వివిధ రవాణా వ్యవస్థలను వినియోగించుకోవడం ద్వారా ప్రజా రవాణావైపు ప్రజానీకాన్ని మళ్లించేందుకు ట్రామ్‌వేను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫ్రాన్స్‌లోని బోర్డో నగరంతో కుదుర్చుకున్న సిస్టర్ సిటీ ఒప్పందంలో భాగంగా పట్టణ ప్రాంత పునరుద్ధరణ కింద అక్కడ విజయవంతంగా నడుస్తున్న ట్రామ్‌వేను హైదరాబాద్‌లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు బోర్డో మెట్రోపోలిస్ ప్రతినిధి విక్టర్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. పలువురు ఉన్నతాధికారులతో పాటు చార్మినార్ పథకం ప్రాజెక్టు డైరెక్టర్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ ముషార్రఫ్ ఫారుఖీని కలిశారు. సమగ్ర అధ్యయనం చేపట్టాక ట్రామ్‌వే మార్గాన్ని ఎంపిక చేయనున్నారు.
సుందరీకరణ పనులు దాదాపు పూర్తి...
స్వచ్ఛ భారత్ పథకంలో భాగమైన స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాల ప్రాజెక్టు కింద చార్మినార్ ఎంపికవడంతో దాని పరిసరాల్లో చేపట్టిన సుందరీకరణ పనులు (చార్మినార్ పాదచారుల పథకం) ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం తరహాలో పరిసరాల్ని అధికారులు తీర్చిదిద్దుతున్నారు. నగరానికి వచ్చే పర్యాటకుల్లో ఎక్కువశాతం చార్మినార్‌ను సందర్శించకుండా వెనుదిరగరు. ఈ నేపథ్యంలో పర్యాటక ఆకర్షణగా, పర్యావరణపరంగానూ ట్రామ్‌వే ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
కోల్‌కతా మినహా మిగిలిన నగరాల్లో చతికిల...
దేశంలో చెన్నై, ఢిల్లీ, కాన్పూర్, ముంబై, నాసిక్, పట్నా తదితర ప్రాంతాల్లో వందేళ్ల క్రితమే ట్రామ్‌వేలను ఏర్పాటు చేసినప్పటికీ అవి కొనసాగలేక మూతపడ్డాయి. అయితే ఒక్క కోల్‌కతాలో మాత్రమే ప్రజల అభిమానాన్ని చూరగొనడంతో అక్కడ ట్రామ్‌వే సేవలు కొనసాగుతున్నాయి.
చార్మినార్ కేంద్రంగా పాతబస్తీకి...
ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో మెట్రోరైలు త్వరలో ఎంజే మార్కెట్ మీదుగా పరుగులు తీయనుంది. అక్కడి నుంచి చార్మినార్ లేదా గుల్జార్‌హౌస్ వరకు ట్రామ్‌వే ఏర్పాటు చేయాలని ఏడాదిన్నర క్రితమే అధికారులు భావించారు. చార్మినార్ వద్ద ఉన్న చిరువ్యాపారులను అక్కడి నుంచి తరలించేందుకు సాలార్జంగ్ మ్యూజియం వద్ద స్కైవే నిర్మాణానికి ఇటీవల సిద్ధమయ్యారు. దీంతోపాటు పార్కింగ్ సదుపాయాలు మొదలైనవి పరిగణనలోకి తీసుకొని అన్నివిధాలా అనుకూలమైన మార్గంలో చార్మినార్ వైపు ట్రామ్‌వేను ఏర్పాటు చేయాలని ప్రస్తుతం యోచిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, బోర్డో సిటీ మధ్య కుదిరిన సిస్టర్‌సిటీ ఒప్పందంలో భాగంగా ట్రామ్‌వేకు బోర్డో మెట్రోపోలిస్ సాంకేతిక సహకారం అందిస్తోంది.
మరికొన్ని మార్గాల్లోనూ ట్రామ్‌వేపై వచ్చిన అభిప్రాయాలివీ
చార్మినార్ ఔటర్ రింగ్‌రోడ్ మీదుగా..అఫ్జల్‌గంజ్–సాలార్జంగ్ మ్యూజియం–మీరాలం మండి–శాలిబండ–ముర్గీచౌక్–ఖిల్వత్ ప్యాలెస్–సిటీ కాలేజ్–హైకోర్టు–అఫ్జల్‌గంజ్.చార్మినార్ ఇన్నర్ రింగ్‌రోడ్ మీదుగా..గుల్జార్‌హౌస్–మిట్టికాషేర్–రాయల్ ఫంక్షన్ హాల్–మీర్‌మొమిన్ దర్గా–మొఘల్‌పురా–పారిస్ కార్నర్–పంచ్‌మొహల్లా–మిట్టికాషేర్– గుల్జార్‌హౌస్.
ఇతర మార్గాలు
మదీనా– గుల్జార్ హౌస్– ఖిల్వత్–హుస్సేనీ ఆలం–గోల్కొండ
గోల్కొండ– కుతుబ్‌షాహీ టూంబ్స్
ఎంజే మార్కెట్–అబిడ్స్–నాంపల్లి– స్నో వరల్డ్–ట్యాంక్‌బండ్
ఏడాదిన్నర క్రితం చేసిన ప్రాథమిక అధ్యయనం మేరకు..
పైలట్ ప్రాజెక్టుగా ఎంజే మార్కెట్ నుంచి చార్మినార్ వరకు ట్రామ్‌వే 2.3 కి.మీ.
ప్రాజెక్టు అంచనా వ్యయం(రూ. కోట్లలో) 250
ఆదాయం అంచనా(రూ. కోట్లలో) 75
నిర్వహణ ఖర్చులు (రూ. కోట్లలో) 45
సగటు వేగం గంటకు 20 కిలోమీటర్లు
ఒక్కో వాహనంలో ప్రయాణికుల సామర్థ్యం 650
మెట్రోరైలు కంటే ప్రయాణ చార్జీ తక్కువ.
భూసేకరణ అవసరం ఉండదు. ఉన్నా చాలా స్వల్పం
పట్టాల మధ్య నుంచే విద్యుత్ సరఫరా.దీన్నే న్యూ జనరేషన్ ట్రామ్‌వేగా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment