![Kamal Hasan Announces New Party - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/23/kamal_haasan.jpg.webp?itok=LvMULV-S)
పార్టీ పేరును ప్రకటిస్తున్న మక్కల్ నీది మయ్యమ్
తమిళనాడులో మరో సినీ ప్రముఖుడు కమల్‌హాసన్ ‘మక్కళ్ నీది మయ్యం’ (ప్రజా న్యాయ వేదిక) పేరిట బుధవారం లాంఛనంగా తన పార్టీని ప్రారంభిం చారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్‌లో కనుమరుగ య్యాక అక్కడి రాజకీయాల్లో ఏర్పడిందని చెబుతున్న శూన్యాన్ని భర్తీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నవారిలో ఆయన కూడా చేరారు.
నూతన సంవత్సర ఆగమన వేళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు ప్రకటించినా పార్టీ ఏర్పాటును మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి వాయిదా వేసుకున్నారు. ఇద్దరూ వర్తమాన తమిళనాడు దుస్థితిని చూసి ఆగ్రహించి రాజకీయా ల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే రజనీకాంత్ ఇంతవరకూ ఎవరికీ పరిచయం లేని, బోధపడని ‘ఆధ్యాత్మిక రాజకీయాలు’ గురించి ప్రస్తా విస్తే.. హేతువాద దృక్పథం ఉన్న కమల్‌హాసన్ తాను ప్రజల చేతిలో ఆయుధాన్నని ప్రకటించారు.
రజనీకాంత్ ఎవరితో వెళ్తానన్న అంశంలో స్పష్టతనీయకపో యినా ఆయన వెనక బీజేపీ ఉన్నదన్న అనుమానాలు తలెత్తాయి. కమల్ మాత్రం బీజేపీకి, హిందుత్వకు వ్యతిరేకంగా ప్రకటనలిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సద స్సులో కమల్ ప్రజాసేవ గురించి, అవినీతి నిర్మూలన గురించి మాట్లాడటం తప్ప తన పార్టీ విధానాలేమిటో స్పష్టతనీయలేదు. ఒకపక్క అవినీతి నిర్మూలన గురించి మాట్లాడుతూనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హీరో అని ఆయన ప్రకటించడం సహజంగానే అందరినీ విస్మయపరిచి ఉంటుంది.
పొరుగునున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవడానికి పాలక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు భారీ మొత్తంలో లంచం ఇవ్వజూపిన ఉదంతం కమల్‌కు తెలియదంటే ఎవరూ నమ్మరు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆడియో, వీడియో సాక్ష్యాలున్నప్ప టికీ ఆ కేసు ఎందుకు ముందుకు సాగటం లేదో కూడా ఆయనకు అర్ధమై ఉండాలి.
అలాగే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 23మంది ఎమ్మెల్యేలనూ, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసి టీడీపీలో చేర్చుకోవడం, ఫిరాయింపు ఎమ్మె ల్యేల్లో కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టడం తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలియ దంటే ఆయన రాజకీయ పరిణతిపైనా, చిత్తశుద్ధిపైనా సంశయం కలుగుతుంది. పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకనబెట్టుకెళ్లిన చందాన పోయి పోయి బాబు ప్రస్తావన తీసు కురావడం ద్వారా పార్టీ ఆవిర్భావ సభ ఔన్నత్యాన్ని కమల్ తగ్గించుకున్నారు.
సినిమా మాధ్యమం ప్రజలను ఆకట్టుకునే బలమైన సాధనం కనుక ఆ రంగంలో ప్రజాదరణ పొందినవారు రాజకీయాల్లోకొచ్చి అదృష్టాన్ని పరీక్షించు కోవాలనుకుంటారు. అది సహజం. తమిళనాడులో సీఎన్ అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్‌లు సినిమా రంగం ద్వారా రాజకీయాల్లోకి వచ్చినవారే. అయితే వీరందరి మూలాలూ తమిళనాడును ఒకప్పుడు ప్రభంజనంలా చుట్టు ముట్టిన ద్రవిడ ఉద్యమంలో ఉన్నాయి.
హేతువాదం, ఆత్మగౌరవం, మహిళల హక్కులు, కుల నిర్మూలన సిద్ధాంతాలతో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నడిపిన పెరియార్ రామస్వామి సామాజిక, సాంస్కృతిక రంగాల్లో తాము సాధించుకున్న విజయాలను సుస్థిరం చేసుకోవడానికి ద్రవిడ కజగం పార్టీని స్థాపించారు. అందులో పాలుపంచుకున్న అన్నాదురై అనంతరకాలంలో ఆయనతో విభేదించి డీఎంకే పార్టీని ఏర్పాటుచేసుకున్నారు. దాని నేతృత్వంలో సాగిన హిందీ వ్యతిరే కోద్యమం తమిళనాడు రాజకీయాలను కీలక మలుపు తిప్పింది.
అనంతరం 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ దిగ్గజం కామరాజ్ నాడార్ ఒక విద్యార్థి నాయకుడి చేతిలో ఓటమి చవిచూడటం పెను సంచలనం. ఆ తర్వాత జాతీయ పార్టీలకు అక్కడ స్థానం లేకుండాపోయింది. కాంగ్రెస్ అయినా, అనం తరకాలంలో బీజేపీ అయినా ద్రవిడ పార్టీల దయాదాక్షిణ్యాలు లేనిదే ఒక్క సీట యినా గెలవలేని దుస్థితిలో పడ్డాయి. ఎంజీఆర్ అనంతరం ఆయన వారసురాలిగా జయలలిత ప్రజాభిమానాన్ని పొందగలిగారు.
ప్రధాన ద్రవిడ పార్టీలతో సంబంధం లేకుండా, అసలు ద్రవిడ ఉద్యమం ప్రస్తావనే లేకుండా రాజకీయాల్లోకొచ్చిన తొలి తమిళ తారలు రజనీకాంత్, కమల్ హాసన్‌లే. వీరు తమ ప్రయత్నాల్లో ఏమాత్రం విజయం సాధించినా తమిళనాడు చరిత్ర మరో మలుపు తిరిగినట్టవుతుంది. గత అయిదు దశాబ్దాల్లో వైకో నేతృ త్వంలోని ఎండీఎంకే, నటుడు విజయకాంత్ సారథ్యంలోని డీఎండీకే, డాక్టర్ రాందాస్ నాయకత్వంలోని పీఎంకే, ఇంకా అనేక ఇతర పార్టీలు రంగంలో కొచ్చాయి.
ఇవన్నీ ద్రవిడ ఉద్యమం పేరు చెప్పుకునే ప్రజలను ఆకట్టుకోవాలని చూశాయి. ఉత్థానపతనాలు చవిచూశాయి. విజయకాంత్ పార్టీ ఒకానొక దశలో తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నదని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ అయిదేళ్లు గడవకుండానే అది కాస్తా కొడిగట్టింది. వర్తమాన తమిళ రాజకీయాల పట్ల అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నది వాస్తవం.
జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీకి, ముఖ్యమంత్రి పద వికి తాను సహజ వారసురాలినని అంచనా వేసుకుని ఆ దిశగా పావులు కదిపిన జయ సన్నిహితురాలు శశికళ అవినీతి కేసులో శిక్ష పడి జైలు పాలయ్యారు. ఆ తర్వాత తన మేనల్లుడు దినకరన్ ద్వారా పార్టీని నడిపించాలనుకుంటే అది కాస్తా అడ్డం తిరిగి ఆ పార్టీయే చేజారింది. ఆయన ఆర్‌కె నగర్ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోపు అన్నా డీఎంకే తన చెంతకే చేరుతుందన్న విశ్వాసమేదో ఆయనకు ఉన్నట్టుంది. అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంల మధ్య కొట్టుమిట్టాడుతూ అయోమయంలో కాలం గడుపుతోంది. ఈ పరిస్థితులే కమల్‌నూ, రజనీని రాజకీయాల్లోకి ఆకర్షించి ఉంటాయి. అయితే విస్పష్టమైన విధానాలూ, సిద్ధాంతాలూ, కార్యాచరణ ఉన్న ప్పుడే ఎవరైనా ఈ రంగంలో రాణిస్తారు. ఆ సంగతిని కమల్‌హాసన్, రజనీకాంత్ గ్రహించాలి.
Comments
Please login to add a commentAdd a comment